షిరిడి సాయిబాబా  ఇచ్చిన 9 నాణేల మహత్యం.. ఆధ్యాత్మిక అంతరార్థం!

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో షిరిడి సాయిబాబా పేరు విశిష్ట స్థానం కలిగి ఉంది. ఆయన హిందూ–ముస్లిం ఏకత్వాన్ని బోధిస్తూ, ప్రేమ, దయ, సేవ, విశ్వాసం అనే విలువలతో కోట్లాది భక్తుల హృదయాలను గెలుచుకున్నారు. సాయిబాబా జీవితంలోని ప్రతి సంఘటనలో ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. అలాంటి అత్యంత పవిత్రమైన సంఘటనల్లో ఒకటి.. మహాసమాధికి ముందు భక్తురాలు లక్ష్మీబాయి షిండేకి షిరిడి సాయిబాబా ఇచ్చిన 9 నాణేలు.

ఈ 9 నాణేలు కేవలం డబ్బు కాదని..  అవి భక్తి, జీవన విధానం, ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించే దివ్య బోధలని చెబుతారు.

లక్ష్మీబాయి శిండే ఎవరు?

లక్ష్మీభాయి షిండే  షిరిడిలో నివసించే ఒక భక్తురాలు. ఆమెకు సాయిబాబాపై అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజూ ప్రేమతో భోజనం తయారుచేసి బాబాకు సమర్పించేది. సాయిబాబా కూడా ఆమె భక్తిని ఎంతో ఆదరించేవారు.

సాయిబాబా చివరి దశలో, తన సమీప భక్తులను పిలుస్తూ కొంతమందికి ప్రత్యేక బోధలు ఇచ్చారు. అదే సమయంలో లక్ష్మీబాయిని పిలిచి మొదట 5 నాణేలు, తరువాత మరో 4 నాణేలు ఇచ్చారు. మొత్తం 9 నాణేలు ఆమె చేతిలో ఉంచారు.

భక్తుల నమ్మకం ప్రకారం, ఈ 9 నాణేలు “నవవిధ భక్తి”కి సంకేతం.

నవవిధ భక్తి — 9 నాణేల అసలు అర్థం

హిందూ ధర్మంలో భక్తిని తొమ్మిది మార్గాలుగా వివరించారు. వీటిని “నవవిధ భక్తి” అంటారు. సాయిబాబా ఇచ్చిన 9 నాణేలు ఈ తొమ్మిది భక్తి రూపాలను సూచిస్తాయని భావిస్తారు.

 శ్రవణం ..

దేవుని కథలు, లీలలు, ఉపదేశాలు వినడం.

భక్తి మొదలయ్యేది వినడం ద్వారా. మంచి మాటలు, ఆధ్యాత్మిక జ్ఞానం మనసును పవిత్రం చేస్తాయి. సాయిబాబా భక్తులు ఆయన లీలలను వినడం ద్వారానే విశ్వాసం పెంచుకోవడం జరిగింది.

మంచి విషయాలు వింటే మనసు శాంతి పొందుతుందని చెప్పడమే శ్రవణం వెనుక ఉన్ ఉద్దేశం..

కీర్తనం..

దేవుని నామస్మరణ చేయడం, భజనలు పాడడం.

“ఓం సాయి రామ్” అనే నామస్మరణే అనేక మందికి మానసిక ధైర్యం ఇచ్చింది. నామస్మరణ ద్వారా మనసు దేవుని వైపు కేంద్రీకృతమవుతుంది.

భగవంతుడి నామాన్ని జపించడం మనిషిలో సానుకూల శక్తిని పెంచుతుంది.

స్మరణం..

ఎల్లప్పుడూ దేవుణ్ణి మనసులో గుర్తుంచుకోవడం. కష్టసమయంలోనే కాదు, సంతోష సమయంలో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకోవడమే నిజమైన భక్తి.

మనసులో దైవచింతన ఉంటే భయం తగ్గుతుందని  స్మరణం చెబుతుంది.

పాదసేవనం..

దేవుని లేదా గురువు సేవ చేయడం. సేవ అంటే కేవలం పూజలు కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఆదుకోవడం కూడా సేవే అని సాయిబాబా చెప్పారు.

మానవ సేవే మాధవ సేవ అని దీని అర్థం.

 అర్చనం..

పూజలు, పుష్పార్చనలు చేయడం. భక్తితో చేసిన చిన్న పూజ కూడా గొప్పదే. సాయిబాబా ఎప్పుడూ భక్తిలోని నిజాయితీని ముఖ్యమని  భావించారు.

భక్తికి ఆర్భాటం అవసరం లేదు. నిజమైన మనసు చాలుని దీని అర్థం.

వందనం..

వినయంతో నమస్కరించడం. వందనం అనేది కేవలం శరీరంతో నమస్కారం కాదు; హృదయపూర్వక గౌరవం.

వినయం ఉన్నచోట దైవకృప ఉంటుందని దీని అర్థం.

దాస్యం..

తాను దేవుని సేవకుడిననే భావనతో జీవించడం. అహంకారం విడిచి సేవాభావంతో జీవించడం ద్వారా మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు.

సేవలో స్వార్థం లేకుండా ఉండాలి.


సఖ్యం..

దేవుణ్ణి స్నేహితుడిగా భావించడం. సాయిబాబాతో ఎంతోమంది భక్తులు స్నేహితుడిలా మాట్లాడేవారు. భయంతో కాకుండా ప్రేమతో దేవుణ్ణి చేరుకోవాలని ఆయన బోధించారు.

దైవంతో ప్రేమ సంబంధం ఏర్పడాలని దీని అర్థం.

ఆత్మనివేదనం..

తనను పూర్తిగా దేవునికి అర్పించుకోవడం. ఇది భక్తిలో అత్యున్నత స్థాయి. “నా జీవితం నీ చిత్తం ప్రకారం నడవాలి” అనే సంపూర్ణ సమర్పణ భావన.

సంపూర్ణ విశ్వాసం ఉన్నచోట ఆందోళన తగ్గుతుంది.

9 నాణేల మరో ఆధ్యాత్మిక అర్థం..

కొంతమంది ఆధ్యాత్మిక పండితులు ఈ 9 నాణేలను 9 గుణాలకు ప్రతీకగా కూడా చెబుతారు:

అహంకారం లేకపోవడం
అసూయ లేకపోవడం
సహనం
ప్రేమ
దయ
విశ్వాసం
సేవాభావం
క్షమ
సమర్పణ

అంటే సాయిబాబా మనిషి ఎలా జీవించాలో ఈ 9 నాణేల ద్వారా సూచించారని భావిస్తారు.

                             *రూపశ్రీ.


More Saibaba