మాఘ మాసంలో శ్యామలా నవరాత్రులు.. ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నా ఎంతో గొప్ప ఫలితం..!

 

హిందూ ధర్మంలో స్త్రీ దేవతలకు చాలా ప్రాధాన్యత ఉంది.  దుర్గాదేవి, లలితా దేవి,  రాజరాజేశ్వరి, పార్వతీ దేవి, మహా లక్ష్మీ.. ఇలా చాలామంది దేవతా మూర్తులను శక్తి దేవతలుగా పూజిస్తారు.  మాసాన్ని బట్టి నవరాత్రులు కూడా జరుపుకుంటారు. అందరికీ శరన్నవరాత్రులు తెలుసు కానీ మాఘ గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు,  వారాహీ నవరాత్రులు.. ఇవన్నీ చాలామందికి తెలియవు.   అయితే సోషల్  మీడియా కారణంగా ఆధ్యాత్మికత, భక్తి గురించిన విషయాలు బాగా వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రస్తుతం జనవరి 30 వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభం అయ్యింది. మాఘమాసంలో పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో కొందరు దీక్ష కూడా తీసుకుంటారు. అయితే దీక్ష తీసుకోకపోయినా పర్లేదు.. సింపుల్ గా పూజ చేసుకున్నా ఆ శ్యామలా దేవి కరుణిస్తుందట.  సింపుల్ గా ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుంటే..

ప్రతి హిందూ ఇంట్లో పూజ అనేది తప్పనిసరిగా జరుగుతుంది. మాఘమాసంలో మాఘ గుప్త నవరాత్రులు  జరుగుతాయి. ఈ తొమ్మిది రోజులు చాలామంది శ్యామలా దేవిని పూజిస్తారు.  శ్యామలా నవరాత్రులు నిష్టగా చేసుకుంటే జీవితంలో చాలా గొప్ప ఫలితాలు కనిపిస్తాయని అంటారు. అయితే దీక్ష తీసుకోకపోయినా ప్రతి రోజూ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటారు. నిత్య దీపారాధన చేసుకున్న తరువాత శ్యామలా దేవి కరుణ కోసం కొన్ని మంత్రాలు పఠించాలి.

శ్యామలా దండకం..

శ్యామలా దేవి దండకాన్ని ప్రతి రోజూ నిత్య  దీపారాధన తరువాత చెప్పుకోవచ్చు.  ఇలా చెప్పుకుంటే ఆ అమ్మవారు కరుణిస్తారు. అయితే భక్తి ప్రధానం.  అమ్మవారిని నమ్మి మనస్ఫూర్తిగా శ్యామలా దండం చెప్పుకోవాలి.

శ్యామలా స్తుతి..

శ్యామలా దండకం మాత్రమే కాకుండా శ్యామలా స్తుతి కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైనది.  ఇందులో చాలా మంత్ర రహస్యాలు కలిసిపోయి ఉంటాయి. శ్యామలా స్తుతి మరీ పెద్దగా కూడా ఉండదు. జీవితంలో మంచి చేయమని ఆ శ్యామలా దేవి మీద భారం వేసి మనస్ఫూర్తిగా శ్యామలా స్తుతి చెప్పుకుంటూ ఉంటే గొప్ప మార్పు కనిపిస్తుంది.

శ్యామలా దేవి 16 నామాలు..

శ్యామలా దేవికి 16 నామాలు ఉన్నాయి.  పెద్దపెద్ద శ్లోకాలు చెప్పుకోలేకపోయినా కనీసం ఈ 16 నామాలను అయినా భక్తిగా అమ్మవారి మీద మనసు ఉంచి భక్తితో చెప్పుకున్నా ఆ అమ్మవారు కరుణిస్తారు. ఇలా ఒకదానికంటే మరొకటి సులభమైనవి అయితే ఉన్నాయి. కానీ సులభంగా, ఎలాంటి పూజలు చేయకుండా, ఏ మాత్రం పూజల కోసం సమయం కేటాయించకుండా కష్టాలు పోవాలి, దేవుళ్లు కరుణించాలి అని మాత్రం అనుకోకూడదు. దేవుడు కష్టాలు  ఇస్తున్నాడు అంటే కర్మను కరిగిస్తున్నాడు అని అర్థం. ఆ కరుగుతున్న కర్మలను ఆపాలని చూస్తే ఖాతాలో కర్మలు అలాగే మిగిలిపోతాయి. మనిషి చేసుకున్న కర్మలను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. పై మూడు మంత్రాలు లేదా వాటిలో ఏదో ఒకటి భక్తిగా పారాయణ చేస్తూ అబద్దాలు చెప్పకుండా,   ఒకరి మీద నిందలు వేయకుండా నిజాయితీగా, నీతిగా ఉంటూ అమ్మవారి మీద మనసు ఉంచి అమ్మను స్మరించుకుంటూ ఉంటే ఆ అమ్మవారు కరుణిస్తారు.


                          *రూపశ్రీ.


More Aacharalu