కుంభకోణం యాత్ర – 18
చక్రపాణి ఆలయం
బ్రహ్మన్ కోవెల, ఆది వరాహస్వామి కోవెల, చక్రపాణి కోవెల ఈ మూడూ దగ్గర దగ్గరగానే వుంటాయి. ఆటో ఎక్కినంతసేపు పట్టలేదు కదా చక్రపాణి కోవెలకు రావటానికి.
రండి. ఇదే చక్రపాణి కోవెల. కుంభకోణంలో ప్రసిధ్ధి చెందిన వైష్ణవాలయాలలో ఇది ఒకటి. మహావిష్ణు ఆయుధం సుదర్శన చక్రం. మహావిష్ణు ఇక్కడ చక్రాకారంలో వుంటాడుకనుక ఇది చక్రపాణి కోవెల. ఒకసారి మహావిష్ణు తన సుదర్శన చక్రాన్ని జలందాసురుడు అనే రాక్షసుడిని చంపటానికి పాతాళానికి పంపుతాడు. తర్వాత ఆ చక్రం కావేరీ నదినుంచి బయటకి వచ్చిందట. (ఆ ప్రదేశాన్ని చక్ర తీర్ధంగా వ్యవహరిస్తారు). ఆ సమయంలో బ్రహ్మదేవుడు కావేరీ నదీ తీరాన యజ్ఞం చేస్తున్నాడు. ఆయన ఆ చక్రాన్ని చూసి ముగ్ధుడై అక్కడే ప్రతిష్టించాడు. ఈ చక్రకాంతులముందు, అపర తేజస్సుతో వెలుగుతున్న సూర్యుడి కాంతి చిన్నబోయింది. సూర్యుడు తనకన్నా సుదర్శనం తేజస్సు ఎక్కువ వుండటంతో ఈర్ష్య చెంది ఆయనకి పోటీగా తన తేజస్సుని పెంచాడుట.
కానీ సుదర్శన చక్రం సూర్యుడి తేజస్సునంతా తనలో లీనం చేసుకుంది. ఆ సమయంలో మహావిష్ణు సూర్యుడి ముందు తన పూర్తి తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు విష్ణుని శరణు కోరాడు. ఈ సంఘటన వైశాఖ పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. విష్ణు మహిమని తెలుసుకుని సూర్యుడు ఈ ఆలయం నిర్మించాడుట. తృప్తి చెందిన సుదర్శనం సూర్యుడి శక్తులన్నీ తిరిగి వచ్చేటట్లు అనుగ్రహిస్తాడు. సూర్యుడు ఆ ప్రదేశం తన పేరుతో వుండాలని కోరుకున్నాడు. కరుణించిన చక్రపాణి ఆ క్షేత్రనికి భాస్కర క్షేత్రంగా విలసిల్లుతుందని వరమిచ్చాడు. సూర్యుడు ఈ స్వామిని మాఘ మాసంలో సేవించాడంటారు. దానికి గుర్తుగా ప్రతి మాఘమాసంలో ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఇంకొక కధ ప్రకారం ప్రళయంలో ఇక్కడికి కొట్టుకు వచ్చిన కుంభాన్ని పరమ శివుడు బాణంతో ఛేదించగా అమృతం అనేక చోట్ల పడ్డది. వాటిలో చక్రపాణి ఆలయం వున్న ప్రదేశంకూడా ఒకటి. చక్రపాణి గర్భగుడి మిగతా ఆలయంకన్నా ఎత్తుగా వుంటుంది. చక్రపాణి విగ్రహం ఆరు కోణాలున్న చక్రం మధ్యలో వుంటుంది. స్వామి నుంచున్నట్లు వుంటాడు. ఎనిమిది చేతులలో ఆయధాలు వుంటాయి. ఈయనకి మూడవ కన్ను కూడా వున్నది. ఈ మూడో కంటి గురించి వివరాలు తెలియలేదు. అంటే విష్ణుమూర్తికి మూడవ కన్ను ఏమిటా అని.
ఈ ఆలయం సారంగపాణి ఆలయంకన్నా కొంచెం చిన్నగా వుంటుంది కానీ పెద్ద ఆలయమే. సారంగపాణి ఆలయంలో వున్నట్లే ఇక్కడ కూడా ఉత్తరాయణ ద్వారం దక్షిణాయన ద్వారం అని రెండు ద్వారాలుంటాయి. ఆలయం గురించి విశేషాలు చెప్పానుకదా. ఇంక మీరే చూద్దురుగాని పదండి. ఇవాళ కృష్ణాష్టమి కదా ... కృష్ణుడి బుజ్జి బుజ్జి అడుగులు ధ్వజ స్ధంబంనుంచి గుడి లోపలకి ఎంత చక్కగా వేశారో!
