అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం
Arasavilli Suryanarayana Swamy Temple
రామాలయం, శివాలయం అంటే ఊరూరా, వీధి వీధినా ఉంటాయి గానీ, సూర్యనారాయణ స్వామి దేవాలయాలు చాలా అరుదు. ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా, అరసవిల్లి సూర్య దేవాలయం కూడా ప్రముఖమైందే.
మనచుట్టూ ఎందరో గ్రహ దోషాలతో బాధపడుతుంటారు. అలా గ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు సూర్య దేవాలయాన్ని దర్శించుకుంటారు. మరి, గ్రహాలకు అధిపతి సూర్యుడే కదా!
అనేక పురాణాల్లో ''హర్షవల్లి'' ప్రస్తావన ఉంది. హర్షవల్లే క్రమంగా అరసవిల్లిగా మారింది. ఈ ఆలయానికి ఎంతో ప్రభావం ఉందని, అనేక సమస్యలతో సతమతమవుతూ వచ్చే భక్తులు, ఆలయంలో ప్రవేశించగానే అన్నిటినీ మర్చిపోయి అలౌకిక ఆనందానికి లోనవుతారని చెప్పే నిదర్శనాలు ఉన్నాయి. అనుకున్నవి నెరవేరి హర్షం సొంతం చేసుకుంటారు కనుకనే ఈ ఊరికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని కూడా అంటారు.
స్థల పురాణాన్ని అనుసరించి, ద్వాపరయుగంలో మహావిష్ణువు అవతారమైన బలరాముడు ప్రజల మేలు ఆశించి, నాగేటి చాలుతో నాగావళి నదిని ఆవిర్భవింప చేశాడు. నది తీరంలో ఒక దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. విష్ణుమూర్తి స్వయంగా కల్పించడాన, వాటిని చూట్టానికి దేవతలంతా విచ్చేశారు. ఇంద్రుడు మాత్రం సమయానికి వారితో కలిసి రాలేకపోయాడు. ఆలస్యంగా, రాత్రివేళ దేవేంద్రుడు రాగా నందీశ్వరుడు అడ్డుకున్నాడు.
దేవలోకానికి అధిపతి అయిన తననే ఆలయంలోనికి వెళ్ళనీయడా అని కోపంతో ఇంద్రుడు, తన వజ్రాయుధంతో నందీశ్వరుని కొట్టబోయాడు. కానీ, ఇంద్రుని ప్రయత్నం ఫలించలేదు. నందీశ్వరుడు కొమ్ములతో వజ్రాయుధాన్ని ఒక్క తోపు తోశాడు. ఆ విసురుకు వజ్రాయుధంతో బాటు ఇంద్రుడు కూడా దూరంగా వెళ్ళి పడ్డాడు. వెంటనే స్పృహ తప్పింది.
కొద్దిసేపటికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, ''ఇంద్రా, నువ్వు ఆలయం వైపు నడుస్తూ వెళ్ళు... దారిలో నీకు కనిపించిన విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్టించు'' అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇంద్రుడు లేచి, గుడి వైపు నడుస్తున్నంతలో సూర్యనారాయణ స్వామి విగ్రహం కనిపించింది. దాన్ని తీసికెళ్ళి, గుడిలో స్థాపించి, నమస్కరించాడో లేదో ఇంద్రునిలో ఒక అలౌకిక ఆనందం ప్రవేశించింది.
ఆనాడు ఇంద్రుడు అనుభవించిన అలౌకిక ఆనందం ఇప్పటికీ భక్తులకు అనుభూతమౌతోంది. అరసవిల్లి క్షేత్రంలో అడుగు పెట్టగానే సంతోషం సొంతమౌతుంది.
Pilgrimage, hindu religious places, hindu temples in india, hindu temples in Andhrapradesh, punyakshetras in andhra, Arasavilli Suryanarayana Swamy Temple