శివుడు భక్తులతో కలసి భోజనం చేసే ఆలయం గురించి తెలుసా!
శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు.. ఇలా పేర్లు ఎన్నైనా ఆయన ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని అంటారు. ప్రస్తుతం మాఘమాసం శివరాత్రి పర్వదినం వస్తున్న సందర్బంగా ప్రతి ఊర్లో శివాలయంలో శివ పూజలు ఊపందుకుంటాయి. హర హర మహదేవ శంభో శంకర అనే భక్తి పారవశ్యపు ఆలాపనలతో అన్ని ప్రాంతాలు అంటే ఇలాగుంటుందేమో అనిపించేలా ఉంటాయి. శివుడు చాలా ప్రదేశాలలో స్వయంభువు గానూ, మరికొన్ని ప్రాంతాలలో దేవతలు, మునులు, రాజులు, సామాన్యులు ఇలా.. అందరి చేతులలో ప్రతిష్టించబడి పూజలు అందుకుంటున్నాడు. అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు భక్తుల మధ్య కూర్చుని భోజనం చేయడం అనే విషయం ఎప్పుడైనా విన్నారా? శివుడు భక్తుల మద్య కూర్చుని భోజనం చేసే పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుంటే...
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైకోమ్ మహదేవ ఆలయం ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు శివుడే.. ఇక్కడ శివుడిని వైకతప్పన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శివలింగం త్రేతాయుగం నాటిది అని నమ్ముతారు. ఇక్కడ విశిష్టమైన విషయం ఒకటి ఉంది. ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు అనుమతులు ఇచ్చాకే అన్ని కులాలు, వర్గాల ప్రజలు దేవుడి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఈ వైకోమ్ ఆలయంలో మాత్రం ఈ ప్రభుత్వ అనుమతులు విధించక ముందు నుండే అందరూ గుడిలోకి వెళ్లి ఎంచక్కా ఈ శివుడిని దర్శించుకుంటున్నారు. అంటే ఇక్కడ కులం, వర్గం పేరున కుల వివక్ష అనేది లేదు. ఇకపోతే ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేక విషయం.. భోజనం.
వైకోమ్ ఆలయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన భక్తుల మధ్య కూర్చుని భోజనం చేస్తాడని ఇక్కడ భక్తులు నమ్ముతారు. పరశురాముడు ఈ ఆలయంలో శివుడిని ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. ఈ ఆలయం 11 వ శతాబ్ధానికి చెందినది. ఆలయంలో చెక్క పనులు, గోడలమీద అందమైన బొమ్మలు మొదలైనవి ఉన్నాయి. ఇవి 15-18 శతాబ్దాల మధ్య ఏర్పాటు చేశారట. పరశురాముడు ప్రతిష్టించిన ఈ పరమేశ్వరుడిని మూడు రూపాలలో కొలుస్తారు. ఉదయం దక్షిణామూర్తి రూపంలో జ్ఞానాన్ని భోధించే గురువుగానూ, మధ్యాహ్నం కిరాతమూర్తి రూపంలో వేటగాడి రూపంలో శివుడిని పూజిస్తారు. ఇక సాయంత్రం సచ్చిదానంద మూర్తి రూపంలో సత్యం, చైతన్యం, ఆనందాల స్వరూపంగా పరమేశ్వరుడిని పూజిస్తారు.
*రూపశ్రీ.
