సాక్షాత్తు మహావిష్ణువే చెప్పిన మాటలు.. లక్ష్మీదేవి ఏ ఇంట్లో కొలువై ఉంటుందంటే!


నారాయణుడి నుంచీ అందరూ అమ్మను ఆరాధించిన వారే. ముందు ఆమె స్వర్గలక్ష్మిగా ఉంది. కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల ఆమె క్షీరసాగరంలో కలసిపోయింది. ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలైంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకీ అధిపతి అయి, ఆయన ఇచ్చిన శక్తితో జంభాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు ఇంద్రుడు. ఆ సంతోషంలో చతుర్ధంతి ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు. ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాసమహర్షి, ఇంద్రుణ్ణి చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి, విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడట. దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడట, ఇదేనా అనుకుని! అతణ్ణి మించిన మదంతో ఆ ఏనుగు ప్రసాదాన్ని తొండంతో తీసి క్రింద పడేసి, కాలితో తొక్కివెళ్ళిపోయింది. "ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి: ఆ. ప్రసాదాన్ని తూలనాడావు కనుక నీ సంపద అంతా నీటిపాలు అవుగాక”అని మహర్షి శపించాడట. మునిశాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళి, తను చేసిన తప్పు చెప్పి, “నా సంపద పోయినా ఫరవాలేదు, కానీ మళ్ళీ ఎప్పుడూ అహంకారం మొలకెత్తని స్థితిని నా కివ్వు" అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ "నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదములే, ప్రసాదమంటే అనుగ్రహం. విష్ణువును విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ వెళ్ళి పోతాయి, లక్ష్మి వెళ్ళిపోతుంది. విష్ణువు వేరు, ఆయన ప్రసాదం వేరు కాదు. అందువల్ల ఇప్పుడు ఆయనను శరణు వేడు" అని నారాయణుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడట. "నీ దయ కోసం వచ్చాను, నా పై దయ చూపించి నాకు జ్ఞానం వచ్చేలా చెయ్యి" అంటే, “నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలగలిగే బుద్ధిని కూడా నేనివ్వాలి కనుక నువ్వు క్షీరసాగర మథనం చెయ్యి" అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లనన్నిటినీ వివరించి చెప్పాడాయన.

"ఏ ఇంట సదాచారం, శుచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో ఉత్సాహం, ఉల్లాసం, ప్రేమ, అన్యోన్యత, నిష్కపటత్వం ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా, ఎన్ని సాధనలు చేసినా మన బుద్ధి మన చేతిలో లేదు, అనేక శక్తుల ప్రభావం దీని మీద ఉంది.

"ఏ ఇంట శంఖధ్వని ఉండదో, తులసి ఉండదో అక్కడ లక్ష్మి ఉండదు. అలాగే యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టడం, శివార్చన ఏ ఇంట జరుగుతాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. కలియుగంలో అశ్రద్ద, దుర్మేధ రాజ్యమేలుతున్నాయి. శ్రద్ధ, మేధ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. మిగిలిన చోట్ల అలక్ష్మి ఉంటుంది. విష్ణు నింద, విష్ణు భక్తుల నింద చేసేవారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది. శుద్ధత లేని వాడు, క్రూరుడు, ఇతరులను నిందించే విప్రుడి ఇంటిని అమ్మ విడిచి పెడుతుంది. గరికనూ, పువ్వులనూ ఎవరు గోళ్ళతో చిక్కుతారో (కోస్తారో) వారిని అమ్మ విడిచి పెడుతుంది. వేలి కొనలతో, గోళ్ళతో నేల మీద రాసినా లక్ష్మి విడిచిపెడుతుంది. పండితుడు, విద్వాంసుడు ఎవరింటి నుంచి నిరాశతో వెళతారో ఆ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది.

సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో ఎవరు భోజనం చేస్తారో. నిద్రపోతారో వారి ఇంటిని లక్ష్మి విడిచి పెడుతుంది. ఆ సమయంలో అనుష్టానం చెయ్యాలి. ఆచారహీనుడైన విప్రుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది. కాళ్ళు కడుక్కుని తుడుచుకోకుండా తడికాళ్ళతోనే నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. శిరస్సుకు నూనె రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళిద్దరినీ లక్ష్మి విడిచిపెడుతుంది. తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. వ్రత నియమం లేకుండా, ఉపవాస నియమం లేకుండా జీవించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. సంధ్యా హీనుడైన ద్విజుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది. ఎక్కడ విష్ణు ప్రశంస, విష్ణుభక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ అమ్మ ఉంటుంది. ఎక్కడ శివలింగార్చన, శివసంకీర్తనం జరుగు తాయో అక్కడ అమ్మ ఉంటుంది. ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో, ఎక్కడ సర్వదేవతల్నీ పూజిస్తారో అక్కడ అమ్మ ఉంటుంది.

ఈ విధంగా ఉంటూ, ఇందులో చెప్పిన విధి నిషేధాలను జాగ్రత్తగా గ్రహించి, నియమబద్దమైన జీవితం గడిపిన వారికి మహాలక్ష్మి అనుగ్రహం వారి ఇంట, ఒంట ఉంటుంది" అని నారాయణుడు ఇంద్రుడికి బోధించాడు.

                                              *నిశ్శబ్ద.


More Lakshmi Devi