మొగల్రాజపురం దుర్గాదేవి దేవాలయం
(Mogalrajapuram Durgadevi Temple)
విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయం జగత్ప్రసిద్ధమైంది. ఈ దేవాలయం కాకుండా, ఇక్కడ మరో కనకదుర్గాదేవి గుడి ఉంది. ఈ అమ్మవారి ఆలయం మొగల్రాజపురం కొండమీద ఉంది. కొండ పూర్తిగా ఎక్కకముందే, సుమారు 500 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయ మండపం ఎదురౌతుంది.
గుడి మండపం వద్ద ఒక సొరంగం ఉంది. అందులో కనకదుర్గాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడ ఎలాంటి హడావిడి, ఆర్భాటమూ కనిపించదు. సిసలైన భక్తులు కోరుకునే ప్రశాంత చిత్తత అనుభూతికొస్తుంది.
విజయవాడలో దుర్గమ్మ వెలసింది మొదట మొగల్రాజపురం కొండమీదేనని, అయితే, ఇక్కడికంటే ఇంద్రకీలాద్రి కొండమీద అయితే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెద్ద గుడి కట్టించారని అంటారు.
ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గాదేవి దేవాలయమంత ప్రసిద్ధం కానప్పటికీ, అక్కడ ఉండే రద్దీ ఇక్కడ లేనప్పటికీ ఈ మొగల్రాజపురం దుర్గాదేవి ఆలయం మహిమాన్వితమైంది. ఈ గుడికి వస్తామని మొక్కుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయని స్థానికులు చెప్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.