కుంభకోణం యాత్ర - 23

ఉప్పు తినని ఉప్పిలియప్పన్ 

 


                                                                                         


ఆటో అతనితో మాట్లాడినట్లు అన్ని ఆలయాలూ చూసి చివరికి ఉప్పిలియప్పన్ ఆలయానికి వచ్చాము.  ఇక్కడ దింపటం వరకే మాట్లాడుకున్నాంకదా మనం, అతనికి డబ్బులిచ్చి పంపేద్దాం.  చూశారా  ఇంత హడావిడిగా తిరిగితే ఈ మాత్రం చూడగలిగాము.  మధ్యాహ్నం 12-30 అయింది సమయం.  శనివారం కదా.  ఆలయం 1 గం. దాకా వుంటుందిట.  ముందు దర్శనం చేసుకుందాం.  కధ తర్వాత తీరిగ్గా చెబుతాను.

 

అమ్మయ్య.  ఈ ఆలయంలో కూడా స్వామి దర్శనం చక్కగా అయింది.  మేమిదివరకు  శుక్రవారంచనాడు వచ్చాము. స్వామి, అమ్మవారు మొత్తం బంగారు తొడుగుతో వున్నారు.  చాలా బాగుంది.    సరే, అటు వెళ్ళి కూర్చుందాం పదండి.  అదేంటి?  అక్కడ అంతమంది జనం వున్నారు?  శనివారం కదా.  దేవుళ్ళకి కట్టిన బట్టలు వేలం వేస్తున్నట్లున్నారు.  చూద్దాము.  పంచ, కండువా 100 రూ. నుంచి 130 రూ. మధ్యే జరుగుతోంది వేలం.  బట్ట బాగుంది.  మనదగ్గర 400 రూ. పైన వున్నాయి.  తీసుకుందాము.  (బహుశా ప్రతి శనివారం 12 గం. లకి వేలాం వేస్తారనుకుంటా.  కావాలనుకున్నవాళ్ళు  తీసుకోండి.  బాగున్నాయి.  9 గజాల చీరె 290 రూపాయలే.)

 

ఒంటిగంట దాటింది కదా.. ఆకలి వేస్తోంది.  ఏదైనా ప్రసాదం కొనుక్కుని తిందాము.  దేవుళ్ళ పేర్లు చెప్పుకుని ప్రసాదాలు లాగించేస్తాం కదా.  అదేంటోనండీ! దేవాలయాల్లో పెట్టే  ప్రసాదాలు పులిహోర, దధ్దోజనం, చక్రపొంగలి ఎంత రుచిగా వుంటాయో!!  అలాంటి రుచికర పదార్ధాలని లొట్టలు వేస్తూ తింటాము.  సాధారణంగా ఏ వంటకమైనా ఉప్పు, కారం, తీపి, పులుపు వగైరా దానిలో పడవలసిన దినుసులన్నీ సమపాళ్ళల్లో పడితే రుచిగా వుంటుంది.  కానీ, అసలు ఉప్పే లేకుండా చేసే పదార్ధాలయితే ...  టీ.వీ.ల పుణ్యమా అని ఈ మధ్య అలాంటివాటి గురించి కూడా తెలుసుకుంటున్నాముగానీ మనం తినాలంటే ఆకలిగా లేదనేస్తాంకదా.  ఇక్కడ దేవుడు మాత్రం ఇక్కడ వెలిసినప్పటినుంచీ,  అసలు ఉప్పే వేయని పదార్ధాలను   ఆరగిస్తున్నాడు తెలుసా?   భక్తులు కూడా మహా ప్రసాదమని సంతోషంగా స్వీకరిస్తారు.   ఇలాంటి విశేషాలు భగవంతునికీ, భక్తులకూ ఒకరిపట్ల ఒకరికున్న అత్యంత ప్రేమానురాగాలను సూచిస్తాయి.  అలా ఉప్పు వెయ్యని పదార్ధాలను మాత్రమే నైవేద్యం పెట్టాలని ఆదేశించిన దేవ దేవుడు ఉప్పిలియప్పన్.  ఆయనకి పెట్టే నైవేద్యం దేనిలోనూ ఉప్పు వెయ్యరు.  దానికి కారణం ఏమిటో తెలుసా?  మార్కండేయ మహర్షి తన కూతురిని అతిధిగా వచ్చిన ముసలి వరుడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేక కూతురికి వంట చేయటం  రాదు, వంటకాలలో ఉప్పు వేయటం కూడా మరచిపోయేంత చిన్నది అని చెప్పటం.  ఆ విశేషాలు తెలుసుకోవాలని వున్నది కదా?  అలా కూర్చుని చెప్పుకుందాం పదండి.  ఈ పూటకి మన ఆలయ టూర్ అయిపోయింది.  ఇంక హోటల్ కే.  వెళ్ళేటప్పుడు బస్ లో వెళ్దాం.  బస్సులు బాగానే వున్నాయి.  గుడి బయటే బస్ స్టాప్.  ఇక్కడనుంచి కుంభకోణం 7 కి. మీ.లే.  

