ముక్తి కోసం మరొక మార్గం!

ముక్తి లభించడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ ముక్తి కోసం మనిషి సర్వాన్ని త్యజించాలని అంటారు, ఆ భగవంతుడిలో లీనమైపోవాలి అంటారు. దానికి అనుగుణంగా ధ్యానం చెయ్యాలి అంటారు. ఆ ధ్యానం ద్వారా మనసును భగవంతుడి మీద ఉంచి సుఖదుఃఖాలకు అతీతంగా మనిషి జీవించాలని అలా జీవించినప్పుడే మనిషి ముక్తి మార్గానికి అర్హుడు అవుతాడని అంటారు. అయితే ధ్యానం చేయలేకపోతున్నాము, ఆ దేవుడి మీద మనసు అసలే నిలపలేకపోతున్నాము ఇక ముక్తికి మార్గం ఎక్కడిది?? ముక్తి ఎలా సాధ్యం అని ఎంతో బాధపడిపోయేవాళ్లకు ఇంకొక మార్గాన్ని చెప్పాడు పరమాత్మ.

అభ్యాసం చేయడానికి, ధ్యానం చేయడానికి నీవు అసమర్థుడివి అయితే, నీకు చేతకాకపోతే, తీరికలేకపోతే, నీ మనసు అంగీకరించకపోతే, దాని కోసం చింతించకు, నిరాశపడిపోకు నా జీవితం ఇంతే అంటూ చేతులు ముడుచుకొని కూర్చోకు. మరొక పని చెయ్యి. నీవు ప్రతి రోజూ ఏమేమి కర్మలను చేస్తావో ఆ కర్మలే చెయ్యి తప్పులేదు. కాని ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి. నా కోసం చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి. న్యాయంగా, ధర్మంగా చెయ్యి. నీవు చేసే పనినే దైవంగా భావించి చెయ్యి. అది కూడా ఉపాసనగా మారుతుంది. అంటే చేసే ప్రతి పనిని ఆ దేవుడి కోసం చేస్తున్నాను నౌకోవడం, వచ్చే ప్రతి పలితం ఆ దేవుడిదే అనుకోవడం. ఇలా అనుకుంటే ప్రతి పనీ దేవుడిదే అవుతుంది. ఏ ఖర్మ ఫలం మనిషిని వెంటాడదు. 

ధనం సంపాదిస్తున్నాను అనుకుంటే ధర్మంగా సంపాదించు. మరొకరి ధనం దోచుకోకు. ఇతరులను కష్టపెట్టి, హింసించి ధనం సంపాదించకు. అలాగే వ్యాపారాలు ధర్మబద్ధంగా చెయ్యి. న్యాయంగా నీకు రావాల్సిన లాభం తీసుకో. ఉద్యోగస్తులు కూడా తాము చేసే ఉద్యోగం ప్రజాసేవకోసం చేస్తున్నామనీ, అది దైవకార్యం అనీ శ్రద్ధతో చేస్తే అది కూడా భగవతారాధనే అవుతుంది. అలాగే వివాహమాడిన ధర్మపత్నిని, అర్థాంగిని తప్ప, ఇతర స్త్రీలను కన్నెత్తిచూడకుండా, చేసే ప్రతి కార్యము పరమాత్మ కొరకే, ధర్మబద్ధంగా, న్యాయపరంగా చేస్తే అది కూడా భగవంతుని ఉపాసనే అవుతుంది. ఇంకా చేతనయితే ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చేయాలి.

రాజకీయనాయకుల కర్తవ్యం సమాజానికి సేవచేయడం. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం. కాని ఈ నాటి రాజకీయ నాయకులు వారికి ఉపయోగపడే పనులు, వారికి లాభించే పనులే చేసుకుంటూ సమాజాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. నరకానికి దారి వెతుక్కుంటున్నారు.

నీవు చేసే పూజలు, వ్రతములు, భజనలు అన్నీ శ్రద్ధతో భక్తితో చెయ్యి. ధర్మంగా సంపాదించిన ధనంతో చెయ్యి. కాబట్టి న్యాయంగా ధర్మంగా సంపాదించిన ధనంతో దైవకార్యాలు, సమాజశ్రేయస్సుకు పనికివచ్చే కార్యాలు నా పరంగా నా కోసం చెయ్యి. ఒక్కమాటలోచెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు, పరమాత్మపరంగా చెయ్యాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి, తరువాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు కూడా ముక్తి లభించే అవకాశం ఉంది అంటున్నాడు పరమాత్మ.

                     ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu