జగన్నాథ వైభవం.. పూరీ రహస్యాలు



-యమ్.వి.యస్ సుబ్రహ్మణ్యం



Puri Jagannath Ratha Yatra 2014, Puri Jagannath Ratha Yatra, Puri Ratha Yatra 2014, Puri Jagannath Car Festival

 

హిందువుల ఆధ్యాత్మిక జీవనంలో తీర్థయాత్రలకు ఒక విశిష్ట స్థానం వుంది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిప్రాణి పుడుతూనే భగవత్ భక్తిని శ్వాసిస్తూ పుడుతుంది. అందుకే భగవంతుడు వివిధరూపాలతో, వివిధ నామాలతో ఈ భారతావనిపై అవతరించి, ఆధ్యాత్మిక సుసంపన్నం చేశాడు. అందుకే భారతదేశం పుణ్యభూమి అనీ, కర్మభూమి అనీ, వేద భూమి అనీ, జగత్ విఖ్యాతి గాంచింది. విదేశీయులు సైతం తన ఆధ్యాత్మిక స్రవంతిలోకి ఆకర్ఛించే శక్తి ఒక్క మన భారతదేశానికే వున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు కారణం మన సంస్కృతి, పండుగలు, ఆలయాలలో జరిగే ఉత్సవాలు, వేడుకలు.  మనదేశంలో ఎన్నో పవిత్రం దేవాలయాలు వున్నప్పటికీ, పూరీ క్షేత్రంలో సోదర, సోదరీ సహితుడై కొలువున్న 'జగన్నాథ స్వామీ' ఆలయానికి ఓ ప్రత్యేకత వుంది. ఆ ఉత్సవ మూర్తి ఆకారంలోనే కాదు, ఆయనకు సమర్పించే ప్రసాదాలలోనూ ఓ ప్రత్యేకత, ఆయనకు జరిగే వేడుకల్లోనూ, ఉత్సవాలలోనూ, ఓ ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. విశేషించి జగన్నాథుని రథయాత్ర అంటే, ఆబాలగోపాలానికి ఓ పర్వమే, ఓ వేడుకే, ఓ ఆనంద సందోహ, సంభ్రమ, సంతోష మరీచికే.

పూరీక్షేత్రవిశిష్టత

ఉత్కళ రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి విశ్వ, విశిష్ట స్థానం కలగటానికి కారణం శ్రీ జగన్నాథుడే. ఒకసారి చరిత్ర పుటంలోనికి ప్రయాణిస్తే, చారిత్రాత్మక విషయాలనే స్పృశిస్తామే కానీ, వాటి వెనుకవున్నపురాణ, ఇతిహాస, సత్యాలను గ్రహించడం, నమ్మడం, అంత తేలికైన విషయంగా కనిపించదు. సత్యం ఎప్పుడూ గోప్యంగానే వుంటుంది.  మానవ నమ్మకానికి దూరంగానే వుంటుంది. కానీ, అదెప్పుడూ అందరినీ ఆకర్షిస్తూనే వుంటుంది. అందుకు ప్రత్యక్ష సాక్షి పూరీ జగన్నాథుడే. ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీ జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.

ఆ కథ ఏమిటంటే...

పూర్వం ద్వాపర యుగంలో మనదేశాన్ని 'ఇంద్రద్యుమ్న' మహారాజు పరిపాలించే వాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు 'ఇంద్రద్యుమ్నుని ' కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని, ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని మహద్భాగ్యంగా స్వీకరించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ప్రతిష్టా మూర్తుల రూపాలు ఎలా వుండాలనే విషయంలో సంగ్దిద్ధానికి గురి అయ్యాడు. ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తను శిల్పంగా మలచలేడు. సాధారణ శిల్పులు తను దర్శించిన రూపాన్ని వారు శిల్పంగా మలచలేరు. కారణం వారికి మహావిష్ణువు దర్శనం కలుగకపోవడమే. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ ఎక్కువ కాసాగింది.

