కార్తీక మహా పురాణం ఇరవై ఐదవ రోజు

బ్రాహ్మణుడి భార్య రాక్షసిగా ఎలా మారింది?

Karthika Puranam – 25

నారదమహర్షిని ''నారదా! నువ్వు చెప్పిన తులసీ మహత్యాన్ని విని ధన్యుని అయ్యాను. అలాగే కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో విపులంగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరు ఎలా ఆచరించారో కూడా విడమర్చి చెప్పు'' అని పృథురాజు అడగ్గా నారదుడు ఇలా చెప్పసాగాడు.

ధర్మదత్తోపాఖ్యానం

 చాలాకాలం పూర్వం సహయ పర్వత ప్రాంతంలో కరవీరం అనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరీ జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.

ఒకానొక కార్తీకమాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలచి తెల్లవారుజామున లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయల్దేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి హోర దంష్ట్రలు, పెద్ద నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరి పెదాలు, మాంసరహితమైన శరీరంతో గర్జిస్తున్న ఒక దిగంబర రాక్షసి తారసపడింది.దాన్ని చూసి భీతిచెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలం చిలకడంవల్ల ఆ నీళ్ళు సోకగానే, దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానంవల్ల ''కలహ'' అనే ఆ రాక్షసి బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రణామం చేసి తన పూర్వ జన్మ గురించి విన్నవించసాగింది.

''కలహ'' చిప్పిన కథనం

''పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా! పూర్వం నేను సౌరాష్ట్ర దేశమండలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు చాలా కఠినంగా ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదాన్ని. నేనెప్పుడూ నా భర్త ఆజ్ఞలను పాటించలేదు. ఆయన హితవును ఆలకించేదాన్ని కాను. నేనలా కలహకారిణిగా అహంకరించి ఉండటంవల్ల కొన్నాళ్ళకు నాథుని మనసు విరిగి మారుమనువు చేసుకోవాలనుకున్నాడు. అతని ఆ కోరికను నేను జీర్ణం చేసుకోలేక విషం తాగి చనిపోయాను.

యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి ''చిత్రగుప్తా! ఈమె కర్మకాండలను తెలియజేయి. శుభమైనా, అశుభమైనా సరే, కర్మఫలాన్ని అనుభవించవలసిందే'' అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు ''ఓ యమధర్మరాజా! ఈమె ఒక్క మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేత భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాధపడుగాక! నిత్యమూ భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పురుగై పుట్టుగాక! వండిన వంటను తాను మాత్రమే తిన్న పాపానికిగానూ పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినుగాక! భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువల్ల అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొండుగాక! ఇది ప్రేతరూపం పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి, తర్వాత సత్కార్యములను ఆచరించుగాక'' అని తీర్మానించాడు.

అది మొదలుగా ఓ ధర్మదత్తా! నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలిదప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా, సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికోట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నువ్వు తాడించడం వల్ల ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది. కనుక కళంకరహితుడవైన భూసురుడా! ఈ ప్రేత శరీరం నుంచి, దీని తదుపరి ఎత్తవలసిన జన్మత్రయం నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు'' అని ప్రాధేయపడింది.

కలహ చెప్పింది అంతా విని కలతచెందిన విప్రుడు సుదీర్ఘ సమయం ఆలోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు.

ధర్మదత్తుడు చెప్తున్నాడు...

''ఓ కలహా! తీర్ధాలు, దానాలు, వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి. కానీ, నీ ప్రేత శరీరంవల్ల వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక మూడు జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువల్ల నేను పుట్టి ఊహ తెలిసిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నువ్వు తరించి ముక్తిని పొందు''

అలా చెప్పి, ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. మరుక్షణమే కలహ, ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణిగా, అగ్నిశిఖలా లక్ష్మీకళతో ప్రకాశించింది.

అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే, విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానంలో ఆసీనురాలుకాగా అప్సర గణాలు సేవించసాగారు. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు. ధర్మదత్తుడు. సుశీలా పుణ్యశీలులు ఇద్దరూ అతన్ని లేవదీసి సంతోషం కలిగేలా ఇలా చెప్పసాగారు.

ఓ విష్ణుభక్తా! దీనులయందు దయాబుద్ధి గలవాడవు, ధర్మవిదుడవు, విష్ణుభక్తుడవు అయిన నువ్వు అత్యంత యోగ్యుదవు౭. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడంవల్ల నీ నూరు జన్మల్లోని పాపాలు యావత్తు సర్వనాశనమై పోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలంవల్ల తొలగిపోయింది. విష్ణుజాగరణ ఫలంగా విమానం వచ్చింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యంవల్ల తేజోరూపాన్ని తులసి పూజాదుల వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్రచరిత్రుడా! మానవులకు మాధవసేవ వల్ల కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణుధ్యాన తత్పరుడైన నువ్వు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేకవేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు.

ధర్మదత్తునికి విష్ణుదూతల వరం

విష్ణుదూతలు చెప్తున్నారు

''ఓ ధర్మదత్తుడా! వైకుంఠంలో నీ పుణ్యఫలాను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకార్యార్ధ అయి భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవరేణ్యా! విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ, దానతీర్ధాలు కానీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక, నువ్వు దిగులుచెందకు'' అన్నారు విష్ణుదూతలు.

Karthika Puranam Kalaha Story, Karthika Puranam 25th Chapter, Karthika Puranam and Dharmadatta story, Sacred Purana Stories and Karthika Vratam


More Festivals