ప్రత్యక్ష దైవం పుట్టిన రోజు రధ సప్తమి

 

మన పురాణాలలో సూర్యుడి గురించి అనేక కధలు, ఆయన ఉపాసనా విధానాలు వున్నాయి.  జనవరి 21నుంచీ మాఘమాసం ప్రారంభం అవుతోంది.  ఈ మాఘ మాసంలోనే వచ్చే (ఈ నెల 26న) రధ సప్తమి.ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ పుట్టిన రోజు.  సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము.  నిత్య జీవితంలో మనకాయన అనేక విధాల సహాయ పడతాడు.  అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదించి, మన చుట్టూ ఏం వున్నదో చూసే అవకాశం ఇస్తున్నాడు.  వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమేగాక, జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు.  అంతేకాదు .. మనం కాలాన్ని గుర్తించేది .. సూర్య గమనాన్ననుసరించే.  ఒక పగలు, ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా.  అన్నింటికన్నా ముఖ్యమైనది .. భూమి మీద వున్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.


రధసప్తమినాడు చేసే స్నానానికి ఒక విశేషం వున్నది.  ఆ రోజు నదిలో, చెరువు,లో, ఎవరు వీలునుబట్టి వారు స్నానం చేసినా, తలమీద, భుజాలమీద జిల్లేడు ఆకులు పెట్టుకుని తెలిసీ తెలియక చేసిన పాపాలు ఈ రధసప్తమి స్నానంతో తొలగిపోవాలని ప్రార్ధిస్తూ స్నానం చేస్తారు.  కొందరు చిక్కుడు ఆకులు, రేగు పళ్లు కూడా పెట్టుకుంటారు. ఉదయం దొడ్లో తులశమ్మ దగ్గర సూర్యుడు, చంద్రుడు, అశ్వనీ దేవతలు, మున్నగు దేవతలకి చిన్న చిన్న ముగ్గులు వేస్తారు.  రెండు చిక్కుడు కాయల మధ్య పైన ఒకటి కింద ఒకటి పుల్లలు గుచ్చి, వాటిని సూర్య రధాలుగా భావించి చిక్కుడు ఆకులమీద వుంచి పూజ చేస్తారు.  గొబ్బి పిడకలతో చేసిన పొయ్యిమీద పాలు పొంగించి పరవాణ్ణం వండి,  చిక్కుడు ఆకులలో సూర్యుడు, చంద్రుడు, అశ్వని ధేవతలు వగైరా దేవతలకు విడి విడిగా నైవేద్యం పెట్టి తామూ ప్రసాదం తీసుకుంటారు.  పిడకలమీద వండిన ఆ పరవాణ్ణం చాలా రుచిగా వుంటుంది.


మాఘ మాసంలో రధ సప్తమే కాదు, సూర్యుడికి ముఖ్యమైన ఆదివారాలన్నీ కూడా విశేషమైనవే.  ఏ కారణంవల్లనైనా రధసప్తమినాడు పై విధంగా సూర్యారాధన చేయలేనివారు మాఘ ఆదివారంనాడు చేస్తారు.  అంతేకాదు ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశేషమైనదే. ఉదయంనుంచి అస్తమయందాకా (ఆ మాటకొస్తే సర్వకాల సర్వావస్ధలలో) తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు.  మనకి అన్ని విధాలా ఇంత మేలు చేస్తున్న ఆ సూర్యనారాయణునికి ఆలయాలు మాత్రం అతి తక్కువ వున్నాయి.

బహుశా ఆయన్ని ప్రత్యక్ష దైవంగా పూజించటంవల్లనేమో. సూర్య దేవాలయం అనగానే ముందు గుర్తొచ్చేది ఒరిస్సాలోని కోణార్క, గుజరాత్ లోని మధేరా. ఈ రెండు ప్రఖ్యాతి చెందిన ఆలయాలు అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మన రాష్ట్రంలోవున్న సూర్యదేవాలయాలలో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వున్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం. అలాగే సికింద్రాబాదులో తిరుమల గిరిలో నిర్మిపబడిన శ్రీ సూర్య భగవాన్ దేవాలయం దిన దిన ప్రవర్ధమానమపుతూ అనేకమంది భక్తులనాకర్షిస్తున్నది.  మరి ఈ ఆలయం గురించి తెలుసుకుందామా?