 

 

మొదట్లో ఈ ఊరి పేరు తిరువిన్నగర్, వైకుంఠ నగరం వగైరాలు వున్నాయిగానీ, అందరికీ అర్ధమయ్యేది ఉప్పిలియప్పన్ సన్నిధి అంటేనే.  ఈ ఆలయం వైష్ణవులకు ప్రముఖమైన 108 దివ్య దేశాలలో  60దిగా చెప్పుకుంటారు.  ఈ ఆలయంలోని ముఖ్యదైవం, మనం చూశాంకదా, ఉప్పిలియప్పన్ (మహావిష్ణువు, వెంకటేశ్వరస్వామి).  ఉప్పిలియప్పన్ అంటే అర్ధం సాటిలేనివాడు అనిట.   లక్ష్మీదేవి భూమిదేవిగా ఇక్కడ పూజలందుకుంటున్నది.    రాజ గోపురం చూశారా?  ఐదు అంతస్తులున్నాయి. చుట్టూ గ్రనైట్ రాళ్ళతో ప్రహరీ గోడ.  లోపలికి పదండి.ఈ ఆలయ  విమానాన్ని శుధ్ధానంద విమానం అంటారు. తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయ విమానం ఆనంద అయితే,  ఈ విమానం శుధ్ధానంద.  విశాలమైన ఈ ఆలయం లోపలి ప్రాకారాలలో ఆళ్వారులు, సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రుడు, మణియప్పన్, ఎన్నప్పన్, భూమిదేవి లభించిన చోటు, కృష్ణాలయం, ఉత్సవాలు జరిగే విశాలమైన హాళ్ళు వున్నాయి.

 

మనం ఈ ఉపాలయాలన్నీ దర్శించుకుంటూ అసలు స్వామి సన్నిధి చేరుకున్నాం కదా.  స్వామి నిలువెత్తు విగ్రహం చూస్తుంటే,  అచ్చం ఏడుకొండలవాడిని చూస్తున్నట్లనిపించ లేదూ?      స్వామికి కుడిచెయ్యివైపు మోకరిల్లి కూర్చుని వున్నది భూమిదేవి.  స్వామికి ఎడమవైపు కన్యాదానం చేస్తున్నట్లున్నవారు మార్కండేయ మహర్షి.

 

ఏమిటి ప్రసాదంలో అసలు ఉప్పే లేదు అంటున్నారా?  నేను ముందే చెప్పాను కదండీ.  ఇక్కడ స్వామికి సమర్పించే ఆహారంలో ఉప్పు వెయ్యరని.   ఇక్కడ అమ్మాయినడగటానికి వచ్చిన వరుడు నచ్చక తండ్రి మా అమ్మాయికి వంట చెయ్యటం రాదు, వంటల్లో ఉప్పు వెయ్యటం కూడ మరచిపోతుంది అని చెప్పాడుట.  ఆ వరుడేం తక్కువ తిన్నాడా?  అయితే నేనసలు ఉప్పే లేకుండా ఆహారాన్ని తీసుకుంటానన్నాడుట!  
ఆ కధ చెబుతాను మరి వినండి. 

 

