పూజ గదిలో ఎలాంటి విగ్రహాలు ఉంచుకోవాలి..ఎలాంటివి ఉంచుకోకూడదు!

 


 

పూజ, విగ్రహారాధన భారతీయ భక్తి, ఆధ్యాత్మికత మార్గంలో చాలా శ్రేష్టమైనవి. హిందూ మతంలో మోక్షాన్ని సాధించడానికి భక్తి మార్గం, దేవతారాధన కూడా ఒక దశగా పరిగణింపబడుతుంది.  ప్రతి హిందువు ఇంట్లో దేవతారాధన కోసం పూజ గది ఖచ్చితంగా ఉంటుంది. పూజ గది లేకపోయినా కనీసం ఇంట్లోనే ఒక చిన్న అల్మారాలో దేవుడి విగ్రహాలు,  దేవుడి ఫొటోలు ఉంచి పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడి గదిలో ఎలాంటి విగ్రహాలు ఉండాలి? ఎలాంటివి ఉండకూడదు? అనే విషయం చాలామందికి తెలియదు.  ఇవి పాటించకపోవడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట. ఇంతకీ పూజ గదిలో ఉండకూడని విగ్రహాలు ఏంటి? పూజ గది నియమాలు ఏంటి? తెలుసుకుంటే..

విరిగిన విగ్రహాలు, పటాలు..

విరిగిన విగ్రహాలు, పటాలు పూజ గదిలో ఉండవచ్చని,  ఎన్నో రోజులు, ఏళ్లుగా పూజలు అందుకున్న దేవుళ్లను విరిగిపోయాయనే కారణం చేత పూజ గది నుండి తీసి పడేయకూడదని చాలామంది అంటుంటారు.  అయితే విరిగిన విగ్రహాలు లేదా పటాలను పూజ గదిలో ఉంచడం మంచిది కాదు.. ఇలాంటి విగ్రహాలను ఎక్కువ కాలం ఉంచుకుని పూజించడం వల్ల దేవతలు సంతోషించరు.  ఇలాంటి విగ్రహాలు లేదా పటాలను పూజించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.. అశాంతి, కుటుంబ సభ్యులకు జబ్బులు, పనులలో ఆటంకం వంటివి ఏర్పడతాయట.  అయితే విరిగిన విగ్రహాలు,  పటాలను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. దేవుడి పటాలు అయితే వాటికి ఉన్న అద్దాన్ని తీసి లోపలున్న దేవుడి ఫొటో కాగితాన్ని పారే నీటిలో కలపాలి.  ఇక విగ్రహాలు అయితే వాటిని దగ్గరలో ఉన్న దేవుడి గుడిలో నాగలు,  రావి చెట్టు వంటి వాటి నీడలో ఉంచేయాలని.

ఉగ్ర రూప దేవతలు..

ఉగ్ర రూపంలో ఉండే దేవతలు అంటే మహిషాసుర మర్థిని,  శివుడి తాండవ రూపం,  వారాహి మాత ఇలాంటి దేవతలను సాధారణ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోకూడదు. నిజానికి ఇలాంటి దేవతల ఆరాధన కేవలం ఉపాసకులు మాత్రమే చేస్తుంటారు. ఈ దేవతలను సాధారణ సమయాలలో పూజించరు.  వీరికి రాత్రి సమయం,  లేదా సూర్యాస్తమయం తర్వాత నుండి సూర్యోదయ సమయంలోపు పూజలు నిర్వహిస్తారు.  ఈ దేవతలను శక్తి దేవతలు అంటారు.  చాలా వరకు క్షుద్ర శక్తుల ఆవాహన కోసం పూజలు చేస్తుంటారు.  ఇలాంటి దేవతల ఉగ్రరూపం ఇంట్లో ఉద్రిక్తత,  అశాంతికి కారణం అవుతుందట.  కుటుంబ సభ్యుల మద్య గొడవలు,  మానసిక ఒత్తిడి మొదలైన సమస్యలు కలుగుతాయి.

పెయింటింగ్స్..

కొన్ని రకాల పెయింటింగ్స్ కూడా కొందరి పూజ గదులలో ఉంచుతుంటారు. ముఖ్యంగా మహాభారత యుద్దం, హింసాత్మక సంఘటనలకు సంబంధించిన పెయింటింగ్స్ ఇంట్లో ఉద్రిక్త వాతావరణానికి కారణం అవుతాయట. ఇవి ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి.  కుటుంబంలో గొడవలు,  వాదనలు,  అశాంతికి కారణం అవుతాయి.

శివ లింగాలు..

వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంచుకోవడం మంచిది కాదని చెబుతారు. దీని వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు, వాస్తు దోషాలు ఏర్పడతాయని అంటారు.


జంతు, పక్షుల బొమ్మలు..

పూజ గదిలో జంతువులు, పక్షులకు సంబంధించిన ఫొటోలు,  అలంకారం కోసం విగ్రహాలు వంటివి ఉంచుకోకూడదు.  ఇవి రోజూ చేసే పూజ ప్రభావాన్ని తగ్గిస్తాయట.  పూజ ద్వారా దక్కాల్సిన ఫలితాన్ని దక్కకుండా చేస్తాయట.  ఇంట్లో పాజిటివ్ శక్తికి అంతరాయం కలిగిస్తాయట.


మరణించిన పెద్దలు ఫొటోలు..

కొందరు పెద్దలకు గౌరవం ఇచ్చే కారణంతో మరణించిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచుతుంటారు. ప్రార్థనా స్థలాలలో మరణించిన వారి ఫోటోను ఉంచితే పూజ గది పవిత్రత దెబ్బతింటుందట.  ఇది ఇంట్లో శాంతిని,  సామరస్యతను అడ్డుకుంటుందట.

నటరాజ విగ్రహం..

శివుడు  నాట్యం చేస్తున్న భంగిమలో ఉండే విగ్రహాన్ని నటరాజ విగ్రహం అంటారు. ఈ విగ్రహం మంచిదే అయినా దీన్ని పూజ గదిలో కాకుండా ఇతర ప్రదేశాలలో ఉంచడం మంచిది.  నటరాజ భంగిమ శివతాండవంలో భాగం. ఇది ఇంట్లో శాంతికి భంగం కలిగిస్తుందని అంటారు.  


పరిమాణం..

పూజ గదిలో ఏవైనా విగ్రహాలు ఉంచితే అవి సాధారణ పరిమాణంలో ఉండాలి. శివలింగం కూడా బొటనవేలు పరిమాణంలో మాత్రమే ఉండాలి.  మిగిలిన విగ్రహాలు ఏవైనా ఉన్నా మరీ పెద్దగా ఉండకూడదు.  పెద్దగా ఉన్న విగ్రహాలు పూజలలో ఏకాగ్రతను కష్టం చేస్తాయట.  సానుకూల శక్తిని తగ్గిస్తాయట.


                                                 *రూపశ్రీ.


More Aacharalu