Puri Jagannath Ratha Yatra 2014, Puri Jagannath Ratha Yatra, Puri Ratha Yatra 2014, Puri Jagannath Car Festival

 

తన భక్తుడు పడుతున్న ఆవేదన శ్రీమహావిష్ణువుకు అర్థమయ్యి, తానే ఒక శిల్పాచార్యునిగా రూపం ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చి, మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాననీ, అయితే తన పని పూర్తి అయ్యేంత వరకూ, ఎవరూ తన గదిలోనికి ప్రవేశించరాదని, తనంతట తాను బయటకు వచ్చేవరకు, తనపనికి ఎవరూ అంతరాయం కలిగించరాదని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు. ఒక ఏకాంత మందిరంలో మాయాశిల్పి పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఏకాంత మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. కొద్ది రోజులకు ఏకాంత మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి. రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఏకాంత మందిరంలో పని చేస్తున్న శిల్పి మరణించి వుంటాడేమోనని సందేహం కలిగింది.

 

అంతే శిల్పి నియమాన్ని త్రోసిపుచ్చి, ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు రాజదంపతులు. వారి ప్రవేశంతో నియమభంగం అయిందని గ్రహించిన మాయాశిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి, ఆశ్చర్య పోయాడు ఇంద్రద్యుమ్నుడు. కరచరణాలు లేకుండా, వున్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత వ్యధను కలిగించింది. ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, ''మహారాజా, బాధపడకు. ఇదంతా నా సంకల్పం. ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువుతీరి జగన్నాథుడు అనే పేర సర్వజన కోరికలూ తీరుస్తూ వవుంటాను '' అని పలికి అదృశ్యమయ్యాడు. ఇంద్రద్యుమ్నుడు ఆ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికీ సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథులు. ఇది పురాణకథ.

చరిత్ర ఏం చెబుతుందంటే...


11వ శతాబ్దంలో కళింగ దేశాన్ని (ఒరిస్సా రాష్ట్రాన్ని) పరిపాలించిన '' ''అనంత వర్మన్ చోడగంగ దేవుడు ''ఈ ఆలయాన్ని కట్టించాడు. అయితే ఆయన పాలనాకాలంలో  ''విమాన గోపురాన్ని '' (గర్భగుడి), ' 'జగమోహన మందిరాన్ని ''  (నాట్య మంటపాన్ని) మాత్రమే నిర్మించాడు. తర్వత కాలంలో అనగా, క్రీ.శ.1174లో ఒరిస్సాను పాలించిన  ''అనంగ భీమదేవుడు '' ఈ ఆలయాన్ని అభివృద్ది చేశాడు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో దర్శనమిస్తున్న జగన్నాధస్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో నిర్మించినవే.

మూలవిరాట్టు ప్రత్యేకత


సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు 'బలభద్రుడు 'తోనూ, సోదరి  'సుభద్ర 'తోనూ, కొలువుతీరి సేవలు అందుకొంటూ వుంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి.

శిల్ప సంపద


ఈ మహా ఆలయనిర్మాణంలో ముఖ్యంగా నాలుగు భాగాలు వుంటాయి.
1. 'విమాన గోపురం ' (గర్భగుడి)- ' రత్నవేది ' మీద నిర్మించబడిన ఈ గర్భగుడిలోనే సోదర, సోదరీ సహితుడైన జగన్నాధుడు కొలువు తీరి వుంటాడు.
2. ' గాలిగోపురం' (ప్రధాన ప్రవేష ద్వారం) - ఈ ద్వారం నుంచే భక్తులు ప్రవేశించాలి.
3. 'జనమోహన మండపం ' (నాట్య మంటపం)- ఇక్కడే భక్తుల సమక్షంలో ఆలయ ఉత్సవాలన్నీ జరుగుతాయి.
4. ' భోగమంటపం' (వంటశాల) - ప్రపంచంలోని అతిపెద్ద వంటశాల పూరి జగన్నాథునిదే. ఇదే భోజనశాల కూడా. స్వామివారికి సమర్పించే నైవేద్య, భోజనాలన్నీ ఇక్కడే తయారవుతాయి. ఈ ప్రసాదాలన్నీ పర్యవేక్షించేది శ్రీ మహాలక్ష్మీదేవి. పాక కళాకోవిదులైన ఎందరో బ్రాహ్మణులు (పాండాలు) ముక్కుకి, నోటికి గుడ్డలు కట్టుకుని పదార్థాల వాసన కూడా చూడకుండా, భయభక్తులతో, ప్రతినిత్యం సుమారు 54రకాల పదార్థాలను స్వామివారి నైవేద్యానకి సిద్ధం చేస్తారు. పొరపాటున ముక్కుకు కట్టిన గుడ్డ జారితే, వండిన పదార్థాలను వృథా చేసి, మరలా కొత్తగా నైవేద్యాలను అన్నింటినీ సిద్ధం చేస్తారు. ఆ ప్రసాదాలనే భక్తులకు విక్రయిస్తారు. జగన్నాథుజు ప్రసాదప్రియుడు. అందుకే ఇన్ని రకాల నైవేద్యాలు.