స్ధల పురాణం

ఈ స్ధల మహత్యం గురించి  బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.  ఈ క్షేత్రాన్ని మార్కండేయ క్షేత్రమని, తులసీ మార్కండేయ క్షేత్రమనీ కూడా అంటారు.  తులసికీ, మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయ మహర్షికి ఈ క్షేత్రంతో సంబంధం వున్నది.  వాటన్నింటి గురించీ తనకి వివరంగా చెప్పమని  ఇప్పుడు మీరడిగినట్లే ఒకసారి నారదుడు తన తండ్రియైన బ్రహ్మదేవుడిని అడిగాడు. మరి ఆయనకి తెలిస్తే లోకాలన్నింటికీ తెలిసినట్లేకదా!  అలా మనకీ తెలిసిన కధ ఏమిటంటే...   
అమృత మధనం సమయంలో లక్ష్మీదేవి, చంద్రుడు, కామధేనువు మొదలగు అనేక అపురూపాలతోబాటు తులసి కూడా ఆవిర్భవించింది.  శ్రీమన్నారాయణుడేమో లక్ష్మీదేవిని తన వక్షస్ధలంపై కొలువు తీర్చి తులసిని పట్టించుకోలేదు. దానితో తులసి శ్రీమన్నారాయణ మూర్తిని ఒక వరమడిగింది.  ఏమంటే మహలక్ష్మితోబాటు తనని కూడా ఆయన వక్షస్ధలంపై నిలుపుకొమ్మని.  దానికి ఆయన లక్ష్మి ఆ స్దానం పొందటానికి చాలా తీవ్రమైన తపస్సు చేసిందని చెబుతూ తులసి ప్రాముఖ్యత పెరగటానికి ఒక వరం ఇచ్చాడు.  లక్ష్మీదేవి కావేరికి దక్షిణంగా, కుంభకోణం దగ్గర భూమిదేవిగా అవతరిస్తుందని, ఆమెని మార్కండేయ మహర్షి తన కూతురిలా పెంచుతాడని, కొన్నాళ్ళ తర్వాత తాను వచ్చి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటానని చెప్పి, తులసిని ముందుగా వెళ్ళి  అక్కడ  తులసి మొక్కగా వుండమంటాడు. లక్ష్మీదేవి ఆమొక్క కింద కనిపిస్తుందని, తర్వాత తను వచ్చి  లక్ష్మీదేవిని వివాహం చేసుకుని అక్కడే వుంటానని, అక్కడ తన పూజలో తులసికి ప్రాధాన్యం వుంటుందని, ఆ స్ధలంలో తనని తులసి దళాలతో పూజించినవారికి అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయని, దానితో తులసి గురించి అందరికీ తెలుస్తుందని, ఆవిడ ప్రాముఖ్యం పెరుగుతుందని చెబుతాడు.    తులసి శ్రీమేన్నారాయణుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి అవతరించింది.  ఆ ప్రాంతమంతా తులసి వనంగా పెరిగింది.

 

తర్వాత మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, పవిత్ర తీర్ధాలలో స్నానం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి ముగ్ధుడై అక్కడే వుండదల్చుకున్నాడు.  ఆయనకి ఎప్పటినుంచో ఒక కోరిక.   తాను లక్ష్మీదేవిని పుత్రికగా పొందాలని ఆవిడని శ్రీమన్నారాయణుడికిచ్చి వివాహం చేయాలని.  ఆ కోరిక నెరవేర్చుకోవటానికి అది సరియైన ప్రదేశం అని కూడా అనిపించింది.   ఆయన  అక్కడ వెయ్యి సంవత్సరాలపైన తీవ్ర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన శ్రీమన్నారాయణుడి ఆదేశానుసారం శ్రీమహలక్ష్మి చిన్న పాపగా అక్కడ తులసి మొక్క దగ్గర అవతరించింది.  మార్కండేయుడు భగవంతుడు ప్రసాదించిన ఆ పాపను తన కూతురిలా పెంచసాగాడు.  ఆమె భూమి మీద కనిపించిందికనుక భూమిదేవి అని పేరు పెట్టాడు.

 

భూమిదేవికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆమెకి తగిన వరునికిచ్చి వివాహం చెయ్యాలనే సంకల్పంతో మార్కండేయుడు వరుడికోసం వెతకటం ప్రారంభించాడు.  మహావిష్ణువుకి ఆయనని పరీక్షించాలనిపించింది.   పేద, వృధ్ధ బ్రాహ్మణుడి రూపంలో,  చేతిలో ఊత కర్రతో ఫన్గుని మాసం శ్రవణా నక్షత్రం మధ్యాహ్నం సమయంలో మార్కండేయుడి ఇంటికి వచ్చాడు.  ఆ కాలంలో అతిధులను దేవుళ్ళుగా చూసి వారి అవసరాలు తీర్చేవారు.  అలాగే మార్కండేయుడు, ఆ ముసలి బ్రాహ్మణుడు విపరీతంగా దగ్గుతూ, ఎంత చికాకు పెడుతున్నా అతనిని ఆదరించి, ఆతిధ్యమిచ్చి అతను వచ్చిన కారణం అడిగాడు.  బ్రాహ్మణుడు తను పెళ్ళి చేసుకుని, జీవితంలో స్ధిరపడి, మంచి సంతానాన్ని కనాలనే కోరికతో వున్నానని, ఆ కోరిక తీరటానికి మార్కండేయుని కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడిగాడు.  

