పరమేశ్వరుడి పూజలో రహస్యం!
మాసం ఏదైనా పరమేశ్వరుడి పూజ ఎంతో అద్భుత పుణ్య పలితాన్ని ఇస్తుంది. పర్సమేశ్వరుడి పూజలో మాత్రమే కాకుండా ప్రతి దేవుడి పూజలో కొన్ని నియమాలు ఉంటాయి. పరమేశ్వర పూజ లో ఉండే కొన్ని ఉపచారములు ఉన్నాయి, అందులో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుంటే…… పరమేశ్వర పూజలో అరవై నాలుగు ఉపచారములు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రధానమైనవి పదహారు. ఈ పదహారు ఉపచారములని షోడశోపచారములు అని అంటారు. ఈ షోడశోపచారపూజ లో మళ్ళీ పంచ ఉపచారములు ఉన్నాయి. అవి ఏవంటే.. పుష్పం, గంధం, ధూప, దీప, నైవేద్యం సమర్పణ..
ఈ పంచ ఉపచారములలో ఒక్కొక్కటి ఒకో తత్త్వాన్ని చెప్తోంది. వాటిలో గంధం - పృథ్వి తత్త్వం, పుష్పం - ఆకాశ తత్త్వం, దీపం - అగ్ని తత్త్వం, ధూపం - వాయు తత్వం, నైవేద్యం అమృత తత్వం. ఇలా పంచ ఉపచారములలో ఉపయోగించే పదార్థాలు వాటి తత్వాన్ని కలిగి ఉంటాయి.
అయితే శివార్చనలో ముఖ్యమయిన ఉపచారము ఒకటి ఉంది. అదే అభిషేకం. అభిషేకం చేయడం వల్ల ఆత్మశుద్ది కలుగుతుంది. ఇకపోతే పంచ ఉపచారములలో ఉపయోగించే వాటి వల్ల ఒక్కో దాని వల్ల ఒక్కో పలితం ఉంటుంది.
శివ పూజలో గంధం సమర్పించడం వల్ల పుణ్యం వస్తుంది. ధూపం సమర్పించడం వల్ల ఆర్థ ప్రాప్తి కలుగుతుంది. అలాగే దీపం సమర్పణం వల్ల అజ్ఞానం తొలగుతుంది. దీపేన సాధ్యతే సర్వం అనే మాట మరచిపోలేం కదా!!
ధూప దీపాల మధ్య శివ లింగాన్ని చూడటంలో కూడా విభిన్న ఫలితాలు ఉంటాయి. ప్రాతః కాలంలో చూస్తే స్వర్గ ఫలం లభిస్తుంది, మధ్యాహ్నం సమయంలో చూస్తే యజ్ఞ పలితం లభిస్తుంది, సాయంత్రం సమయంలో చూస్తే మోక్ష ఫలం లభిస్తుంది. ఇలా శివ లింగ దర్శనం కూడా విభిన్న ఫలితాలిస్తుంది
శివుడి ముందు దీపాలు వెలిగించడం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేసే పని. అయితే అలా వెలిగించే దీపములలో ఏ దీపము వెలిగిస్తే శ్రేష్టం?? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. శివుడి ముందు నేతి దీపం కానీ, నువ్వుల నూనె దీపం కానీ వెలిగితే శ్రేష్టమని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.
చాలామంది అపమృత్యువు తొలగడానికి దీపాలు పెట్టాలని చెబుతూ ఉంటారు. అయితే ఈ అపమృత్యువు తొలగడానికి మూడు రంగుల దారాన్ని 7 పేటలుగా చేసి మట్టి ప్రమిదలో ఆముదం వేసి దీపం పెడితే అపమృత్యువు తొలిగి పోతుంది.
దేవుడికి నైవేద్యం సమర్పించడం వల్ల కలిగే పలితం ఏమిటని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే నైవేద్యం సమర్పించడం వల్ల ఆయుష్షు, తృప్తి కలుగుతాయి.
దేవుడికి తాంబూలం సమర్పించడం వల్ల భోగం వస్తుంది. అంటే సుఖ సంపదలు కలుగుతాయి.
శివర్చన విషయంలో ఎంతోమంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అర్చనాదులు శరీర బాహ్య స్పృహ ఉన్నంతవరకు చెయ్యవచ్చు.
ఇలా పరమేశ్వరుడి పంచ ఉపచారాలను చేయడం వల్ల వాటికి తగు ఫలితాలు ఉంటాయి.
◆నిశ్శబ్ద.