గర్బగుడివైభవం

కళింగ దేశ శిల్పసంపదతో  అలరారే గర్బగుడికి నాలుగు ప్రవేశ ద్వారాలు వుంటాయి.
1. హాథీ ద్వార(గజద్వారం) -
2. సింహ ద్వార (సింహద్వారం)
3.  అశ్వద్వార (అశ్వద్వారం)
4.వ్యాఘ్ర ద్వార (వ్యాఘ్ర ద్వారం)
గర్భగుడిపై భాగంలో గల ఆలయశిఖరం ఎనిమిది కోణాలు గల శ్రీ చక్ర ఆకారంలో వుంటుంది. ఈ శ్రీ చక్రం ఎనిమిది ధాతువులతో (ఎనిమిది లోహాలతో తయారు చేయబడింది.  ఒరిస్సా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలోనూ, అతిపెద్ద దేవాలయం పూరీజగన్నాధునిదే. ఈ జగన్నాధుని ఆలయ ఆవరణలో సుమారు 120 చిన్న చిన్న ఆలయాలు వున్నాయి.
సింహద్వారానికి ఎదురుగా 16 ముఖాలు గల ఒక పెద్ద 'అరుణ స్తంభం ' భక్తులను ఆకర్షిస్తూ వుంటుంది. ఆ స్తంభానికి కుడి వైపున నిలబడి చూస్తే లోపలవున్న జగన్నాథుడు దర్శనమిస్తాడు. పూర్వకాలంలో అంటరాని వారికి ఆలయప్రవేశం వుండేది కాదు. అందుచేత అంటరానివారు గర్భాలయ ప్రవేశం చేయకుండా ఈ అరుణ స్తంభం దగ్గరే నిలబడి స్వామిని దర్శించుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జన్మతః హిందువులయినవారు ఎవరైనా సంప్రదాయ దుస్తులు ధరించి (ఆడవారు చీర రవికెలు, మగవారు పంచెలు, ఉత్తరీయాలు) జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు. హైందవేతరులకు ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఒకనాటి మనదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని జగన్నాధుని దర్శనానికి ఆలయ నిబంధనలు అనుమతించని కారణంగా జగన్నాథుని దర్శనం ఆమెకు కలగానే మిగిలిపోయింది. సంప్రదాయ పరిరక్షణ విషయంలో జగన్నాధుని ఆలయం అంత కఠినంగా వుంటుంది. వేడుకలో వచ్చే విదేశీయుల విన్నపాలను గౌరవించి ఈ ఆలయ నిబంధనల విషయంలో కొన్ని సడలింపులు జరిగాయి. అందుకే విదేశీయులకు సైతం జగన్నాధుని దర్శనం నేడు కలుగుతోంది.

 

Puri Jagannath Ratha Yatra 2014, Puri Jagannath Ratha Yatra, Puri Ratha Yatra 2014, Puri Jagannath Car Festival