 

దానికి మార్కండేయుడు తన కుమార్తె ఇంకా చిన్నదని, సంసార బాధ్యత వహించే శక్తిలేనిదని, పైగా వారిరువురికీ వయసు తారతమ్యం చాలా వున్నదని ఆ బ్రాహ్మణుడికి పరిపరి విధాల నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.  వృధ్ధ బ్రాహ్మణుడు తన పట్టుదల వదలలేదు సరికదా,  మార్కండేయుని కుమార్తెని తనకిచ్చి వివాహం చేయకపోతే అక్కడే ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించాడు.

 

మార్కండేయుడు ఆ బ్రాహ్మణుడికి నచ్చచెప్పటానిక అనేక విధాల ప్రయత్నించాడు.  తన కూతురికి వంట చెయ్యటం కూడా రాదని, వంటకాలలో ఉప్పు వెయ్యటం కూడా తెలియదనీ, దానితో ఆ బ్రాహ్మణునికి కోపం వస్తుందని వంక పెట్టాడు. ఏమీ  పర్వాలేదు, ఉప్పు లేకుండానే తింటానన్నాడు బ్రాహ్మణుడు. చేసేది లేక తన కూతురిని అడిగాడు మార్కండేయడు ఆ వృధ్ధ బ్రాహ్మణుడిని వివాహం చేసుకోవటం ఇష్టమేనా అని.  ఆవిడ ఆ ముసలివాడిని పెళ్ళి చేసుకోమని బలవంతపెడితే తను ఆత్మహత్య చేసుకుంటానన్నది.  అటు అతిధిగా వచ్చిన బ్రాహ్మణుడు, ఇటు గారాబంగా పెంచుకున్న కూతురు .. ఇద్దరి ఆత్మహత్యా బెదరింపుల మధ్య ఏమి చెయ్యాలో తోచక మార్కండేయుడు ఆ శ్రీమన్నారాయణుడిని తనకో దోవ చూపమని  ప్రార్ధించాడు.

 

శ్రీమన్నారాయణుడిని అనేక విధాల వేడుకున్న మార్కండేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వృధ్ధ బ్రాహ్మణుడి బదులుగా శంఖ, చక్రాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీమహవిష్ణువుని చూసి, భగవంతుడు తనతో ఆడుకున్నాడని గ్రహించిన మార్కండేయుడు ఆనందంతో ఉక్కరిబిక్కిరయ్యాడు.  తన కుమార్తెను పెళ్ళి చేసుకుని అక్కడే కొలువుతీరమన్నాడు.  మహావిష్ణువు మార్కండేయుని కోరికమీద ఆయన కుమార్తెను వివాహం చేసుకుంటానని, ఆయన కుమార్తెకు వంటలో ఉప్పు వేయటం సరిగా రాదన్నాడుగనుక  అక్కడ వెలిసిన తాను ఉప్పులేని ఆహార పదార్ధాలను మాత్రమే స్వీకరిస్తానని చెబుతాడు.

 

సంతోషసాగరంలో మునిగి తేలిన మార్కండేయుడు, విష్ణుమూర్తికి తన కూతురునిచ్చి వివాహం చెయ్యటానికి అంగీకరించి, మహావిష్ణువుని మరి కొన్ని వరాలుకూడా అడిగాడు.  స్వామి తన కూతురుని వివాహం చేసుకున్న తర్వాత అక్కడే స్ధిర నివాసం ఏర్పరచుకోవాలని, స్వామి వెలసిన ఆ పవిత్ర క్షేత్రం మార్కండేయ క్షేత్రంగా పేరొందాలని, భగవంతునికి రుచిగా అనిపించే ఉప్పులేని పదార్ధాలు భక్తులకు కూడా రుచిగా వుండాలని.  భగవంతుడు తల్చుకుంటే కానిదేమున్నది. భక్తుని కోరికలు తీర్చటంతోబాటు ఆ ప్రదేశం తిరువిన్నగరం అనీ, తులసివన మార్కండేయ క్షేత్రమని పేరొందుతుందని వరమిచ్చాడు.  తమ వివాహం  తమిళ నెల అయిప్పాసిలో శ్రవణా నక్షత్రం రోజున జరపమని చెప్పి, తనే స్వయంగా శుభలేఖ వ్రాసి బ్రహ్మకి మిగిలిన దేవతలకందరికీ అందజేయమని గరుడుడిని పంపించాడు.  బ్రహ్మ మిగిలిన దేవతలంతా కూడా తమ భార్యలతో సహా వచ్చి లక్ష్మీ నారాయణులని సేవించారు.  అప్పటినుంచి స్వామి భూమిదేవితో ఇక్కడ కొలువయ్యారు.  స్వామి అప్పుడు మార్కండేయుడికి దర్శనమిచ్చిన రూపంతోనే ఇక్కడ కొలువు తీరాడుట.

