రథసప్తమి ఎందుకంత ప్రత్యేకం!

 

 

సూర్యుడు హైందవుల ప్రత్యక్ష దైవం. అందుకే నదీస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతోనే మన ప్రాచీనుల దినచర్య మొదలయ్యేది. సకల ప్రాణులకూ జీవాన్ని అందించే శక్తిగా, మన జీవితాలను గమనించే కర్మసాక్షిగా సూర్యునికి భౌతికంగానూ, ఆధ్మాత్మికంగానూ కూడా ప్రాముఖ్యతను ఇస్తాము. అందుకే హిందువులు తమ జీవనాదంగా భావించే గాయత్రి మంత్రి ఆ సూర్యుడిని ఉద్దేశించే చెప్పబడింది. ఆ సూర్యభగవానుడిని నాకు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా... ‘మా బుద్ధిని వికసింపచేయి’ (ధియోయోనః ప్రచోదయాత్) అంటూ గాయత్రి మంత్రం ద్వారా అర్థించడం ఎంత ఔన్నత్యమో! ప్రాతఃకాలపు సూర్యునికి అర్ఘ్యాన్ని అందించడమే కాదు! ఆయనకు అభిముఖంగా నిలిచి సూర్య నమస్కారాలను చేసే అలవాటు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

ఈ సూర్యనమస్కారాలు చేయడం వెనుక దాగిన కారణాలు కూడా ఆశ్చర్యపరచక మానవు. యోగశాస్త్రంలో ఉన్న ప్రముఖ ఆసనాలన్నింటి కలయికే సూర్యనమస్కారాలుగా పేర్కొంటూ ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో యోగాన్ని అభ్యసించలేనివారి కోసం ఈ సూర్యనమస్కారాలను రూపొందించినట్లు పెద్దలు చెబుతారు. అంటే ఓ పావుగంటలో పూర్తయిపోయే 12 భంగిమలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందుకోవచ్చునన్నమాట. ఇక మెదడు ఎదుగదలలో లోపాల దగ్గర్నుంచీ డయాబెటిస్ వరకూ అనేక సమస్యలకు కారణం అవుతున్న విటమిన్ డి లోపం కూడా ఈ సూర్యనమస్కారాలు చేసే సమయంలో లభించడం ఖాయం.

ఇన్ని విశిష్టతలు ఉన్న సూర్యభగవానునికి జన్మదినం అంటూ ఒక రోజుని ఏర్పాటు చేసుకోవడం తప్పేమీ కాదు కదా! సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణానికి మరలుతాడు. అలా మరలిన సూర్యుడు రథసప్తమినాటికి చురుకుని పుట్టిస్తాడు. ‘రథసప్తమి నాటికి రథాలు మళ్లుతాయి’ అన్న నానుడి ఈ కారణంగానే పుట్టింది. సూర్యుని జన్మదినం చేసుకునేందుకు అనువైన రోజుగా మారింది.

రథసప్తమినాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలని చెబుతారు. ఇలా చేసే సమయంలో వారి తల మీద ఏడు జిల్లేడు ఆకులను, ఆ ఆకుల మీద రేగుపళ్లను ఉంచుకోవాలి. కొందరు భుజాల మీద కూడా జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేస్తారు. ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రథాలకు లేదా ఆయన కాంతిలోని ఏడు రంగలులకు ప్రతీకగా భావించవచ్చు. జిల్లేడు ఆకులు సాధ్యం కానివారు చిక్కుడు ఆకులతో కూడా ఈ క్రతువుని ముగించవచ్చు. మరికొందరేమో మగవారైతే జిల్లేడు ఆకులు, స్త్రీలు చిక్కుడు ఆకులతో స్నానం చేయాలని చెబుతారు కానీ తొలి ప్రాధాన్యత మాత్రం జిల్లేడుదే! స్నానం ముగిసిన తరువాత ఆవుపాలతో పరమాన్నాన్ని వండుతారు.

ధనుర్మాసం లేదా సంక్రాంతి సందర్భంగా చేసిన గొబ్బెమ్మలని పిడకలుగా చేసి, రథసప్తమి నాటి పొంగలిని వాడేందుకు ఉపయోగిస్తారు. తులసికోట పక్కన సూర్యునికి అభిముఖంగా ఈ పొంగలిని వండటం ఆనవాయితీ. పొంగలి పూర్తయ్యేలోగా చిక్కుడుకాయలను వెదురుపుల్లలకు గుచ్చి ఓ రథం ఆకారాన్ని రూపొందిస్తారు. ఆ రథం ఆకారం మీద 12 చిక్కుడు ఆకులను ఉంచి, ఆ ఆకుల మీద పొంగలిని నైవేద్యంగా పెడతారు.

ఇక ఈ రోజు పూజగదిలో ఉన్న సూర్యనారాయణుని ప్రతిమకు విశేష పూజలను అందిస్తారు. సూర్యాష్టకమ్, ఆదిత్య హృదయం వంటి స్త్రోత్రాలతో ఆయనను ప్రసన్నం చేసుకుంటారు. సూర్యునికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, ఎరుపు రంగు పూలతో కొలిచేందుకు ప్రాధాన్యతనిస్తారు. మరికొందరు తులసికోట ముందరే సూర్యునారాయణుని ప్రతిమను ఉంచి, షోడసోపచార పూజలతో ఆ స్వామిని అర్చిస్తారు. తులసికోట పక్కనే వండుకున్న పొంగలిని ఆయనకు నైవేద్యంగా అందిస్తారు.

ఏ పండుగలో అయినా పత్రానికో, ఫలానికో, శాకానికో ప్రాధాన్యత ఉంటుంది. కానీ రథసప్తమినాడు ఈ మూడూ పూజలో పాల్గొంటాయి. వాటికి తగిన కారణాలూ కనిపిస్తాయి. జిల్లేడులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వాటి పాలలో ఉన్న క్షార గుణం వల్ల ఆ మొక్కకి దూరంగా ఉంటాము. రథసప్తమి సందర్భంగా వాటిని ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల... తడిసిన జిల్లేడులోని ఔషధగుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. ఇక భోగి రోజు పిల్లల మీద మాత్రమే పోసే రేగుపండ్లను, రథసప్తమినాడు అందరూ శిరసుని ధరిస్తారు. వీటిని తల మీదుగా జారవిడవడం వల్ల దృష్టిదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రథసప్తమినాడు జిల్లేడు ఆకులకు, రేగుపండ్లకు ఇంత ప్రాముఖ్యం ఉండటం వల్లనే బహుశా జిల్లేడుని అర్కపత్రంగానూ, రేగుపండుని అర్కఫలంగానూ పిలుస్తూ ఉండవచ్చు. ఇక చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల, ఆకులలోని ఔషధగుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది.

- నిర్జర.

 

 


More Ratha Saptami