 

శ్రీ సూర్య దేవాలయం, తిరుమలగిరి, సికింద్రాబాద్

ఈ ఆలయ నిర్మాత శ్రీ సూర్యశరణ్ దాస్ మహరాజ్ సూర్య భగవానుని భక్తులు. శ్రీ సూర్య భగవానుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్ దాస్ 1959లో ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్య దేవుని ప్రతిష్టించి పూజించసాగారు. శ్రీ సూర్య శరణ్ దాస్ దేవాలయ నిర్మాణాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మింపబడింది ఈ ఆలయం. గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతిమీద మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్కరించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతినానుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు.

పక్కనే అశ్వధ్ధ, వేప చెట్లు కలిసివున్న వేదిక. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి, ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజాల పక్కనే ఆరుబయలే అత్యంత సుందరంగా వెలసిన శివ లింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగ దేవత, మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్పామి ఉపాలయాలున్నాయి. నాగ దేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలున్నాయి.

ఆదివారాలు, సెలవు రోజులు, పర్వ దినాలలో భక్త జన సందోహం ఎక్కువగా వుంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించటానికి వచ్చిన భక్తులలో చాలామంది వేయించిన శనగలు (బొంబాయి శనగలు), గోధుమలు స్వామికి సమర్పిస్తున్నారు. అలాగే కొందరు భక్తులు పాయసం, పులిహోర నైవేద్యాలు పెట్టించి అక్కడకొచ్చిన భక్తులకు ప్రసాదాలు పంచుతున్నారు. మేమొక గంటపైన వున్నాము. అంతసేవూ ఆలయంవారో, భక్తులో అందరికీ ప్రసాదాలు పంచుతూనే వున్నారు.

ముఖ్యఉత్సవాలు

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి, రధ సప్తమికి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.

మొక్కులు
ఇక్కడ భక్తులు మొక్కుకుని తమ కోరికలు తీరుతే 12 ఆదివారాలు 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు.

దర్శనసమయాలు

సోమవారం నుంచి శనివారందాకా ఉదయం 7 గం. లనుంచీ 11 గం. లదాకా, సాయంత్రం 5 గం. నుంచీ 7 గం.లదాకా.

ఆదివారం 6-30 నుంచి 12-30 దాకా, సాయంత్రం 5 గం. ల నుంచీ 7-30 దాకా.

మార్గము -- సికింద్రాబాదు డయమండ్ పాయింట్ నుంచి తిరుమలగిరి వెళ్ళే దోవలో, బౌనేపల్లి మార్కెట్ యార్డ్ ముందునుచి వెళ్తుంటే ఎడమపక్క ఫుడ్ వరల్డ్ వస్తుంది. అది దాటగానే, దానిని ఆనుకుని వున్న సందులో లోపలకెళ్తుంటే కుడిచేతిపక్క 6వ సందులోకి తిరిగి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపు ఆలయం కనబడుతుంది. సందు మొదట్లో చిన్న బోర్డు వుంటుంది. పొరబాటున సందు గుర్తుపెట్టుకోలేక ముందుకు వెళ్తే వచ్చేది టి జంక్ష్షన్. అక్కడ వెనక్కితిరిగి, తిరిగి వచ్చేటప్పుడు ఎడమవైపు మొదటి సందు తిరగండి. పార్కింగుకి పెద్ద ఇబ్బందిలేదు.


మన సమీపంలో వున్న శ్రీ సూర్యనారాయణస్వామిని ఆయనకి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో సేవించి తరిద్దాం.

- పి.యస్.యమ్. లక్ష్మి


More Ratha Saptami