‘‘శ్రీరామ దూతం శిరసానమామి’’

                                                                                           రచన: యం.వి.యస్.సుబ్రహ్మాణ్యం
 

    ‘‘సత్యం’’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్వప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘‘రామాయణ, భారత, భాగవత’’ గ్రంధాలు. ఇవి కేవలం కథలు అయితే, ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలా కాక, అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులుతీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నామంటే.. వాటిలోని ప్రతిపాత్ర సత్యబలంతో జీవం పోసుకున్నవే. ధర్మసంకల్పంతో రూపం దాల్చినవే.


    ‘‘శ్రీరామ’’ అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ‘‘హనుమంతుడు’’.  ఏడుకాండల గ్రంధమయిన ‘‘రామాయణం’’లో.. .ఎప్పుడో నాల్గవకాండ అయిన ‘‘కిష్కింధాకాండ’’లో ప్రవేశించిన ‘‘హనుమంతుని పాత్ర’’ నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. ఎందుకంటే....
శివాంశ సంభూతుడు:   

                     రామాయణం ‘‘హరి, హర తత్త్యాత్మకం
 

శ్రీరాముడు శిష్ణ్యాంశ సంభూతుడు. హనుమంతుడు శివాంశసంభూతుడు. దీనికి సంబంధించిన కథ రామాయణంలోనే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారిరువురు ఏకాంత శయ్యామందిరం చేరారు. వారికి జన్మించబోయే పుత్రునివల్లే తారకాసంహారం జరగాలి. అందుకోసమే శోభనమందిరం వెలుపల దేవతలతో కొండంత ఆశతో, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నెలలు, మాసాలు దొర్లిపోతున్నాయి. శివ పార్వతులు శోభన మందిరం నుంచి బయటకు రాలేదు. లోపల ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధస్థితి దేవలది. చూచి రమ్మని అగ్నిని, వాయువును లోపలకు పంపారు దేవతలు. అదే సమయంలో ‘శివతేజస్సు’ బహిర్గత మవుతోంది. లోపలకు ఎవరో వచ్చారన్న సందేహం పార్వతికి కలిగింది. వెంటనే శివునకు దూరంగా జరిగింది. శివుడు తన తేజస్సును భూపతనం కానివ్వకుండా బంధించి దానిని అగ్నికి, వాయువుకు చెరిసగం పంచి పంపాడు. తనకు చెందవలసిన శివతేజస్సును అగ్ని, వాయువులు తన్నుకు పోతూంటే పార్వతికి దుఃఖం ఆగలేదు. దేవతలు చేసిన కార్యభంగానికి కోపగించి ‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.


    అగ్నిదేవుడు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను భరించలేక గంగానది గర్భంలో ఉంచాడు. గంగ కూడా శివతేజస్సును భరించలేక ఒడ్డుకు నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరుముఖలతో ‘షణ్ముణుడు’ జన్మించాడు
    వాయువు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను, సంతానంకోసం తపస్సు చేస్తున్న ‘అంజనాదేవి’ గర్భంలో నిక్షిప్తంచేసాడు. అంజనాదేవి గర్భం ధరించింది. నవమాసాలు నిండాయి. అంజనాదేవికి ప్రసవవేదన మొదలైంది. ఆ రోజు వైశాఖ బహుళ దశమి తిధి: పుర్వాభాద్ర నక్షత్రం.ఆ శుభ ముహూర్తంలో శివాంశతో అంజనా గర్భసంభూతుగా ‘‘ఆంజనేయుడు’’ జన్మించాడు.


