సంకష్ట చతుర్థి.. మాఘమాసంలో అస్సలు మిస్సవకండి..!

ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. సంకష్ట చతుర్థి రోజున చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, కీర్తి, సంపద లభిస్తాయని నమ్ముతారు. ప్రతి నెలలో వచ్చే సంకష్టి చతుర్థికి వేరే పేరు ఉంది. మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థిని ద్విజప్రియ సంకష్టి చతుర్థి అంటారు. 2026 లో సంకష్ట చతుర్థి ఫిబ్రవరి 5, గురవారం వచ్చింది. ఈ రోజున గణేశుడి ద్విజప్రియ రూపాన్ని పూజిస్తారు. అసలు ద్విజప్రియ రూపం ప్రత్యేకత ఏంటి? ఈ రూపంలో వినాయకుడిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది? తెలుసుకుంటే..
సంకష్ట చతుర్థి..
కృష్ణ పక్ష చవితి తిథినే సంకష్ట చతుర్థి అని అంటారు. 4వ తేదీ రాత్రి 12.15 నిమిషాల నుండి 5వ తేదీ రాత్రి 12.26 వరకు చవితి తిథి ఉంది. అంటే.. 5వ తేదీ సంపూర్ణంగా చవితి తిథి వచ్చినట్టు. ఈ రోజు సంకష్ట చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు.
ద్విజప్రియ రూపం..
మాఘమాసంలో వచ్చే సంకష్ట హర చతుర్థి రోజు వినాయకుడిని ద్విజప్రియ రూపంలో ఆరాధిస్తారు. ద్విజప్రియ అనే పదానికి చాలా విశిష్టమైన అర్థం ఉంది. ద్విజ అంటే రెండు సార్లు జన్మించిన వాడని అర్థమట. ప్రియ అంటే ప్రియమైనవాడు అని అర్థమట. ఇక ద్విజుడు అంటే వేదాన్ని అధ్యయనం చేసే బ్రాహ్మణులు లేదా జ్ఞానాన్ని పొందినవారు అని అర్థం. ద్విజప్రియ రూపం అంటే వేదజ్ఞానాన్ని గౌరవించే జ్ఞానులకు, సద్బుద్దికి ప్రియమైన గణపతి స్వరూపం అని అర్థం.
ప్రత్యేకత..
ద్విజప్రియ రూప వినాయకుడు చాలా విశిష్టమైనవాడు. ఆయన జ్ఞానం, వివేకం, ఆత్మశుద్దికి ప్రతీక. వేద మంత్రాలు, శాస్త్రబద్ధమైన పూజలకు అధిపతి. అజ్ఞానం తొలగించి సరైన మార్గాన్ని చూపించే స్వరూపం.
సంకష్ట చతుర్థి రోజు ఆరాధించడం..
సంకష్ట చతుర్థి అంటే కష్టాలు, అడ్డంకులను తొలగించే రోజు. మమనసు, బుద్ధి స్పష్టంగా ఉండాలని కోరుకునే రోజు. మాఘమాసంలో ఆరాధించదగిన ద్విజప్రియ రూపాన్ని ఆరాధించడం వల్ల చదువు, జ్ఞానం, నిర్ణయ శక్తి పెరుగుతాయని చెబుతారు. అలాగే వృత్తి, విద్య, ఆధ్యాత్మిక సాధనలో ఆటంకాలు కూడా తొలగుతాయని భక్తుల నమ్మకం.
పూజ..
అన్ని సంకష్ట చతుర్థి రోజుల లాగే ఈ రోజు వినాయకుడిని ఆరాధించాలి. ఉదయం స్నానం చేసి స్వామి ముందు ఎర్రటి గుడ్డలో బియ్యం పోసి, ఖర్జూరాలు, దక్షిణ వేసి ముడుపు లాగా కట్టాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఉపవాసానికి ఇబ్బంది పడేవారు సాత్వికమైన ఆహారం, అందులోనూ పండ్లు, పాలు తీసుకోవచ్చు. సాయంత్రం సంకష్ట చతుర్థి వ్రత విధానంలో పూజ చేయాలి. ఉదయం ముడుపులో వేసిన బియ్యంతో స్వామి వారికి ఉండ్రాళ్లు వండి నైవేద్యం పెట్టాలి. అలాగే దుర్వా అంటే గరికను తప్పక స్వామి వారికి సమర్పించాలి. సంకష్ట చతుర్థి రోజు గరిక పూజకు చాలా ప్రత్యేకత ఉంది. ఇలా పూజ ఆచరించుకుని స్వామి నైవైద్యాన్ని పంచి పెట్టాలి. ఇలా చేసుకుంటే స్వామి వారు సంతోషిస్తారు. వారి అనుగ్రహం తన భక్తుల మీద కురిపిస్తారు.
*రూపశ్రీ.


