సూక్ష్మ దేహం చేసే మాయాజాలం!

బుద్ధి, జ్ఞానము, మోహం లేకపోవడం, ఓర్పు, నిజం తెలుసుకోవడం తెలుసుకున్న నిజాన్ని చెప్పగలగడం. కొంత మంది తమకు ఏమీతెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడుతుంటారు. తాము చూడని విషయాలు కూడా స్వయంగా చూచినట్టు చెప్పడం. చాలా మందికి ఈ వికారం ఉంటుంది. దీని వలన ఎంతో మంది జీవితాలకు నష్టం కలుగుతుంటుంది కానీ వారి బుద్ధిమాత్రం మారదు. తరువాత ఇంద్రియ నిగ్రహము అంటే చూచిందల్లా నాది కావాలి అని అనుకోవడం, ఏది వింటే ఆ దోవన పోవడం, కంటికి బాగున్నదల్లా అడ్డు ఆపు లేకుండా తినెయ్యడం, స్పర్శసుఖం కోసం పాకులాడటం. వీటిని అదుపులో పెట్టుకోవడమే ఇంద్రియ నిగ్రహము.


ఇంక మనో నిగ్రహము అంటే పై చెప్పిన వాటి గురించిన ఆలోచనలను లోపలకు రానీయకపోవడం. తరువాతవి సుఖము దుఃఖము. లేనిది లభిస్తే, తనకు ఇష్టమైనవి తన వద్దకు వస్తే కలిగే ఆనందమే సుఖం, ఉన్నది పోతే దుఃఖం. ఇవి కూడా సూక్ష్మదేహంతో అనుభవించేవే, భవ: అంటేపుట్టడం. మన మనసులో అనుక్షణం ఎన్నో భావాలు, ఆలోచనలు సంకల్పాలు పుడుతుంటాయి. అవి కార్యరూపం దాల్చకముందే అభవ: అంటే లేకుండా పోతుంటాయి. ఈ ప్రకారంగా మనసులో రకరకాల భావాలు ఆలోచనలు కలుగుతుంటాయి. అవి కొద్దిగా ఘనీభవిస్తే కోరికలు అవుతాయి. ఆ కోరికలు కార్యరూపం దాలిస్తే సుఖదు:ఖాలుకలుగుతాయి. 

తరువాత భయం, అభయం. భయం కూడా రెండురకాలు. లేనిది రాదేమో అనే భయం. ఉన్నది పోతుందేమో అనే భయం. లేనిది వస్తే అమ్మయ్య అని భయం పోతుంది. ఉన్నది క్షేమంగా ఉంది అని తెలిస్తే కూడా అదేమాదిరి అభయం. ఎవరూ అండలేకపోతే భయం. మినిష్టరు అండగా ఉంటే అభయం. పరమాత్మను నమ్ముకుంటే భయమే ఉండదు. అంతా అభయమే. ఇది కూడాఒక మానసిక వికారమే.

అహింస అంటే ఎదుటి వారిని మాటలతో కానీ, చేతలతో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ హింసించక పోవడం, బాధ పెట్టకపోవడం. అందరినీ సమంగా చూడటం, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండటం, ప్రతి పనినీ ఒక తపస్సులాగా చేయడం, ఉన్నదానిలో ఇతరులకు దానం చేయాలి అని అనుకోవడం, కీర్తి వచ్చినపుడు పొంగి పోవడం, అపకీర్తి వచ్చినపుడు కుంగిపోవడం కాకుండా ఈ ద్వంద్వాలను సహించడం, ఇవన్నీ మానవులలో కానీ ఇతర జీవరాసులలో కానీ, ఆయా సందర్భాలను బట్టి, వారు చేసే ఆలోచనలను, కర్మలను బట్టి, కలుగుతుంటాయి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి కావు. సూక్ష్మదేహానికి సంబంధించినవి. స్థూలదేహానికి ఉండటానికి ఇల్లు, కడుపునిండా అన్నం, కంటినిండి నిద్ర ఉంటే చాలు. కాని పైవికారాలన్నీ సూక్ష్మదేహంతో అనుభవించే వికారాలు మాత్రమే. ఈ వికారములకన్నిటికీ నేనే కారణము అని అన్నాడు కృష్ణుడు.

ఇలా చెప్పడంలో అంతరార్ధం తెలుసుకోవాలి. మనలో కలిగే ఏ వికారమునకైనా మనసే కారణము. ఆ మనస్సు చైతన్యం కావాలంటే మనలో చైతన్యం ఉండాలి. నేనే కారణము ఆ చైతన్యస్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపము. అందుకే వీటి కన్నిటికీ అని మూలానికి వెళ్లాడు పరమాత్మ. నిజానికి ఈ వికారములు అన్నీ ఎవరెవరి పూర్వజన్మ వాసనలను బట్టి, వారి ఆలోచనా సరళిని బట్టి, చేసే కర్మలను బట్టి కలుగుతుంటాయి. ఎవరి వాసనలను బట్టి వారికి ఆయా ఫలాలను పరమాత్మ పంచిపెడుతుంటాడు. తాను మాత్రము సాక్షీభూతంగా చూస్తుంటాడు. మూలానికి వెళితే మనసుకు కూడా తానే కారణం కాబట్టి ఈ మనోజనితములైన వికారములకు అన్నిటికీ నేనే కారణము అని చెప్పాడు పరమాత్మ. 


అంతేకానీ ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడనీ, ఆయన ప్రేరణతోనే మనం చేస్తున్నామనీ కాదు. దీపం వెలుగులో మంచి పనులు చేయవచ్చు, మర్డర్లు, మానభంగాలు చేయవచ్చు. అన్నిటిమీదా దీపం వెలుగు సమానంగా ప్రసరిస్తుంది. దీపం వెలుగుకు వేటితో కూడా సంబంధం, ఆసక్తి ఉండదు. అలాగే మనలో ఉన్న చైతన్యశక్తికి కూడా మనం చేసే ఆలోచనలతో కానీ, పనులతో కానీ ఎటువంటి ఆసక్తి, సంబంధము ఉండదు. దీపం వెలుగు ఇచ్చినట్టు, ఆత్మ చైతన్యం ఇస్తుంది అంతే.

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu