శివునికి తల్లి అయిన ఓ సామాన్యురాలు!

 

 

పార్వతీపరమేశ్వరులు ఈ జగత్తుకి ఆదిదంపతులని భక్తుల నమ్మకం. ఆ ఆదిదంపతులని నిరంతరం తలచుకుని, నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కొదవ లేదు. అలాంటి ప్రతి భక్తునిదీ ఓ దివ్య గాథే! తమిళనాట 6-8 శతాబ్దాల మధ్య నివసించిన శివభక్తులలో కొందరిని నయనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది. 63 మందిగా ఉన్న ఈ నయనార్లలో ఒకరైన `కరైక్కాల్‌ అమ్మయార్‌` అనే భక్తురాలి కథే ఇది…


కరైక్కాల్‌ అమ్మయార్‌ చిన్నపాటి పేరు పునీతవతి. పేరుకి తగినట్లుగా ఆమె శివభక్తితో పునీతురాలిగా ఉండేది. వారి కుటుంబం తమిళనాట ఉన్న కరైక్కాల్‌ అనే పట్నంలో నివసించేవారు(ప్రస్తుతం ఇది పుదుచ్చేరి ఆధీనంలో ఉంది). పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడంటే మహా ప్రీతి. నిరంతరం శివనామస్మరణ చేయడమే కాకుండా, ఇంటికి వచ్చిన శివభక్తులకు ఆతిథ్యాన్ని ఇచ్చేది పునీతవతి. యుక్తవయసు రాగానే పునీతవతిని పరమదత్తన్‌ అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. పరమదత్తన్‌ అందంలోనే కాదు… సంపదలోనూ, వ్యక్తిత్వంలోనూ గొప్పవాడే. ఒకపక్క భార్యగా పరమదత్తన్‌ బాగోగులను చూసుకుంటూనే, ఎప్పటిలా శివభక్తుల సేవను కూడా కొనసాగించింది పునీతవతి. మధ్యలో ఒక చిన్న సంఘటనే కనుక జరగకపోతే… పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది.


ఒకనాడు పరమదత్తన్‌ ఎవరో రెండు మామిడి పంఢ్లను ఇస్తే, వాటిని ఇంటికి పంపాడు. అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీవతి గుమ్మం దగ్గరకి వచ్చి నిల్చొన్నాడు. ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తికాలేదు. భక్తుని నిరీక్షింపచేసేందుకు కానీ, ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు కానీ పునీతవతికి మనసు ఒప్పలేదు. దాంతో తన చేతిలో ఉన్న రెండు మామిడిపండ్లలో ఒకదానిని అతనికి అందించింది. మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది. ఆ రాత్రి భోజనాల సమయంలో పరమదత్తన్‌ ఆ మామిడిపండును ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ రుచి అతనికి నచ్చడంతో రెండో మామిడిపండుని కూడా ఇవ్వమని అడిగాడు. ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు పునీతవతికి. వంటింట్లోకి వెళ్లి బిక్కమొగం వేసుకుని నిల్చొంది. `పరమేశ్వరా ఇప్పుడేం చేసేది!` అని మనసులో అనుకుందో  లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడిపండు ప్రత్యక్షమైంది.


తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడిపండుని సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి. అయితే దాన్ని రుచి చూసిన పరమదత్తన్‌ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. తన జీవితంలో అంత మధురమైన మామిడిపండుని తిననేలేదు. ఇందాక తిన్న మామిడిపండు ఇలాంటిది కానేకాదు. `ఇది నేను పంపిన మామిడిపండులా లేదే! ఇదెక్కడిది?` అని భార్యని అడిగాడు పరమదత్తన్‌. అబద్ధం చెప్పడం తెలియని పునీతవతి జరిగింది చెప్పేసింది. పరమదత్తన్‌కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు కానీ, ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు. అందుకని ఆమెను పరీక్షించేందుకు `నువ్వు చెప్పిందే నిజమే అయితే మరో పండుని నాకోసం తెప్పించు చూద్దాం!` అంటూ సవాలు విసిరాడు. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు పునీతవతికి. శివుని తల్చుకుని చేయిని చాచగానే మరో మామిడిపండు ప్రత్యక్షం అయ్యింది. అయితే దానిని పరమదత్తన్‌ ముట్టుకోగానే అదృశ్యం అయిపోయింది.


జరిగిన సంఘటనతో అవాక్కైపోయాడు పరమదత్తన్‌. అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదనుకున్నాడు. అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదనుకున్నాడు. అందుకని తానే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మరో పట్నానికి వెళ్లిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడ్డాడు. మరో పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలతో కాలం గడపసాగాడు. కొన్నాళ్లు నిరీక్షించిన తరువాత కానీ పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు. తన భర్త గురించి తెలిసిన వెంటనే అతన ఇంటికి చేరుకుంది పునీతవతి. పునీతవతిని చూడగానే ఆమెకు సాష్టాంగపడ్డాడు పరమదత్తన్‌. తాను చాలా సామాన్యుడిననీ, పరమభక్తురాలైన ఆమెను తగనని చెప్పి మోకరిల్లాడు. దాంతో `ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి, ఆ శివుని కోసమే జీవితాన్ని అర్పస్తాను. పరమశ్వరా! సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అందం కూడా వద్దు. నాలోని అందాన్ని తొలగించు` అని శివుని ప్రార్థించింది పునీతవతి. దాంతో ఆమెలోని ముగ్థత అంతా తొలగిపోయి, అతి సామాన్య రూపంలోకి మారిపోయింది.


ఆనాటి నుంచీ పునీతవతి శివభక్తిలో లీనమైపోయింది. పంచాక్షరిని జపిస్తూ, పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాలలోని కైలాసగిరిని చేరుకుంది. శివునికి నివాసమైన ఆ పర్వతాన్ని తన కాళ్లతో తొక్కడం ఇష్టం లేకపోయింది పునీతవతికి. అందుకని తలకిందులుగా ఆ పర్వతాన్ని ఎక్కసాగిందట. ఆ వింత దృశ్యాన్ని చూసిన పార్వతిదేవి `ఆమె ఎవర`ని అడగడంతో `నా భక్తులను కన్నతల్లిలా కాచుకున్న పునీతురాలు` అన్నాడట శివుడు. చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి `బాగున్నావామ్మా` అంటూ క్షేమసమాచారాలను అడిగాడట. అప్పటి నుంచి ఆమెకు `అమ్మయార్‌` అన్న పేరు స్థిరపడిపోయింది. శివుని అభీష్టం మేరకు అమ్మయార్‌ తన జీవితం చివరి వరకూ చెన్నైకి పశ్చిమాన ఉన్న `తిరువలంగడు` అనే ఊరిలోని శివాలయంలో నివసించారు. అమ్మయార్‌ శివుని మీద కొన్ని కీర్తనలని కూడా స్వరపరిచారు. ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త `కరైక్కాల్‌ అమ్మయార్‌` అంటారు కొందరు. కరైక్కాల్‌ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది. ఇక శివభక్తులను తల్చుకునే చోట ఆమె ప్రస్తావన ఎలాగూ ఉంటుంది!

- నిర్జర.


More Shiva