శ్రావణ శుక్రవారం కలశం ఎలా తయారు చేయాలో తెలుసా..!

సనాతన ధర్మంలో హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెలకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికమాసం పూర్తయిన తర్వాత, నిజ శ్రావణమాసంలోకి అడుగుపెట్టాం. నేడు శ్రావణమాసం తొలి శుక్రవారం. శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టి దీనిని శ్రావణమాసం అంటారు. శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే కాబట్టి దీన్ని శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా భావిస్తారు. ఈనెలలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, పూజలు, నోములు, వ్రతాలతో నెల రోజులపాటు ఆధ్మాత్మిక వాతావరణం ఉంటుంది.

ఇక హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా పిలుస్తారు. ఈ సమయంలో వరలక్ష్మీ దేవిని కలశ రూపంలో ప్రతిష్టిస్తారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొందరు తమ ఇళ్లల్లో ముత్తయిదవులను ఆహ్వానించి వ్రతం చేస్తారు. రకరకాల పిండి వంటలతోపాటు పండ్లను, పూలను వరలక్ష్మీ దేవికి సమర్ఫిస్తారు. అయితే ఈ నెలలో అన్నింటికంటే ముఖ్యమైంది లక్ష్మీదేవి పూజలు. శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. తమ కుటుంబం ఆయురాగ్యాలతో ఉండాలని..ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండకూడదని నమ్ముతుంటారు.

లక్ష్మీ అంటే ధనం మాత్రమే కాదు...ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇవన్నీ నెరవేరుస్తుంది. అందుకే శ్రావణమాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా కొలుస్తారు. ఈ మాసంలో పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. కొత్తగా పెళ్లైన వధువుతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తుంటారు. లక్ష్మీదేవిపూజలో కలశం ఎంతో ముఖ్యమైంది. కలశాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలసుకుందాం.

వరలక్ష్మీ వ్రతాన్ని చేసే మహిళలు ఇంటికి ఈశాన్య భాగంలో శుద్ధి చేసుకుని ముగ్గులు వేసి పూజకు సంబంధించిన స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ముగ్గులు వేసి దానిపై పీటను ఉంచాలి. ఆ పీటమీద తెల్లటి వస్త్రాన్ని పరిచి...దానిపై బియ్యం పోయాలి. ఇప్పుడు కలశాన్ని ప్రతిష్టించాలి. కలశం చెంబు కానీ బిందె కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు కలశానికి పసుపు, కుంకుమను అద్ది..దానిపై కొబ్బరికాయను నిలపాలి. కొబ్బరికాయకు పసుపు లేదంటే బియ్యంపిండి లేదా మైదాపిండితో అమ్మవారి ముఖాన్ని తయారు చేయాలి. కొబ్బరికాయతోపాటు కలశం మీద మామిడి ఆకులను ఉంచడం కూడా శూభసూచకమే. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను కూడా పెట్టవచ్చు. ఏనుగు ప్రతిమలు లేనట్లయితే...పసుపు ముద్దలు కానీ, పసుపుకొమ్మలను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి.  అయితే ఇవన్నీ పాటించాలన్న ఖచ్చితమైన నియమం లేదు. అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మనపై ఉంటాయి.


More Sravana Masam - Varalakshmi Vratam