శ్రీవిల్లిపుత్తూర్ ఆలయం వెనుక కథనం తెలుసా!

 

శ్రీవిల్లిపుత్తూర్ చాలా మందికి తెలిసిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం మార్కండేయ మహర్షి,  భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు. వారు తపస్సు చేసుకోవడానికి సిద్దమైన ప్రతిసారి కాలనేమి అనే రాక్షసుడు వారి తపస్సుకు భంగం కలిగిస్తుండేవాడు. దీంతో వారు శ్రీమన్నారాయణుడుని శరణు వేడారు.  శ్రీమన్నారాయణుడు వారి మోర ఆలకించి కాలనేమి అనే రాక్షసుడిని అంతమొందించాడు. తదనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మర్రిచెట్టు వద్ద వటపత్రశాయిగా వెలశాడు.


శ్రీమన్నారాయణుడు పటపత్రశాయిగా వెలసిన ఆ ప్రాంతానికి మల్లి అనే రాణి ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు.  వారి పేర్లు విల్లి,  పుట్టన్. వారు అడవిలో వెళుతుండగా పులి కంట బడతారు.  పులి వారిని వెంటాడుతుండగా శ్రీమన్నారాయనుడు వారిద్దరిని పులి బారి నుండి కాపాడతాడు. ఆ తరువాత అదే ప్రాంతంలో తనకు గుడి కట్టమని విల్లి, పుట్టన్ కు కలలో కనిపించి చెప్పాడట.  దీంతో  వారిద్దరూ ఆలయాన్ని నిర్మించగా.. వారిద్దరి పేరు మీదనే ఆ ప్రాంతానికి శ్రీవిల్లిపుత్తూరు అనే పేరు వచ్చినట్టు చెబుతారు.


శ్రీవిల్లిపుత్తూరు ఆలయ నిర్మాణం జరిగిన కొంత కాలం తరువాత విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడికి తులసివనంలో ఒక పాప దొరుకుతుంది. ఆమె సాక్షాత్తూ భూదేవి స్వరూపమని తెలిస్తుంది.  విష్ణుచిత్తుడు ప్రతి రోజూ తులసి మాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించేవాడు.  అయితే గోదాదేవి మాత్రం తులసి మాలను మొదట తను ధరించి తరువాత స్వామి వారికి అలంకరించేది. స్వామి వారి మీద తనకున్న ఎనలేని ప్రేమ, భక్తితో శ్రీ రంగనాథుడిని చేరుకుంది. ఎన్నేళ్ళు గడిచినా సరే.. ఇప్పటికీ అక్కడ తులసి మాలలను మొదట అమ్మవారికి అలంకరించి ఆ తరువాత వటపత్రశాయికి అలంకరిస్తారట. మరొక విషయం ఏమిటంటే.. గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతం ద్వారా తిరుప్పావై పాశుర రూపంలో భగవంతుడి కటాక్షాన్ని పొందే మార్గాన్ని సమస్త మానవాళికి అందించిందని చెబుతారు. అందుకే ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది.

                                              *రూపశ్రీ. 
 


More Temples