రథయాత్ర


జగన్నాథుని వైభవానికి, వేడుకకు నిలువెత్తు నిదర్శనంగా, కన్నుల పండుగగా జరిగేది జగన్నాధుని రథయాత్ర. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమవుతుంది.  ఈ రథయాత్రలో మూడు ప్రధాన రథాలు వుంటాయి.
1. బలభద్రుని రథం
2. సుభద్రా దేవి రథం
3. జగన్నాధుని రథం
ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవి తయారుచేస్తారు. రథయాత్ర ముగిసాక ఈ రథాలను భగ్నం (విరిచేస్తారు) చేస్తారు. జగన్నాధుడు ఊరేగే రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం 34న్నర అడుగుల ఎత్తు వుంటుంది.
18చక్రాలు వుంటాయి.
'బలభద్రుడు ' ఊరేగే రథాన్ని ' తాళద్వజ' అంటారు. ఈ రధం 33 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. ఈ రథానికి 16 చక్రాలు వుంటాయి.
సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవదాలన అంటారు. ఈ రథం 31న్నర అడుగుల ఎత్తు వుంటుంది. ఈ రథానికి14 చక్రాలు వుంటాయి.
ఈ మూడు రథాలు అలంకరించడానికి 12 వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబాయిలోని సెంచరీమిల్స్ వారు విరాళంగా సమర్పిస్తారు.
ఈ రథయాత్ర జగన్నాథుని ప్రదాన ఆలయం నుంచి మొదలై, ' గుండిచ' ఆలయం దగ్గర ముగుస్తుంది. జగన్నాథుడు ' గుండిచ'  ఆలయం దగ్గర9 రాత్రులు ' శ్రీ మందిరం'లో విడిది చేస్తారు. ఈ రథయాత్రలో ఎందరో భక్తులు పాల్గోని శక్తి వంచన లేకుండా రథాన్ని లాగుతూ, భజన పాటలు పాడుతూ, స్వామికి సేవలు అందిస్తారు. ఈ రథయాత్రను ' గుండిచ జాతర' అని అంటారు. జగన్నాథుడు శ్రీమందిరంలో విడిది చేసే 9 రాత్రులను వేసవి సెలవు దినాలుగా భావించి భక్తులు సేవిస్తారు. ఈ తొమ్మిది రోజులు జగన్నాధుడు అక్కడే పూజాదికాలు అందుకుంటాడు. ఈ తొమ్మిది రోజులు జగన్నాధుని ప్రధాన ఆలయం మూలవిరాట్టు శూన్యంగా వుంటుంది. సాధారణంగా రథాలలో ఉత్సవమూర్తులనే ఊరేగిస్తారు. కానీ జగన్నాధుని రథయాత్రలో మూలవిరాట్టులే ఊరేగడం ప్రత్యేకత. జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరూ  పాల్గొంటారు.
పూరీ క్షేత్రానికి సమీప గ్రామమైన నారాయణపూర్ లో నివసించే సుమారు వెయ్యి కుటుంబాలు ఈ మూడురథాల తయారీలోనూ, రథయాత్రలో ' జైజగన్నాథ' అని అరుస్తూ రథాన్ని లాగడంలోనూ పాల్గొనడం మరో ప్రత్యేకత.
ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక విశేష పూజ జరుగుతుంది. ఈ పూజలో గర్భాలయాలలోని మూల విరాట్టులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఊరిచివర దహనం చేసేస్తారు. తరువాత కొత్త మూలవిరాట్టులను పునః ప్రతిష్టిస్తారు.

ఔషధసేవ


జగన్నాధునికి నిత్య పూజలు జరిగే సాధారణ దినాలలో రోజుకి ఆరుసార్లు చొప్పున వివిధ రకాలైన సుమారు 54 ప్రసాదాలు నివేదన చేస్తారు. అందుకే ీ థయాత్ర ప్రారంభమైన రోజు నుంచి శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజులు స్వామి వారికి సమర్పించే నివేదనలో నియంత్రణ వుంటుంది. ఏడాది పొడుగునా ఇన్ని రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భావనతో నైవేద్యాలకు ఆటవిడుపు ప్రకటించి స్వామిపారికి రకరకాలైన ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సేవింపచేస్తారు. ఇటువంటి ఔషధసేవ జగన్నాధుని ఆలయంలో తప్ప మరెక్కడా కనిపించదు.

ముగింపు


జగన్నాధుడు శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజుల అనంతరం తిరిగి అవే రథాలలో మహా వైభవంగా గర్భాలయాన్ని చేరుకుంటాడు. దూరదర్శన్ ప్రసారాలు, యితర ప్రయివేటు ఛానల్స్ వారి ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక జగన్నాధుని రతయాత్ర ప్రపంచంలోని ప్రతి యింటి ముంగిటలోకి వస్తోంది. ఇది సంతోష పరిణామమే. అయినా జగన్నాధుని రథ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొని, ఆ స్వామిని సేవించడంలోనే నిజమైన ఆనందము, సంతోషము ఉందనే నిజం అనుభవించిన వారికే తెలుస్తుంది. అదే ఈ మానవ దేహం చేసుకునే నిజమైన రథయాత్ర. 


More Jagannatha Rathotsavam