కృష్ణుడు చెప్పిన పరమపదము, దాన్ని చేరే మార్గం!

మూడు పనులు వాటి ఫలితములు గురించి చెప్పాడు కృష్ణుడు. వేదాధ్యయనము చేస్తే ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఆత్మ, పరమాత్మ ఆది అంతము లేనిది గానూ, నాశము లేనిది గానూ తెలుసుకుంటారు.

రెండవది రాగద్వేషములు వదిలిపెట్టిన వారు పరమాత్మను చేరుకుంటారు.

మూడవది నిరంతరం బ్రహ్మలో చరించేవారు ఎల్లప్పుడు పరమాత్మను చేరుకోవాలని కోరుకుంటారు. 

ఆ మూడింటిని పరమపదము అంటారు దీని గురించి సంగ్రహంగా తెలియ జేస్తాను అని ఇలా అంటున్నాడు కృష్ణుడు. పరమ పదము అంటే ఏమిటి? దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నాడు కృష్ణుడు. ఈ పరమ పదాన్ని వేదమును చదువుకున్న వాళ్లు నాశనము లేనిదిగా చెప్పారు. ఇక్కడకు వెళ్లాలంటే కోరికలు ఉండకూడదు. రాగద్వేషములు ఉండకూడదు. సుఖదు:ఖములు మొదలగు ద్వంద్వములకు దూరంగా ఉండాలి. ఆ పరమ పదము పొందడానికి ఎంతో మంది బ్రహ్మచర్యము అంటే బ్రహ్మను అనుష్ఠానము చేస్తుంటారు. బ్రహపదము గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. మోక్షము కొరకు ప్రయత్నం చేసే వారు ఈ బ్రహ్మ పదము గురించి తెలుసుకుంటూ ఉంటారు. దాని లక్షణాలు కృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు.

వేదములు అధ్యయనం చేసిన వారు ఈ బ్రహ్మపదమును నాశరహితంగా వర్ణించారు. బాహ్యప్రపంచంలోని అన్ని పదార్థాలు ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయ్యేవే. అంటే మార్పుచెందేవే. నాశము, మార్పులేనిది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది పరమాత్మ తత్వము ఒక్కటే. దానినే బ్రహ్మ పదము అని అంటారు. ఈ బ్రహ్మ పదమును గురించి తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసింది. అంటూ ఏమీ మిగలదు. ఇక్కడ అనంతమైన సుఖం శాంతి లభిస్తాయి. ఈ బ్రహ్మ తత్వమే ఓం అనే ప్రణవము అందుకే ఇది వరకు అక్షరాభ్యాసములో ఓం తో మొదలు పెట్టే వాళ్లు. ఓం గురించి బాల్యంలోనే పరిచయం చేసేవాళ్లు. ఎందుకంటే ఓం అనేది అక్షరము. నాశము లేనిది. ఓం కారమే పరబ్రహ్మము.

మరి అటువంటి బ్రహ్మ పదమును చేరుకోవాలంటే ఎలాగ? ముందు రాగ ద్వేషములు సుఖదు:ఖాలు, కామక్రోధములు, వదిలిపెట్టాలి. అప్పుడే బ్రహ్మపదము ప్రవేశించడానికి పాస్ పోర్టు లభిస్తుంది. కాబట్టి కోరికలు ఉన్నవారు, రాగద్వేషములు ఉన్నవారికి బ్రహ్మపదములోనికి ప్రవేశము లేదు. చాలా మంది నాకు ఇంకా మోక్షం రాలేదు అని అంటుంటారు. వారిలో ఉన్న రాగద్వేషముల సంగతి వారికి తెలియదు. 

దాని తరువాత బ్రహ్మపదమును పొందడానికి నిరంతర ప్రయత్నము, అభ్యాసము చేయాలి. మనసును ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ధ్యానం చేయాలి. సోమరి తనము పనికి రాదు. అలసత్వము పనికిరాదు.

తరువాత బ్రహ్మచర్యము. అంటే మనకు విపరీత అర్థాలు వస్తాయి. బ్రహ్మచర్యము అంటే స్త్రీల సంపర్కమే కాదు. మనసుతో కానీ, వాక్కుతో కానీ, శరీరముతో కానీ ప్రాపంచిక విషయములతో సంపర్కము పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ తన మనసును ఆత్మయందు లగ్నం చేయాలి. ఇతర విషయముల గురించి ఆలోచించకూడదు. ఎల్లప్పుడూ నిష్టతో, నియమంతో వేదాధ్యయనము, శాస్త్ర అధ్యయనము చేయాలి. గురువుల వద్ద శ్రద్ధగా విద్య నేర్చుకోవాలి. ఈ సమయంలో వేరే ఆలోచనలు ఉండకూడదు. అదే బ్రహ్మచర్యము. అంతే కానీ పెళ్లి చేసుకోనంత మాత్రాన ఎవరూ బ్రహ్మచారి కాలేడు.

ఈ మూడు చేయాలని గీతలో కృష్ణుడు చెబుతాడు.


                                    ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu