కార్తీకమాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాముఖ్యత?

దీపావళి పండుగ రోజు ప్రతి ఇంటి ముందు, ఒంట్లో దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ దీపాలు వెలిగించడం అనేది కేవలం ఆ రోజుతో ముగిసిపోదు. దీపావళి తరువాత ప్రారంభమయ్యే కార్తీక మాసం పొడుగునా దీపాల కళ కొనసాగుతుంది. అయితే కార్తిక మాసంలో దీపారాధనకు అంత ప్రాధాన్యం ఎందుకుంది?? అనే ప్రశ్న చాలామందికి  తెలియదు. కొందరు పెద్దలు చెప్పారని, మరికొందరు ఇతరులు పాటిస్తున్నారని, ఇంకొందరు అదొక అలవాటుగా మారిపోయిందని దీపాలు పెట్టడం చేస్తారు. అయితే నిజంగా ఈ దీపాలు పెట్టడం వెనుక కారణమేమిటంటే….

కార్తికమాసం అనగానే చాలామందికి తెల్లవారు ఝామున స్నానాలు, ఉభయ సంధ్య వేళల్ల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలు, నదులలో, చెరువులలో దీపాలను విడిచి పెట్టడం... చక్కని సందడి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అయితే ఇలా చేయడంలో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయనెస్ మాట కాదనలేని నిజం. 

కార్తీకమాసంలో చిరుచలిలో బద్ధకాన్ని వదుల్చుకొని చేసే స్నానం, (ముఖ్యంగా నదీ స్నానం లేదా చెరువులలో, బావుల దగ్గర). స్నానం తరువాత వెలిగించే చిరుదీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఆ సౌందర్యం... ఇవన్నీ అనుభూతి చెందాల్సినవే కానీ మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. 

కార్తీకమాసంతో చలి మెల్లగా ప్రారంభామవుతుంది. అప్పటికే కురిసిన వర్షాల వల్ల చెరువు, బావులు నీటితో కళకళ లాడుతూ ఉంటాయి. ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే మన హైందవ మతంలోని ఈ  దివ్యకళా చతురతను ఖచ్చితంగా మెచ్చుకోవాలి.

కార్తిక మాసంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. దేశం మొత్తం శివోహం అనే పేరు మార్మోగుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు. కార్తీక మాసం  దీపానికీ, మాఘ మాసం స్నానానికీ, వైశాఖ మాసం దానానికి ప్రాధాన్యత ఇవ్వాలని పురాణాల ఉవాచ. 

కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం. కృత్తిక  అనేది అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం.  అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది  కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్వానికి సంకేతంగానే 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది.

కార్తికంలో దీపార్చన, దీపదానం వంటివి చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని చూసే ప్రముఖమైన కాలంలో ఈ దీపాలను దానం చేయడం, దీపారాధన చేయడం వల్ల యజ్ఞం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. 

పరమేశ్వరుని గురించి రచనలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో భర్తృహరి ఒకరు. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. 

జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి ప్రతీకగా ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ  విశ్వవ్యాపకమైన ఈశ్వర జ్యోతిని దర్శించి ఉపాసించమని ఉపదేశించే మాసమిది. అందుకే ఈమాసంలో దీపారాధనకు అంత ప్రాముఖ్యతను ఇచ్చారు.

                                      ◆నిశ్శబ్ద.


More Karthikamasa Vaibhavam