పిట్టకొంచం - కూత ఘనం


    బాల ప్రాయంలోనే ఆంజనేయుడు తన శక్తి ఏమిటో లోకానికి చాటాడు. బాల భీమని పండుగా భావించి, దానిని మ్రింగాలనే ఉద్దేశ్యంతో ఆకాశానికి ఎగిరాడు. ఆరోజు అమావాస్య, సంపూర్ణసూర్యగ్రహణం. అదే సమయానికి సూర్యగ్రహణం చెయ్యడానికి రాహువు వచ్చాడు. ‘‘ఈ సూర్యుడు నాదంటే నాది’’ అని రాహువుకు, బాలాంజనేయునికి మధ్య ఘర్షణ జరిగింది. విసుకుచెందిన ఆంజనేయుడు తన తోకతో రాహువును చుట్టి బలంగా విసిరివేసాడు. రాహువు దేవేంద్రుని ముందుపడి జరిగినది చెప్పాడు. కృద్ధుడైన దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు. వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుని దవడ ఎర్రగా వాచిపోగా, స‌్పృహతప్పి నేలమీద పడ్డాడు. హనుమ (దవడ) వాచినవాడు కనుక ఆనాటి నుంచి ‘‘హనుమంతుడు’’ అని సార్ధక నామధేయుడయ్యాడు. తన కుమారుని దురవస్థ చూసి... వాయువు దేవతలపైన అలిగి స్తంభించాడు. సృష్టిమొత్తం సంక్షోభంతో అల్లకల్లోలమైంది. బ్రహ్మదిదేవతలు వాయువును ప్రస్నం చేసుకోవడం కోసం, అందరూ హనుమంతునికి తలోక వరం ఇచ్చారు. ఏ అస్త్రము హనుమంతుని బాధించవు, బంధించవు అని దీవించారు. సహజ బల సంపన్నుడైన హనుమంతుడు ఇప్పుడు వర బలసంపన్నుడయ్యాడు. అసలే కోతి... పైగా బాల్యం... దానికితోడు వరబలం హనుమంతుని అల్లరికి అంతేలేదు. అతని చిలిపిచేష్టలకు సహనం నశించిన ఋషులు ‘‘నీవు శక్తి హనుడవు అగుగాక’’అని శపించారు. ఆ తర్వాత అంజనాదంపతుల ప్రార్ధనకు ప్రసన్నులైన ఋషులు ‘‘ెవరైనా చెబితేనే అతని శక్తి అతనికి తెలుస్తుంది’’అని శాపాన్ని కాస్త మార్పు చేసారు.

ఆదిత్యుడే ఆచార్యుడు


    హనుమంతునికి విద్యలు బోధించడానికి సాహసం చేసి ఎవరూ ముందుకు రాలేదు. హనుమంతుడు నిరుత్సాహం చెందక సూర్యుని దగ్గరకు వెళ్లి విద్యాదానం చెయ్యమని ప్రార్ధించాడు. ‘‘నాయనా.. క్షణకాలం కూడాఆగకుండా నిరాలంబపధంలో నిరంతరం సంచరించే నేను నీకేం విద్యాదానం చెయ్యగలను? నువ్వేం నేర్చుకోగలవు?’’ అన్నాడు సూర్యుడు. ‘‘గురుదేవా... మీతో సమానంగా సంచరిస్తూనే విద్యలు నేర్చుకుంటాను’’అని వినయంగా పలికాడు హనుమంతుడు. గురువు అంగీకరించాడు. శిష్యుడు అనుసరిస్తున్నాడు. విద్యాభ్యాసం మొదలైంది. అచిరకాలంలోనే సకల విద్యలు గ్రహించాడు హనుమ. ఇదీ హనుమంతుని బాల్య కథ. ఈ కథను... జాంబువంతుడు.... సాగర తీరంలో వానరులకు వినిపించాడు.

తొలికలయిక:


    రామాయణంలో హనుమంతుని పాత్ర కిష్కింధ కాండలో పరిచయం అవుతుంది. తొలి పరిచయంతోనే ా పాత్ర స్వరూప, స్వభావాలు, పటిష్టతను పరిచయం చేస్తాడు ఆదికవి’’వాల్మీకి.
    రావణాపహృత అయిన సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణఉలు ఋష్యమాకం చేరుకున్నారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయంతో పరుగులు పరుగులు తీసాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమంతుడు... సుగ్రీవునికి ధైర్యంచెప్పి... యతిరూపం ధరించి రామలక్ష్మణఉల దగ్గరకు వచ్చాడు. ‘‘అద్యూ క్షత్రియవంశ సంజాతుల్లా కనిపిస్తున్న మీరు.. అందుకు విరుద్ధంగా నారబీరలు, జటాజూతాలు ధరించడం చూస్తూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ మహర్షులాని అనుకుందామంటే... మీ చేతిలోని ధనర్పాణ, కరవాలాలు చూస్తూంటే మీరు ఋషులు కాదనిపిస్తోంది. తమరెవరు? ఏ కార్యార్గమై యిలా వచ్చారు? ఓ... నాగురించి చెప్పలేదు కదూ.. నా పేరు హనుమంతుడు. వానరసార్వ భీముడైన వాలి, తన తమ్ముడయిన సుగ్రీవుని సందేహించి, అతని భార్యను అపహరించి, రాజ్యం నుంచి తరిమికొట్టాడు. నేను ా సుగ్రీవుని మంత్రిని’’ అన్నాడు.
    విన్నరాముడు పరమానంద భరితుడై, లక్ష్మణునితో:
    ‘‘నా సృగ్వేద వినీతస్య నా యజర్వేద ధారణం:
    నా సామవేద విదుష: శక్యమేవం విభాషితుయ్’’
    లక్ష్మణా.. చతుర్వేదాలు, సమస్త శాస్త్రాలు, నవ వ్యాకరణాలు అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇంత మఈదు మధురంగా మాట్లాడగలడు.
    ‘‘అవిస్తర మసందిగ్ధం అవిలంబితమనధ్యమ్
    ఉర:స్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్’’
    చెప్పవలసిన విషయంలో సందిగ్ధం లేదు. సాగతీతలు లేవు. గొంతు చించుకోవడం, కనుబొమలు ఎగురవేయటం, తలతిప్పడం వంటి అవలక్షణాలు లేకుండా, తను చెప్పాల్సింది మృదుమధురంగా మధ్యమ స్వరంలో చెప్పాడు. ఇంతటి వాక్చాతుర్యంగల ఈ ధీమంతునితో చాలా జాగ్రత్తగా సంభాషించు’’అని లక్ష్మణుని హెచరిస్తాడు రాముడు. ఈ ఒక్కచోట తప్ప... రాముడు లక్ష్మణుని హెచ్చరించిన సందర్భం రామాయణంలో మరెక్కడా కనబడదు. మానవులు ఎలా మాట్లాడాలో మనకు ఈ సన్నివేశంలో నేర్పుతాడు ‘‘హనుమంతుడు’’

