కార్తీక మహా పురాణం పదిహేడవ రోజు

మత్స్యావతార విశేషాలు Karthika Puranam – 17


సూతుడు ఇలా చెప్తున్నాడు..

పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణునికి నమస్కరించి, ''ప్రాణేశ్వరా! కాల స్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతుండగా తిథుల్లో ఏకాదశీ, నెలల్లో కార్తీకము మాత్రమే మహా ఇష్టమైనందుకు కారణం ఏమిటో తెలియజేయ''మని కోరింది.

అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ''సత్యా! మంచి ప్రశ్ననే అడిగావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే ఇప్పుడు నేను నీకు చెప్తాను విను'' అంటూ ఇలా చెప్పసాగాడు.

నారద ఉవాచ

సముద్ర నందనుడయిన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతా అధికారాలనూ హస్తగతం చేసుకుని, వారిని స్వర్గం నుండి తరిమేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాభంధువులతో సహా మేరు పర్వత గుహల్లో తల దాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే తిరిగి దాన్ని సాధించుకోవడం కోసం బలాన్ని పెంచుకుంటారు. అలా వేదమంత్రాలవల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలి అనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రాగతుడై ఒకానొక వేళలో బ్రహ్మనుండి వేదాలను ఆకర్షించాడు. కానీ, యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతినుండి తప్పించుకుని ఉదాకాలలో తల దాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు గానీ వాటిని పసిగట్టలేక పోయాడు. అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాలని సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరనీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతలూ కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో ధూపదీప సుగంధ ద్రవ్యాదులతో కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్ర లేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన దేవతలను చూసి రమాపతి ఇలా అన్నాడు. ''మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడై మీ పట్ల వరదుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశినాడు తెల్లవారుజామున నేను మేల్కొనేవరకూ మీరు ఎలా అయితే సేవించారో, అలాగే ధూప దీప సుగంధ ద్రవ్యాదులూ, నృత్య గీత వాద్య నామస్మరణాదులతో షోడశోపచారాలతో,కార్తీక శుద్ధ ఏకాదశీ ప్రాతః సమయాన నన్ను సేవించే మానవులు నాకు ఇష్టులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. వాళ్ళు సమర్పించిన అర్ఘ్య పాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమౌతాయి. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలు అయినట్లే ప్రతి కార్తీకమాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లుగాక!

నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి, వేదాల్ని కాపాడుతాను. ఇకనుంచి కార్తీకమాస ప్రాతః సమయాన చేసే నదీస్నానం అవబ్రుథ స్నానతుల్యం అవుతుంది. ఇంకా కార్తీక వ్రతం ఆచరించిన వాళ్ళంతా నేను వైకుంఠాన్ని, నువ్వు స్వర్గాన్ని పాలిస్తున్నట్లు పుణ్యలోకాలు పొందుతారు. ఓ వరుణదేవా! కార్తీక వ్రత నిష్టుల కార్యాలకు విఘ్నాలు కలక్కుండా రక్షణ చేసి పుత్ర పాత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలూ అందించు. ఓ కుబేరా! ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు పుణ్యం సంపాదించి జీవన్ముక్తులు అవుతున్నారో, అలాంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా! కార్తీక వ్రతాన్నిఎవరు జన్మవ్రతంగా భావించి విధ్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరిచేతా కూడా పూజించదగిన వారిగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువల్ల కార్తీక వ్రత, ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరి దారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్దాదులన్నీ స్వర్గ ఫలాన్ని ఇవ్వగలవేమో గానీ వైకుంఠ ఫలాన్ని ఇవ్వలేవు..''

మత్స్యావతారం

భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు ఉపదేశించిన వాడై తక్షణమే మహా మత్స్యావతారమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా చేప పిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనం పెరిగిపోవడం వల్ల దాన్ని ఒక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే అది నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహా సముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి, దాన్ని తన చేతి శంఖంగా ధరించి బదరీ వనానికి చేరి అక్కడ ఎప్పటివలెనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ''ఓ మునులారా! వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను'' అని చెప్పాడు.

విష్ణు ఆజ్ఞను శిరసా వహించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు.

ఓ పృథు మహారాజా! ఆ వేదాల్లో నుంచి ఋషులకు ఎవరికి ఎంత లభ్యమయిందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు రుషులుగా ప్రభాసించారు. తర్వాత వేదయుతులై ప్రయాగలో ఉన్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు.

విష్ణు ఆజ్ఞపై సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలు, ఋషులతో కూడినవాడై ఆశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గాంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్ధించారు.

''ఓ దేవాదిదేవా! జగన్నాయకా! మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో వరప్రదాతనై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథా! నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమంతా యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కనుక నీ దయవల్ల ఈ చోటు భూలోకంలో సర్వ శ్రేష్ఠమైంది, నిత్య పుణ్యవర్ధకమైంది, ఇహపర సాధకమైంది అవుగాక. అలాగే, ఈ కాలం మహా పుణ్యవంతమైంది. బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైంది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు''

దేవతల ప్రార్థన వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసం చేశాడు. ''దేవతలారా! మీ అభిప్రాయం నాకు సమ్మతం. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక! ఇకనుంచి బ్రహ్మ క్షేత్రం పేరుతో ప్రఖ్యాతి వహించుగాక. అనతికాలంలోనే సూర్య వంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగా సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో ఇక్కడే సుస్థితులవుతారు. ఇది తీర్ధరాజంగా ఖ్యాతి వహించుగాక! ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమ అర్చనాదులు అనంత పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యం అందుతుంది. అనేకానేక జన్మక్రుతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్రదర్శనమాత్రం చేతనే నశించిపోతాయి.ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నా యందే లీనమై మరుజన్మ లేనివాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకరం నందుండగా ప్రాతః స్నానం చేసినవాళ్ళని చూసినంత మాత్రంచేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలను ప్రసాదిస్తాను.

ఓ ఋషులారా! శ్రద్ధగా వినండి! నేను సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడంవల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్ధ దర్శనమాత్రం చేతనే సర్వులూ తమ పాపాలను పోగొట్టుకున్నవారై జీవన్ముక్తులౌతారు''

శ్రీ మహావిష్ణువు ఇలా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమతమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథు నృపాలా! ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని ఈ కథా శ్రవణ మాత్రం చేతనే పొందగలరు'' అని చెప్పి ఆగాడు నారదుడు.

Kartika Puranam, Kartika Maha Puranam-6, Kartika Puranam brings Punya, Kartika Puranam Hindu Tradition, Kartika Puranam Hindu Culture, Lingashtama by S.P. Balasubrahmanyam

 


More Festivals