శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నాచారం, మెదక్ జిల్లా
శ్రీ నారసింహ క్షేత్రాలు - 20
600 ఏళ్ళుగా ప్రసిధ్ధికెక్కిన ఈ ఆలయం వున్న చిన్న గుట్టని శ్వేతగిరి అని, గార్గేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువల్ల తపోవనం అనికూడా అంటారు. నవనాధులైన ఋషులు తపస్సు చేసిన ప్రాంతంగా కూడా చెబుతారు. నవనాధుల తపస్సుకి మెచ్చి స్వామి ఇక్కడ వెలిశారు. నాచార్ అనే భక్తుని పేరుతో వెలిసిన క్షేత్రమిది. 66 ఎకరాల 33 కుంటల స్ధలం లో వున్న ఈ ఆలయం రెండు గోపురాలతో అలరారుతున్నది. ప్రధానాలయం కొండల నడుమ వుంది. గర్భాలయ ద్వారానికి అటూ ఇటూ జయ విజయుల నల్లరాతి ప్రతిమలున్నాయి.
స్వామి స్వయంభూగా కొండల నడుమ వెలిశాడు. అక్కడే విగ్రహ ప్రతిష్ట జరిగింది. స్వామి ఉగ్రమూర్తిగా నాలుక జాపి దర్శనమిస్తాడు. పక్కనే లక్ష్మీదేవి. గర్భాలయం ఎడమవైపు 12 ఆళ్వారుల విగ్రహాలు, కుడివైపు ఉత్సవ విగ్రహాలున్నాయి. నిత్యం సత్యన్నారాయణ వ్రతాలు జరిగే ఈ ఆలయంలో వాటికోసం విశాలమైన వ్రత మండపమున్నది. ఉపాలయాలలో కాలభైరవుడు, నవగ్రహాలు, శివాలయం, పక్కనే శ్రీ వీర వెంకట సత్యన్నారాయణ స్వామి మందిరం (పాలరాతి విగ్రహాలు), రామాలయం (పాలరాతి విగ్రహాలు), ఆంజనేయస్వామి మందిరం, దత్తసాయి మందిరం (ఇందులో దత్తాత్రేయ విగ్రహం, సాయి విగ్రహాలున్నాయి) ఇక్కడ ప్రతి నిత్యం పల్లకీ ఉత్సవం, నిత్యం కళ్యాణోత్సవం జరుగుతాయి. ఫాల్గుణ శుధ్ధ పంచమినుండి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
దర్శనం:
ఉ 6-30 నుంచి 7-30, 9నుంచీ 1 గం. దాకా తిరిగి సాయంత్రం 4 గం.లనుంచి 8-30 గం. ల దాకా
మార్గం:
బొంతపల్లినుంచి తూప్రాన్ – గజ్వేల్ మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తూప్రాన్ ఊళ్ళోకొచ్చిన వెంటనే వచ్చే టి జంక్షన్లో కుడివైపు తిరిగాలి. కొంచెం దూరం వెళ్ళగానే ఎడమవైపు కమాన్ కనబడుతుంది. అక్కడనుంచి 5 కి.మీ. లు వెళ్తే ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాదునుంచి నేరుగా ఈ ఆలయానికి వెళ్ళాలంటే మేడ్చల్ – సిద్దిపేట మార్గంలో వెళ్ళి తూప్రాన్ దగ్గర కుడివైపు తిరిగి 5, 6 కి.మీ. లు వెళ్తే చేరుకోవచ్చు. నాగపూర్ వెళ్ళే జాతీయ రహదారిలో హైదరాబాదు నుంచి 40 కి.మీ. లు, మెదక్ నుంచి 12 కి.మీ. ల దూరంలో వున్నది. దోవ పొడుగూ చెట్లు, కొండలు, గుట్టలు కనువిందు చేస్తాయి.
విజ్ఞప్తి:
శ్రీ నరసింహ క్షేత్రాలను ఆదరించి, అభిమానించిన పాఠకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను చూసిన దేవాలయాల గురించి, నేను సేకరించిన విషయాలు అందరితో పంచుకోవాలనే కోరికతో మొదలు పెట్టిన నా వ్యాస పరంపర పాఠకుల సహృదయంతో సాగుతున్నది. ఇందులో నేను సేకరించిన విషయాల్లో పొరపాట్లు దొర్లి వుండవచ్చు, అసంపూర్ణంగా వుండవచ్చు, ప్రాంతాలనుబట్టి కధలు మారుతూ వుండవచ్చు. ఉదాహరణకి శ్రీ హరహర గారు ... యజ్ఞజ్యోతి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి .... వ్యాసంలో వ్యాఖ్యానించారు .. నరసింహస్వామిని శాంతపరచటానికి శివుడు కారణమని, ఆయనని శరభేశ్వరుడంటారని. కానీ తెలుగు దేశంలో మనం చెప్పుకునే కారణం చెంచు లక్ష్మి, లక్ష్మీ దేవి అని. ఇలాంటి విషయాలు తెలిసినవారు ఇక్కడ తెలియజేస్తే అందరూ తెలుసుకోగలుగుతారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రాలలోవేకాక కర్ణాటక, తమిళనాడులోకూడా విలసిల్లుతున్నాయి. వాటిలో కొన్నింటని మేము దర్శించే భాగ్యం కలిగింది. వాటిలోంచి కొన్ని ఆలయాల విశేషాలు మీతో పంచుకున్నాను. అయితే ఇంకా చాలా వున్నాయి. వాటిని గురించి అవకాశాన్నిబట్టి...... ప్రస్తుతం ఆషాఢ మాసం మొదలయింది. ఈ నెలలో తెలంగాణాలో భక్తి శ్రధ్ధలతో జరుపుకునే పండుగ బోనాలు. అందుకనే వచ్చే వారంనుంచీ అధిక, నిజ ఆషాఢ మాసాల సందర్భంగా, తెలుగు రాష్ట్రాలలో మేము దర్శించిన కొన్ని అమ్మవార్ల ఆలయాలగురించి తెలియజేస్తాను.
- పి.యస్.యమ్.లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)