రామదూత రాజకీయం:

   అగ్నిసాక్షిగా రామ, సుగ్రీవుల మధ్య మైత్రీ బంధం కల్పించాడు హనుమ. ధర్మభ్రష్టుడైన వాలిని సంహరించి, సుగ్రీవుని కిష్కింధాధిపతి చేస్తానని శ్రీరాముడు మాటిచ్చాడు. వాలి సంహారం జరిగింది. సకల వానర సంఘాలూ, వారి సేనాధిపతులు నల, నీల, గజ, గవయ, గవాక్ష, మైంద, ద్వివిదాది మహావీరులందరూ భయభ్రాంత హృదయులై నిలబడి పోయారు. వాలి మృతదేహం మీద పడి, తార విలవిల విలపిస్తూంటే, ఆమెను ఓదార్చేధైర్యం ఎవ్వరికీ చాలలేదు.


    అప్పుడు హనుమంతుడు తారను సమీపించి ‘‘మహారాణీ.. ఇంతకాలం ీ సర్వ వానరకోటిని మీ కనుసన్నలలో నడిపించి, కిష్కింధను పాలించిన మీరు... వీర మరణం పొందిన భర్త గురించి ఇలా శోకించడం తగదు. ఇప్పుడు ఈ సమస్త వానరప్రజ మీ ఆదేశంకోసం ఎదురు చూస్తున్నారు. కనుక, శోకాన్ని ఆపి, నీ బిడ్డ అంగదుని ఈ కిష్కింధకు సామ్రాట్టుగా అభిషిక్తుని చెయ్యి’’ అన్నాడు.
    శ్రీరాముడు వాలిని సంహరించినది సుగ్రీవుని కిష్కింధాధి పతిగా అభిషిక్తుని చెయ్యడానికి గానీ, అంగదుని కాదు. ఈసంగతి హనుమంతునకు తెలియక కాదు అలా అన్నది.. ఎందుకలా అన్నాడంటే....
    వాలిమరణంతో సర్వవానరకోటి సుగ్రీవుని పట్ల ద్వేషంతో, పగతో ఉంటారు. నిజానికి కిష్కింధకు ఏలిక వాలి అయినా, తెరవెనుక నుంచి కిష్కింధను పాలించిన పట్టమహిషి తార. భర్త మరణం ఆమెలో ప్రతీకార జ్వాల రగిల్చితే వానరులంతా సుగ్రీవునకు ప్రతిపక్షం అవుతారు. అప్పుడు సుగ్రీవుడు కిష్కిందాధిపతి కావడం కల్ల... వానరులంతా సహకరిస్తేనే సుగ్రీవుడు సీతాన్వేషణ చేయగలడు. తార కోపాన్ని శాంతింపచేసి, సుగ్రీవుని పక్షానికి వచ్చేలా చెయ్యాలంటే... ముందు తార, సుగ్రీవుని కిష్కింధాధిపతిగా అంగీకరించాలి. తను అన్న మాటకు తార నుంచి ఏ సమాధానం వస్తుందో హనుమకు తెలుసు. అలాంటి సమాధానమే వచ్చింది.
    ‘‘హనుమా.. సుగ్రీవుడే సర్వవానరకోటికి ప్రభువు. అతనికే పట్టాభిషేకం జరగాలి’’ అంది తార. ఆమెచేత అలా పలికించగల ధీమంతుడు హనుమంతుడు. అదీ ఆయన రాజకీయనిఫుణత.

