ఆంజనేయుడు త్రినేత్రుడా..రాక్షసవధతో ముక్కంటిగా మారాడా!

 

త్రినేత్రుడు అంటే మనకు ముందు పరమశివుని రూపమే ప్రత్యక్షమవుతుంది. ముక్కడి అంటే శివుడు, శివుడంటే ముక్కంటి అని మనకు తెలిసిన విషయం. కానీ హనుమంతుడు కూడా త్రినేత్రుడు అని మనలో ఎంతమందికి తెలుసు? అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? ఆంజనేయుడు త్రినేత్రుడు మాత్రమే కాదు, దశభుజుడు కూడా. సామికి రెక్కలు కూడా ఉన్నాయట. దశభుజుడి చేతుల్లో శంఖు, చక్రం, కపాలం, కొరడా ఇలా వివిధ ఆయుధాలతో ఉన్నాడు. ఇంతకీ ఆ స్వామి ఇటువంటి అవతారాన్ని ఎందువల్ల ఏ సందర్భంలో ఈ అవతారం ధరించినట్టు?

 Information How Hanuman Become Mukkanti before Rakshasa Vadha


రామరావణ యుద్ధం ముగిసిన తరువాత విభీషణుడు శ్రీరామచంద్రుడికి పుష్పకవిమానం బహుకరించగా, అందరూ ఆ పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. మార్గమధ్యంలో శ్రీరాముని ఆదేశం ప్రకారం భరద్వాజ ముని ఆశ్రమం దగ్గర ఆగి, విడిది చేశారు. ఆరోజు పంచమి తిథి. అప్పటికి రాముని అరణ్యవాసం  అయిన 14 సంవత్సరాలు పూర్తయ్యాయి.  కుశల ప్రశ్నల తరువాత శ్రీరాముడు భరద్వాజ మునితో ఇలా అన్నారు "ఓ మహాత్మా! అయోధ్యా నగరం సుభిక్షంగా ఉందా? అందరూ ఆరోగ్య సౌభాగ్యాలతో ఉన్నారా? భరతుడు రాజ్యపాలన ఎలా చేస్తున్నాడు? మా తల్లులు అందరూ క్షేమమే కదా?'' అని అడిగాడు. అందుకు భరద్వాజ ముని రాముడికి కొన్ని వరాలు అనుగ్రహించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అప్పుడు రాముడు "నేను అయోధ్యా నగరానికి వెళుతున్నాను. నేను వెళ్ళే దారిలో వృక్షాలన్నీ ఫలప్రదంగా ఉండాలి, వివిధ ఫలాలు అమృతంలా ఉండాలి'' అని కోరుకున్నాడు.

 Information How Hanuman Become Mukkanti before Rakshasa Vadha


భరద్వాజ ముని ఆతిథ్యం స్వీకరించిన తరువాత శ్రీరాముడు కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా 'నారాయణ ... నారాయణా' అనే శబ్దం వినిపించింది. నారదుడు అక్కడికి వచ్చి శ్రీరాముడికి అభివాదం చేసి "శ్రీరామా! ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి నీ దగ్గరకు వచ్చాను'' అని అన్నాడు. శ్రీరాముడు చెప్పండి నారదా అని అన్నాడు. "రామయ్యా! రావణ సంహారం జరిగినందువల్ల సంతోషమా? రావణ సంహారం జరిగినప్పటికీ, దుష్టసంహారం ఇంకా ముగియలేదు కదా? నీ వింటి అంబులపొదికి ఇంకా పని కల్పించాల్సిందే'' "వివరంగా చెప్పు నారదా'' అన్నాడు శ్రీరాముడు. "రామా! రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసిందనుకుంటున్నావ్, అందులో సగం మాత్రమే నిజం. అసురులు ఇంకా ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు. జరిగినదానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. రక్తబిందువు, రక్తాక్షుడు అనే రాక్షసులు నిన్ను గెలవడానికి సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. వారు శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే ఆ రాశాసులకు అడ్డుకోవడం చాలా కష్టం. ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోను కావాల్సి ఉంటుంది. అందుకే రామా! నీవు త్వరగా ఆ రాక్షసులను అంతం చేసే దిశగా ఆలోచించు'' అని అన్నాడు. రాముడు ఆలోచనానిమగ్నుడై ఉండగా నారదుడు మళ్ళీ మాట్లాడుతూ "అంత దీర్ఘంఘా ఏమి ఆలోచిస్తున్నావు రామా?'' అని అడిగాడు. దానికి శ్రీరాముడు "నారదా! నేను అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాను. "లక్ష్మణుడుని పంపించవచ్చు కదా?''

 Information How Hanuman Become Mukkanti before Rakshasa Vadha


"తను నా నీడవంటి వాడు మహర్షీ? నన్ను వదిలి ఉండనని శపథం చేశాడు కదా! ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా?'' అని అంటూ ఉండగా రాముని దృష్టి హనుమంతుడిపై పడింది. "ఆంజనేయా! ఇలా దగ్గరకు రా'' అని పిలిచాడు.
"స్వామీ!'' అంటూ ముకుళిత హస్తాలతో హనుమంతుడు రాముని ఎదురుగా వచ్చాడు. "నా ప్రియమైన హనుమంతా ... రాక్షస సంహారం నీ చేతుల మీదుగా కావించు'' అని ఆనతిని ఇచ్చాడు.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంఖు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు.

 Information How Hanuman Become Mukkanti before Rakshasa Vadha


అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు..


More Hanuman