పరమ పవిత్రం శ్రావణ మాసం
శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ప వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి. స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన ధర్మపత్ని అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“.
శ్రావణమాసం మహిళలకు ఏంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడంవల్ల దీనిని వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.
శ్రావణ మాసంలో పర్వదినములు...
◆మంగళగౌరీ వ్రతం: శ్రావణ మాసం లో చేయవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారం లలో మంగళగౌరి పూజను చేస్తారు. పరమేశుడి అర్ధాంగి అయిన పార్వతికి మరో పేరు మంగళ గౌరి. కొత్తగా పెళ్ళైన వాళ్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేయడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రగాఢ నమ్మకం. స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
◆వరలక్ష్మీ వ్రతం: మహిళలకు ముఖ్యమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఆరోజున పూజ చేస్తే అష్ట అష్ట లక్ష్మీ పూజలకు సమానం అని ప్రతీతి. ఈ దేవతను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని నమ్మకం.
◆శుక్లచవితి-నాగచతుర్థి: నాగచతుర్ధి ని మన రాష్ట్రంలో నాగుల చవితి పండుగలా నాగ పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.
◆శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి: శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఈరోజున గొడుగు దానమిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ: అన్నదమ్ముల శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరల చేతికి రాఖీ కట్టే పండుగనే రాఖీ పూర్ణిమ అంటారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.
◆పూర్ణిమ – హయగ్రీవ జయంతి: ఈరోజునే శ్రీ మహా విష్ణువు వేదాలను రక్షించడానికి హాయగ్రీవ అవతారం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.
◆కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి: శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన పర్వదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.
◆కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య: మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే గృహిణులు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమంలో పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి, పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది అనుసరించడం ద్వారా పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని చెప్తారు.
◆ వెంకటేష్ పువ్వాడ