ముందు కొంచెం చీకటిగా వుందేమిటి? గుడి తీసే వుంది కదా. అదిగో ఆవిడ వెళ్తున్నారు. మనం కూడా ఆవిడతో వెళ్దాం. మనం కొత్తవాళ్ళమని కనిబెట్టేసింది. అందుకే అయ్యవారి గుళ్ళోకెళ్తున్న మనని ఆపుతోంది. ఎందుకనో కనుక్కుందాము. ఆవిడ అనటం ముందు అమ్మవారిని చూసి, తర్వాత అయ్యవారిని చూడాలిట. అమ్మ మన కోరికల గురించి అయ్యకి రికమెండ్ చేస్తుందన్నమాట. ప్రదక్షిణ మార్గంలో వెళ్తే స్వామి కోవెలకి పక్కనే అమ్మవారి కోవెల వున్నది. అందాల తల్లి, అంబుజవల్లి, నుంచుని తీరిక లేకుండా తన దర్శనానికి వచ్చే బిడ్డల మొరలాలకిస్తున్నది. అమ్మ దర్శనం అయింది కదా. ఇంక అయ్య దర్శనానికి పదండి.
చక్రపాణి గర్భగుడి తాళం వేసి వున్నది. గుళ్ళో గర్భగుడి ముందు మండపంలో కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి కృష్ణుడి పూజ చేస్తున్నారు. ఇవాళ కృష్ణాష్టమి కదా. పూజారులు ఈ పూజ దగ్గరే వున్నారు. అందుకే గర్భగుడి తాళం వేసి వుంటారు. అయినా గ్రిల్ లోంచి స్వామి దర్శనం చక్కగా అవుతున్నది .. చూడండి. స్వామి పక్కనే సుదర్శనవల్లి. (అమ్మవారికి రెండు పేర్లు వున్నాయనుకుంటా). కృష్ణుడి ఊరేగింపు, ప్రసాదాలేకాక పూజ కూడా చూస్తున్నాము చూడండి.
పూజ పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టవచ్చు. మనం అప్పటిదాకా ఆగలేము. ఇంకొక ఆలయం చూడాలి. ఆటో అతను వైట్ చేస్తుంటాడు. పదండి..వెళ్దాం. ఈ కారిడార్ చూశారా? దీనిని క్రీ.శ. 1620లో నాయక రాజుల మంత్రి గోవింద దీక్షితార్ నిర్మించాడు. ఆలయం చుట్టూ గ్రనైట్ తో కట్టబడిన ప్రహరీ గోడ వున్నది. రాజ గోపురం ఐదు అంతస్తులతో అలరారుతున్నది ఈ కారిడార్ లో ఆయన పిలుస్తున్నారు ప్రసాదం తీసుకోమని. ఇవాళ మనకి ప్రసాదాలే ప్రసాదాలు. కట్టు పొంగలి వేడి వేడిగా బలే బాగుందికదూ. సరే పదండి. ఆలస్యమవుతోంది.
శంభోజి 2 అనే రాజుకి వున్న అస్వస్ధత ఈ స్వామిని సేవించటంతో పోయిందట. ఆ రాజు విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. వినాయకుడు, పంచముఖ ఆంజనేయస్వామి ఉపాలయాలు. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధం వున్న విష్ణ్వాలయాలలో ఇదీ ఒకటి. ఈ స్వామిని బిల్వ పత్రాలతో పూజిస్తారు.
ఈ స్వామిని సేవిస్తే గ్రహ బాధలనుండి కాపాడుతాడని, వివాహం, సంతానం విషయాలలో వరాలు ప్రసాదిస్తాడనీ భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో సుదర్శన యాగం చేస్తే బహుముఖ ఫలితాలను పొందవచ్చు అంటారు. అయితే తాము పొందిన ఫలితాన్ని ఇక్కడ భగవంతుని పాదాల దగ్గర సమర్పించాలి. ఆయన మన అవసరాలబట్టి మనకి ఆ ఫలితాన్ని ప్రసాదిస్తారు. మనం కూడా సాదారణంగా పూజ అయిన తర్వాత సర్వం భగవంతుని పాదాల చెంత సమర్పించటం అలవాటే కదా. అలాగే అన్నమాట.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)