సాలగ్రామం ఇంట్లో ఉంచుకోవచ్చా..ఒకవేళ ఉంటే ఈ తప్పులు మాత్రం చేయకండి..!
సాలగ్రామం విష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు. పూర్వం ఒక స్త్రీ మూర్తి విష్ణువును తన కుమారుడిగా పుట్టమని వరం అడుగుతుంది. ఆమే వరాన్ని తీర్చడానికై విష్ణువు ఆమెను గండకీ నదిగా జన్మించమని ఆదేశిస్తాడు. ఆయన ఆ గండకీ నదిలో సాలగ్రామ రూపంలో అవతరిస్తాడు. సాలగ్రామానికి, సాలగ్రామ పూజకు చాలా విశిష్టత ఉంది. సాలగ్రామ పూజ, ఆ పూజా ఫలం ఎంత విశిష్టమైనవో.. సాలగ్రామ పూజకు పాటించాల్సిన నియమాలు పాటించకపోతే కలిగే నష్టం కూడా అలాగే ఉంటుంది. చాలావరకు సాంప్రదాయ కుటుంబాలలో.. వైష్ణవ సాంప్రదాయంలో సాలగ్రామ పూజకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంటు, ముట్టు కలవకుండా ప్రతిరోజూ పూజలు జరుగుతూ ఉండాలి. అందుకే సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకునే విషయంలో పెద్దలు వారిస్తుంటారు. ఏమాత్రం తప్పులు జరిగినా వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకుంటే చేయాల్సిన.. చేయకూడని పనులేంటో తెలుసుకుంటే..
ఇంట్లో సాలగ్రామం ఉన్నట్టైతే ఆ ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా దేవుడి గది చాలా శుభ్రంగా ఉండాలి. లేకపోతే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట. కుటుంబంలో ఇబ్బందులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.
ఇంట్లో ఎట్టి పరిస్థితులలోనూ ఒకటి కంటే ఎక్కువ సాలగ్రామాలు ఉంచుకోకూడదు. ఒక వేళ అలా ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు, జీవితంలో దారిద్ర్యం ఏర్పడతాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తరువాత సాలగ్రామానికి పూజ చేయాలి. ప్రతిరోజూ సాలగ్రామాన్ని నీటితో శుద్ది చేయాలి. కుదిరితే పంచామృత అభిషేకం చేయాలి. నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం రోజూ వెలిగించడం కుదరకపోతే సాధారణ దీపారాధన తప్పకుండా చేయాలి.
సాలగ్రామ పూజ చేసేటప్పుడు విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించడం మంచిది. "ఓం నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్" ఈ మంత్రాన్ని పఠించాలి. ఇది జీవితంలో ఆనందాన్ని, కుటుంబ అభివృద్దిని తెచ్చిపెడుతుంది.
శివలింగాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఎలాగైతే రోజంతా నీటిలో ఉంచుతారో.. అలాగే సాలగ్రామాన్ని కూడా నీటిలో ఉంచడం చాలా మంచిది.
*రూపశ్రీ.