కార్తీక మహా పురాణం ఇరవై నాల్గవ రోజు

తులసి, ఉసిరి కథలతో స్వర్గప్రాప్తి

Karthika Puranam – 24

యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు ఈశ్వరుని సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి, నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయా గౌరిని చూశాడు శివుడు. చూసీచూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు మూడు మహా బాణాలను శివుని శిరసు, వక్షస్థలం, ఉదరభాగాలపై ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు.

అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవుడు బోధించాడు. పరమేశ్వరుడు భీషణ రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేకమంది రాక్షసులు పారిపోసాగారు.

అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ, నిశుంభులను చూసిన రుద్రుడు ''పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరు గాక'' అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు.

ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగంనుండి పరుగుతీయసాగింది. దాన్ని మళ్ళించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపచేయగల మహా శక్తివంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుని తల నరికి నేలపై పడేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలు అందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవుల్లో అల్లాడిపోతున్న విష్ణువును స్వస్తుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుగ్గానూ పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గ్రుహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్ధించారు.

1. సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో, ఎవరి ఇచ్చ వల్ల లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో, అటువంటి మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాను.

2. ఏదైతే ఇరవై మూడు బేధాలతో చెప్పబడి సమస్త లోకాలను అధిష్టించిందో, వేదాలు సైతం దేని రూప కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

3. దేనియందు భక్తుడైన వాడు దారిద్ర భయ మోహ పరాభావలను పొందడో, ఏదయితే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

4. దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతిని (మహా మాయ) ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలూ పఠిస్తారో వాళ్ళు ఎన్నడూ దారిద్ర్యాన్ని, భయాన్ని, మొహాన్ని, దుఃఖాన్ని, అవమానాన్ని పొందరు.

నారద ఉవాచ

ఇక ప్రస్తుతంలోకి వద్దాం.

అలా దేవతల ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు పొడచూపి ''ఓ దేవతలారా! త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమోగుణం వల్ల సరస్వతిగాను సత్వగుణంవల్ల పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కనుక మీ వాంఛాపరిపూర్తికై ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతులను ఆశ్రయించండి'' అని ఆదేశించి అంతర్ధానమై పోయింది. దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలను ఇచ్చి 'విష్ణువు ఎక్కడయితే మొహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లండి'' అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితా ప్రాంతమంతటా చిలకరించారు.

ఓ పృథు భూపతీ! పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా స్త్రీలు గానీ, పురుషులు గానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు'' అన్నాడు నారదుడు.

పునః నారదుడు ప్రవచిస్తున్నాడు

ఓ పృథు మహారాజా! పూర్వోక్తవిధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాలవల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి - అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వల్ల ఉసిరిక, లక్ష్మి వల్ల మాలతి, గౌరీ వల్ల తులసి ఏర్పడ్డాయి. అంతవరకూ బృందా మొహంతో మందుడై ఉన్న విష్ణువు తనచుట్టూ చెట్లయి మొలిచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకుని అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ, వాటిలో లక్ష్మీదత్తబీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటంవల్ల ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై, విష్ణువునకు ఎడమయింది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై, ధాత్రీ తులసీ సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు.

తులసి మహిమ

ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం - ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి.

తులసి దళాలతో శివ, కేశవులను అర్చించినవారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. పుష్కరాది తీర్ధాలు గంగాది నదులు, విష్ణు ఆది దేవతలు తులసిలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవాళ్ళయినా తులసి మట్టిని పూసుకుని మరణించినట్లయితే వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. ఇది ముమ్మాటికీ సత్యం. తులసి ఆకులను ధరించేవారికి పాపాలు అంటవు. తులసివనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు మేలు చేస్తుంది.

ధాత్రీ (ఉసిరి) మహిమ

ఉసిరిచెట్టు నీడన పిండప్రదానం చేసినవారి పితరులు నరకం నుంచి విముక్తులౌతారు. ఎవరైతే తన శిరసు, ముఖ, దేహం, చేతుల్లో ఉసిరిపండును ధరిస్తున్నారో వారు సాక్షాత్తు విష్ణుస్వరూపులని తెలుసుకోవాలి. ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వారు జీవన్ముక్తులే. ఉసిరిపండ్లని, తులసిదళాల్ని కలిపిన జలాలతో స్నానం చేస్తే గంగా స్నానఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితోగానీ, ఫలాలతో గానీ దేవతాపూజ చేసినవారికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేసే యజ్ఞయాగాలు, తీర్ధ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సమస్త దేవతలూ మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించి ఉంటారు.

ఏ నెలలో అయినా సరే, ఎవరైతే ద్వాదశినాడు తులసిదళాలను, కార్తీకం ముప్పై రోజుల్లో ఉసిరిక పత్రిని కోస్తున్నారో వారు నింద్యాలైన నరకాలనే పొందుతున్నారు. కార్తీకమాసంలో ఎవరైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తారో వారి ఒక సంవత్సరం దోషం తొలగిపోతుంది. ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలను, మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గానీ, సహస్రముఖుడైన శేషునికి గానీ సాధ్యం కాదు. ఈ ధాత్రీ తులసీ జనన గాధ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకుని, తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గం చేరతారు.

Karthika Puranam Shiva and Keshava, Karthika Vratam with Karthika Puranam, Sacred Tulasi in Karthika Puranam, Sacred Usiri in Karthika Puranam


More Festivals