తిరుగులేని రామ ‘‘దూత’’


    వానర వీరులంతా నీతాన్వేషణకు బయలు దేరారు.
    దక్షిణ సాగరతీరానికి చేరారు అంగద, జాంబువంత, హనుమదాదులు. అనితర సాధ్యమైన శతయోజన విస్తీర్ణమయిన సాగరాన్ని లంఘించాడు. ఈ సాగర తరణంలో...
మైనాకుని మన్ననలందాడు
సురసను యుక్తితో జయించాడు
సింహకను సంహరించాడు
లంకిణిని ఓడించి, శత్రుదుర్వేధ్యమయిన లంకలో ఒంటరిగా సీతాన్వేషణ సాగించాడు. ఈ కార్యంలో ఎందరో దేవ, గంధర్వ కన్నర, గంధర్వాది సుందరాంగనలు నగ్నంగా, అర్థనగ్రంగా హనుమంతునికి దర్శనమిచ్చారు. హనుమ హృదయం చివుక్కుమంది. ‘‘పరస్త్రీని చూడడమే పానం... పైగా ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం’’ అనుకుని
‘‘నహిమే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ
అయం చాత్ర మయాదృష్ట: పరదార పరిగ్రహ:’’
‘‘సీతాదేవి కనిపిస్తుందేమో నని చూసానేగానీ, నా మనస్సు కామవశీభూతం కానప్పుడు నేనెందుకు బాధపడాలి. సర్వ పాపపుణ్యాలకు ప్రధానమైన మనస్సు, నిర్మలంగా, నిశ్చలంగా ఉన్పప్పుడు నేను బాధపడక్కర లేదు’’ అనుకున్నాడు.. అది హనుమ స్త్రీ భక్తి. ాత్మపరిశీలన.
అశోక వనంలో సీతాదేవిని చూసాడు. ఆమెకు రామాంగుళి ఇచ్చి ధైర్యం చెబుతూ... ‘‘అమ్మా.. నా భుజాన్ని ఎక్కు. క్షణకాలంలో నిన్ను రామసన్నిధికి చేరుస్తాను’’ అంటాడు. అప్పుడు సీతాదేవి.. ‘‘అలా చేయడం నా రామునకు గౌరవంకాదు. అయినా, ఇంత చిన్న ాకారంగల నీవు, నన్నెలా రాముని దగ్గరకు చేర్చగలవు’’ అంది. అప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించి, ధైర్యం చెబుతూ...
‘‘మద్విశిష్టాశ్చ తుల్చాశ్చ సన్తి తత్ర వనౌకస:
మత్త: ప్రత్యవరం: కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిదే’’
‘‘అమ్మా.. సుగ్రీవుని సన్నిధానంలో నన్ను వానరవీరులందరిలోను అతి సామాన్యుడను నేనే. దూతల సామాన్యులనే తప్ప మహమహులను పంపరు కదా’’ అన్నాడు. అదీ హనుమంతునివినయం, నమ్రత.
ఒంటిచేత్తో అశోకవన ధ్వంసం చేసిన హనుమ.. సామాన్యుడా?
శత్రుసభలో నిర్భయంగా రావణునకు హితబోధ చేసిన హనుమ... సామాన్యుడా?
సుందర లంకానగరాన్ని క్షణకాలంలో అగ్నికి ఆహుతి చేసిన హనుమ... సామాన్యుడా?
‘‘సీతాదేవిని చూసాను’’ అని చెప్పి... ఇటు వానరుల ప్రాణాలు, అటు శ్రీరాముని ప్రాణాలు కాపాడిన హనుమ...  సామాన్యుడా?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మస్త్ర ప్రయోగానికి రామలక్ష్మణులతో సహా సర్వవానరులూ మూర్చపోతే, సంజీవినీ పర్వతాన్ని తెచ్చి అందరికీ ప్రాణదానం చేసిన హనుమ... సామాన్యుడా?
అసలు హనుమలేని రామకథను మనం ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఆనందించగలమా?
హనుమలేనిదే రాముడు లేడు. ఎందుకంటే...
రాముడు విష్ణ్వాంశ సంభూతుడు.
హనుమ ఈశ్వరాంశ సంభూతుడు.
శివకేశమవిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండరు.
‘‘శఇవాయా విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయంశివ:’’
అందుకే రామనాయం ఎక్కడుంటే హనుమ అక్కడుంటాడు
శివుడు.. అభిషేక ప్రియుడైన, బోళా శంకరుడు
హనుమ... రామనామాభిషేక ప్రియుడైన, బోళావానజుడు
సామాన్యులమైన మనం,
మహావీరునకు ఏమివ్వగలం? జన్మదిన కానుకగా, భక్తిగా ఒక్క ‘‘రామనామాన్ని’’ ఇవ్వడంతప్ప... ఇంకేం చెయ్యగలం?
యత్ర యత్ర రఘునాధ కీర్తనమే
తత్ర తత్ర కృత మస్త కాంజవియ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్ష సాంతకమ్


- స్వస్తి-

 


More Hanuman