ఇంట్లో ఇలా స్నానం చేస్తే.. మహా కుంభంలో అమృత స్నానం చేసిన ఫలితం దక్కుతుందట..!
కుంభమేళా.. 12 సంవత్సరాలకు ఒక సారి జరిగే కుంభమేళా భారతీయులకు చాలా ప్రత్యేకం. కుంభమేళాను దర్శించి అక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని, రోగాలు తగ్గుతాయని, భగవంతుడి పాదాలు పట్టుకున్నంత ఫలితం దక్కుతుందని అంటారు. జనవరి 29 వ తేదీన మౌని అమావాస్య తిథి ఉంది. ఈ తిథి సందర్భంగా అమృత స్నానం ఆచరిస్తారు. అయితే ప్రజలు కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమానికి చేరి అక్కడ స్నానాలు ఆచరించి వెళ్తూనే ఉంటారు. కానీ ఇలా త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం ఆచరించడం అందరికీ సాధ్యం కాదు. అలా వెళ్లలేని వారు కొన్ని నియమాలు పాటించి స్నానం చేయడం ద్వారా ఇంట్లోనే కుంభమేళా అమృత స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు.
కుంభమేళా స్నానం ప్రయోజనాన్ని పొందడానికి సూర్యోదయానికి ముందే మేల్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే అమృత స్నానం అనేది బ్రహ్మముహూర్త సమయంలో జరుగుతుంది. దగ్గరలో పవిత్ర నది ఏదీ లేకపోతే ఇంట్లోనే ఉన్న నీటిలో కొంత గంగాజలం వేసి భక్తితో స్నానం చేయవచ్చు.
స్నానం చేస్తున్నప్పుడు “గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ. నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధి కురు.” మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించలేకపోతే "హర హర గంగే" అని అయినా జపించవచ్చట.
అమృత స్నానం చేసిన ఫలితం, పుణ్యాన్ని పొందడానికి స్నానం చేసేటప్పుడు సబ్బు, డిటర్జెంట్ లేదా ఎలాంటి షాంపూని ఉపయోగించకూడదు. కుంభమేళాలో సాధారణంగా 5 స్నానాలు చేసే సంప్రదాయం ఉంది. కాబట్టి మనస్సులో గంగామాతను స్మరించుకుంటూ ఇంట్లో స్నానం చేయవచ్చు.
బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసిన తరువాత, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. తులసి మాతకు నీటిని సమర్పించాలి. మహాకుంభంలో విరాళానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే స్నానం చేసిన తర్వాత డబ్బు, బట్టలు, ఆహారం మొదలైన వాటిని పేదలకు, నిస్సహాయులకు దానం చేయాలి. ఇలా ఇంట్లో స్నానం చేసి, దానం చేసిన వారు ఆ రోజు ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తినకూడదు. ఈ రోజు శారీరక స్వచ్ఛతతో పాటు మానసిక స్వచ్చత కూడా చాలా ముఖ్యం. అందువల్ల మనస్సును స్వచ్చంగా ఉంచుకోవాలి. మనసులో ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి ఉంచుకోకూడదు. ఇలా చేస్తే మహాకుంభమేళా లో అమృత స్నానం చేసిన ఫలితం దక్కుతుంది.
*రూపశ్రీ.
