పూరీ రథయాత్రలో ఎవరికీ తెలియని విశేషాలు

 

 

ఆషాఢమాసం వస్తోందనగానే అందరికీ జగన్నాథుని రథయాత్రే గుర్తుకువస్తుంది. ఆషాఢమాసంలోని రెండోరోజు ఈ పండుగ చేస్తారు. కానీ ఈ రథయాత్రకి సంబంధించిన వింతలు చాలామందికి తెలియవు. అవేంటో మీరే చూడండి!

- ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది.

- ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో అలాకాదు! సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్లని ఏ మతం వాళ్లయినా చూడవచ్చు.

- ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజం అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అనీ పిలుస్తారు.

- ఈ రథాలని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి. దానికి ఎన్ని చక్రాలు ఉండాలి. ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలిలాంటి లెక్కల్ని తూచాతప్పకుండా పాటించాలి. రథాన్ని తయారుచేసేందుకు ఎన్ని చెక్కముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది.

- ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు. కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు, జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురతో ఊడుస్తాడు.

- మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచా అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరీ ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ తొమ్మిదిరోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ గుడికి చేరుకుంటాడు.

- మన దగ్గర రాములవారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారీ వర్షం పడటం ఓ విశేషం.

- జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదేమో! అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటలపాటు కొన్ని వేలమంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు.

- జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని ‘బహుద యాత్ర’ అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ ‘మౌసీ మా’ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయల్దేరతాయి.

- జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతురన్నమాట! దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు.

https://www.youtube.com/watch?v=O_sqHeZPjTQ


More Jagannatha Rathotsavam