సింహాద్రి అప్పన్న చందనోత్సవ విశేషాలు
సింహాచలం... శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో, సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున వున్న ‘సింహగిరి’ అనే పర్వతం మీద కొలువై వున్న సింహాచలం తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో భక్తులందరూ ‘సింహాద్రి అప్పన్న’గా పిలుచుకునే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్నాడు.
ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు (2015లో ఏప్రిల్ 21న) చందనోత్సవం నిర్వహిస్తారు. సాధారణంగా సింహాచలంలోని వరాహ నరసింహుడిని నిరంతరం చందనంతో కప్పి వుంచుతారు. విగ్రహం వేడిగా వుంటుందని అంటారు. ఆ వేడిని ఉపశమింపజేయడానికి నిరంతరం చందనం లేపనంగా పూస్తూ వుంటారని చెబుతారు. ఏడాదిలో వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి, కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామివారి నిజస్వరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు. సింహాచల క్షేత్రానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం.
చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కలను అరగదీయడం ప్రారంభిస్తారు. ఇలా అరగదీసిన చందనాన్నే 12 గంటల నిజరూప దర్శనం ముగిసిన తర్వాత స్వామివారికి లేపనంగా పూస్తారు. చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసేందుకు వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తారు.