నందీశ్వరుడు చేసిన పొరపాటు

 

 


టెక్నాలజీ ఎంత పెరిగినా, జనాలు ఎంతగా మారిపోయినా కొన్ని విషయాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇప్పుడు మనం రోజుకి మూడు పూటలా తిని హ్యాపీగా ఉంటున్నాం. వారానికొకసారి తలస్నానం చేస్తున్నాం. దేవుడి మీద భక్తితో వారానికి ఒక పూటనో, రెండు పూటలో ఉపవాసం కూడా చేస్తున్నాం. అయితే మనం ఇలా ఉండటం వెనుక ఓ పెద్ద కథ ఉందని తెలుసా?. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. మరి ఇంత పెద్ద కథ వెనుక శివుడు లేకుండా ఉంటాడా?. అసలు ఆ కథ ఏంటో? ఆ కథకి శివుడికి సంబంధమేంటో తెలియాలంటే.. టైం మిషన్లో మనం పూర్వం రోజులకి వెళ్లాల్సిందే.

 


కొన్ని వేల సంవత్సరాల క్రితం.. స్వార్దానికి, సంపాదనకి దూరంగా ఉన్న కాలం. కార్తీకమాస సమయంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటూ.. ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో శివుడు కైలాసం నుంచి చూసి.. ప్రజల భక్తికి మురిసిపోయాడు. అంతేకాదు నందీశ్వరుడిని పిలిచి.. ఒక సందేశాన్ని చెప్పి భూలోకంలోని ప్రజలకు చెప్పిరమ్మని పంపించాడు. ఆ సందేశం ఏంటంటే.. 'ప్రజలంతా ప్రతిరోజూ తలస్నానం చేయాలి. వారానికి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి'. శివుడు అలా చెప్పడమే ఆలస్యం.. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని నందీశ్వరుడు భూలోకానికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. భూలోకంలో ప్రజల సందడి, హడావుడి చూసి తాను వచ్చిన విషయాన్ని మర్చిపోయి సరదాగా విహరించాడు. తరువాత తాను వచ్చిన అసలు విషయం గుర్తొచ్చి.. శివుడి సందేశం గురించి ప్రజలకి చెప్పాడు. కానీ అక్కడే పెద్ద తప్పు చేసాడు. సందడిలో పడి సందేశాన్ని అటుది ఇటు, ఇటుది అటు అనుకోని.. 'ప్రజలంతా ప్రతిరోజూ భోజనం చేయాలి.. వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలి. ప్రతిరోజూ స్నానం.. వారానికొకసారి తలస్నానం చేయాలి' అని చెప్పాడు. అది విని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నందీశ్వరుడు కూడా తాను వచ్చిన పనిని విజయవంతంగా ముంగించానన్న ఆనందంతో కైలాసానికి బయలుదేరాడు. శివుని ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నందీశ్వరుడిని చూసి 'నంది.. వెళ్లిన పని ఏమైంది?' అని అడుగగా.. 'మీరు చెప్పినట్టే చెప్పాను స్వామి' అని నందీశ్వరుడు బదులిచ్చాడు. శివుడు కాస్త సందేహంతో ఏమని చెప్పావు? అనడిగాడు. 'ప్రజలంతా ప్రతిరోజూ భోజనం చేయాలి.. వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలి. ప్రతిరోజూ స్నానం.. వారానికొకసారి తలస్నానం చేయాలి' అని చెప్పాను అన్నాడు. ఆ సమాధానంతో కాస్త ఆగ్రహం తెచ్చుకున్న శివుడు.. 'ఎంతపని చేసావు నంది.. ప్రతిరోజూ తినాలంటే ఎంత ఆహరం కావాలి?.. ఆ ఆహరం కోసం ఎంత కష్టపడాలి?' అని ప్రశ్నించాడు. నందీశ్వరుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు శివుడు 'నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి.. ఆహరం కోసం నువ్వే కష్టపడాలి' అంటూ ఆజ్ఞాపించాడు. అప్పటినుంచి నంది ఎద్దులా మారి మన ఆహరం కోసం కష్టపడుతుంది. మనం మాత్రం రోజుకి మూడు పూటలా తింటూ.. వారానికొకసారి తలస్నానం చేస్తూ.. వారానికి ఒక పూట ఉపవాసం ఉంటూ.. ఆనందంగా బ్రతుకుతున్నాం. ఇది అసలు కథ.


More Karthikamasa Vaibhavam