లక్ష్మీదేవికి ఇష్టమైన 6 రకాల పువ్వులు ఏంటో తెలుసా...
భారతీయ హిందూ ధర్మంలో ప్రతి ఇల్లు, ఇల్లాలు లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుంటారు. ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మికత పురోగతిని కూడా ప్రసాదించే దేవత. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పరిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు ఏంటో తెలుసుకుంటే..
తామర..
తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై దర్శనం ఇస్తుంది. బురదలో వికసించే తామర పువ్వు ఎంతో పవిత్రమైనది. అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. తామర పువ్వును సమర్పించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగుతాయి. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
మల్లెపూలు..
మల్లె పువ్వులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సువాసన భరితమైన పువ్వులంటే ఆ అమ్మకు ఎంతో ప్రీతి. తెలుపు రంగు స్వచ్ఛతను, శాంతిని సూచిస్తుంది. మల్లెపువ్వులను సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు.
గులాబీ..
గులాబీ పువ్వులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. ఆ అమ్మ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉంచితే సంతోషిస్తుంది. ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని మరొక వైపు ప్రేమను కూడా సూచిస్తాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాకుండా ఇబ్బందులు పడేవారు ఎరుపు గులాబీలతో లక్ష్మీదేవిని అర్చిస్తే డబ్బులు తిరిగి వస్తాయి. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగుతాయి. బార్యాభర్తల మద్య ప్రేమ చెక్కుచెదరదు.
బంతి పువ్వు..
బంతిపువ్వులకు భారతీయ పూజలలో చాలా ప్రాధాన్యత ఉంది. బంతిపువ్వు లేని పూజ, శుభకార్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉండాలన్నా, దుష్టశక్తులు పారిపోవాలన్నా , విద్యార్థులు చదువులో రాణించాలన్నా లక్ష్మీదేవికి బంతిపువ్వులతో పూజ చేయాలి.
మొగలి పువ్వు..
మొగలిపువ్వు దాని వాసనకు చాలా ప్రసిద్ధి. ఇది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. మొగలి పువ్వును లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలు అవుతుంది.
మందారం..
ఎరుపు రంగు మందారం పువ్వు శక్తికి, శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. లక్ష్మీ పూజలో మందారం పువ్వులు సమర్పిస్తే దేవత త్వరగా ప్రసన్నం అవుతుంది. భక్తులకు, సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతిని ప్రసాదిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తీ చేస్తారు. వ్యాపారాలలో వృద్ధి ఉంటుంది.
పూజలో పువ్వులను సమర్పించే నియమాలు..
పూజలో తాజాగా ఉన్న పువ్వులు, సువాసన గల పువ్వులను మాత్రమే సమర్పించాలి.
పువ్వులను అమ్మవారికి సమర్పించే ముందు గంగాజలంతో శుద్ది చేయాలి.
ఏ దేవతకైనా ఏ పువ్వును అయినా సమర్పించే ముందు ఆ దైవ నామం జపిస్తూ పువ్వులు సమర్పించాలి.
*రూపశ్రీ.
