Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
4
ఏఁవండీ యిలా వొదిలేసి వొంటరిగా నన్నూ పిల్లల్నీ
యెక్కడికి చీకట్లో వెళ్ళిపోతున్నారు
యిలాగ మంచులో పడిపోతున్నారు?
ఇక్కడ మమ్మల్ని భయంతో కట్టేసి
బాధతో పొడిచేసి
అరవకుండా ఆకల్ని నోట్లో కుక్కేసి
అయ్యయ్యో ముండకోసం జూదంకోసం తాగుడుకోసం
అర్ధరాత్రి వెళ్ళిపోతున్నారు
దేవుడా ఆడదాన్ని అసహాయని ఆరోసారి గర్భిణిని
నా కన్నీళ్ళు చూడవా
నా మొరాలకించవా
కట్టుకున్న వెధవకి కాస్తయినా జాలిలేదురా దేవుడా
వాణ్ణి శిక్షించేవారు లేరా
నన్ను రక్షించేవారు రారా
ఆవిడిగోల గుమ్మం దాటకుండా అడ్డుకుంది మంచు
అతను చెవిని పడకుండా ధ్వనిని ఆవర్తించింది మంచు
అతని పాపం బట్టబయలు పడకుండా చుట్టూ కప్పింది మంచు
అసహాయంగా చూస్తూ నక్షత్రం, ఆకాశంమీద గిలగిల్లాడింది.
5
హలో హలో
అయ్యా డాక్టరుగారూ, నేనండీ...నేన్నేను
మావాడు బిగుసుకుపోతున్నాడండీ - ప్రమాదం
ఆదర్శవాది అర్ధరాత్రి బురఖాతీసి
అద్దంలో నగ్నంగా ప్రతిఫలించడం చూశాడు
అమ్మాయిల కన్నుల్లో సరదాకీ సభ్యతకీ
మధ్య జరుగుతూన్న యుద్ధాన్ని చూశాడు
మావాడు మంచివాడండీ
మావాడు చచ్చిపోతున్నాడండీ
హయ్యో హయ్యో
మంచుపడి చల్లపడి నల్లపడి
చచ్చిపోతున్నాడండీ
ఒక్కసారి రండి రక్షించండి దయుంచండి
నుంచున్న పళాన రండి
హలో హలో...అయ్యో అయ్యో!
* * *
---1966



