యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల విశేషాలు
తెలంగాణ రాష్ట్రంలో భక్తులకు ఆరాధ్య దైవంగా, కొలిచిన వారి కోర్కెలు తీర్చే, కొంగు బంగారంగా నిలిచే యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నాడు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను చూడటానికి వెయ్యి కన్నులు కావాలేమో అన్న విధంగా జరపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నాహాలూ చేసింది. ఈనెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారి తిరు కళ్యాణానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
యాదగిరిగుట్ట పరమ పావనమైన పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన నరసింహ స్వామివారు ఎంతో మహిమాన్వితుడు. నీవే శరణని మొక్కిన వారిని ఆశ్రిత పక్షపాత్రుడై ఆదుకుంటాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణలో హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడి, ప్రహ్లాదుడిని కాపాడి తాను భక్త వశుడనని ఆయన నిరూపించుకున్నాడు. ఆ స్వామి కొలువైన పరమ మహిమాన్వితమైన క్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించి తరించడానికి తెలుగు ప్రజలు ఎంతో భక్తిప్రపత్తులతో వస్తారు. శ్రీ జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గండభేరుండ నరసింహ, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీ ఉగ్రనరసింహ స్వామిగా ఐదు రూపాల్లో ఆవిర్భవించిన స్వామివారిని దర్శించి తరిస్తారు. స్వామివారు ఐదు రూపాల్లో వెలిసిన ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రమని వ్యవహరిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను చూసి తరించే అవకాశం మరోసారి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ధన్యులు.