 

అహోరాత్ర పుష్కరిణి

సాధారణంగా పుణ్య తీర్ధాలలో చీకటిపడ్డాక స్నానం చేయకూడదు.  కానీ ఈ నియమం ఇక్కడి పుష్కరిణికి వర్తించదు. ఇక్కడ రాత్రింబగళ్ళు స్నానం చెయ్యవచ్చు.  అందుకనే దీనిని అహోరాత్ర పుష్కరిణి అన్నారు. దీనికీ ఒక కధ వున్నది. 
పూర్వం జైమినీ మహర్షి కుమార్తె తో ఒక రాజు అసభ్యంగా ప్రవర్తించాడు.  ఆవిడ తండ్రితో విషయం చెప్పగా ఆయన ఆ రాజుని పక్షిగా మారిపొమ్మని శపించాడు.  ఆ రాజు పక్షిగా మారి ఇక్కడి పుష్కరిణి ఒడ్డున వున్న చెట్టుమీద వుండసాగాడు.  ఒక రోజు రాత్రి తీవ్రమైన గాలి, వాన వచ్చి ఆ పక్షి వున్న చెట్టు కొమ్మ విరిగి పక్షితో సహా ఈ పుష్కరిణిలో పడ్డది.  పుష్కరిణిలో పడ్డ పక్షికి ఆ పుష్కరిణి నీటి మహత్యం వల్ల స్వస్వరూపం వచ్చింది.  దానితో ఈ పుష్కరిణి మహత్యం అందరికీ తెలిసింది.  అప్పటినుంచీ ఈ పుష్కరిణిలో మాత్రం ఏ సమయంలోనైనా స్నానం చెయ్యటం ఆచారంగా వస్తున్నది.   ప్రస్తుతం  ఇక్కడ చీకటిపడినా, గుడి తెరిచి వున్నంతమటుకూ స్నానం చెయ్యటానికి అనుమతిస్తారు. 

 

ఆలయ నిర్మాణం

మరి ఈ ఆలయం నిర్మాణం గురించి కూడా కొంచెం చెబుతాను.  ఈ ఆలయ నిర్మాణాన్ని 8వ శతాబ్దంలో చోళ రాజులు ప్రారంభించారు.  తర్వాత తంజావూరు నాయకులు అభివృధ్ధి చేసినట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది.ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం యొక్క హిందూ రిలిజియన్ అండ్ ఎండౌమెంట్ బోర్డుచే నిర్వహింపబడుతున్న ఈ ఆలయంలో రోజూ ఆరు సమయాలలో పూజలు వుంటాయి.  సంవత్సరంలో మూడు ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో తమిళ నెల చిత్తిరై (మార్చి - ఏప్రిల్) లో వచ్చే రధోత్సవం ముఖ్యమైనది.

 

ప్రతి నెలా శ్రవణా నక్షత్రం రోజున శ్రవణ దీపోత్సవానికి వేలకొద్దీ భక్తులు దూర ప్రాంతాలనుంచి కూడా వస్తారు. ఉప్పిలియప్పన్ స్వామి తమిళ నెల ఫంగునిలో, శ్రవణా నక్షత్రంరోజున ఇక్కడ ఆవిర్భవించారు.  అందుకే ఈ ఉత్సవం. సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజున శ్రవణా నక్షత్రం వచ్చిందో తెలిపే వివరాలను ఆలయ కమిటీవారు ప్రింట్ చేయించి భక్తులకు ఉచితంగా ఇస్తారు.  చాలామంది భక్తులు ఆ రోజు ఉప్పు తినకుండా ఉపవాసం వుండీ శ్రవణ వ్రతం చేస్తారు.

 

ఇక్కడ వసతి సౌకర్యం కూడా వున్నది.  ముందుగా రిజర్వు చేసుకోవచ్చు.  లేకపోయినా సమీపంలో వున్న కుంభకోణంలో అన్ని వసతులూ లభిస్తాయి.

ఫోన్ నెంబరు 0435 2463385

 

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)
 


More Kumbakonam