వేదవ్యాస వర్దితం.. వందే గురు పూజితం!

ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర చాలా  గొప్పది. తల్లిదండ్రులు జన్మనిస్తే.. జ్ఞానాన్ని ప్రసాదించి గురువు  పునర్జన్మను ప్రసాదిస్తాడు. తమకు జ్ఞానాన్ని ప్రసాదించే ప్రతీ గురువుకూ నమస్కరించడం శిష్యుల కర్తవ్యం. అది గురువుకు ఇచ్చే గౌరవం అవుతుంది. ఆదిగురువుగా వేదవ్యాసుల వారిని పూజిస్తారు. ఆషాడ పూర్ణిమరోజు పుట్టినందువల్ల వ్యాస జయంతికి వ్యాసపూర్ణిమ అనే పేరు కూడా వచ్చింది. ఈ రోజు గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజిస్తారు. వారి నుండి ఆశీర్వాదం తీసుకుంటారు.

వ్యాసం వసిష్ట నస్తారం శక్తేః పాత్రమకల్మషం !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదిం!!

వసిష్టమహామునికి  మునిమనవడు,  శక్తి మహామునికి మనువడు, పరాశరమునికి కుమారుడు, శుకమహర్షికి తండ్రి, నిర్మలుడైనవాడు, తపవు అనే ధనరాశిని కలిగిన శ్రీ వ్యాసుల వారికి నమస్కారం అని ఈ శ్లోకం అర్థం. గురుపూర్ణిమనాడు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని పఠించడం ఎంతో ఫుణ్యఫలం.  వేదవ్యాసుల వారిని సాక్షాత్తూ ఆ నారాయణుడి స్వరూపంగా  భావిస్తారు. ఈ కారణం వల్లనే ఆయనను అపర నారాయణుడు అని పిలుస్తారు. వేదాలను విభజించినవారు వ్యాసులే.. అందుకే ఈయనను వేదవ్యాసుడు అని పిలుస్తారు.  ఈయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు కూడా ఏర్పడ్డాయి. అంతేనా.. భాగవతాన్ని, భారతాన్ని అందించినవారు కూడా వ్యాసులవారే..

గురుపౌర్ణమి లేదా.. గురు పూర్ణిమ నాడు అందరూ చేయవలసిన పని ఏమిటంటే..

గురుపూర్ణిమరోజు ప్రతి ఒక్కరూ వ్యాసుల వారు రచించిన ఏదో ఒక గ్రంథం చదవాలి. దీనివల్ల ఆయన కృప లభిస్తుంది. గురుపీఠానికి ఆద్యులైనేవారు కొందరున్నారు. వారిలో త్రిమూర్తులైన నారాయణుడు, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, వ్యాసుడి తాత గారు, తండ్రులైన వసిష్ట ముని, శక్తిముని, పరాశర ముని. ఆషాడ పూర్ణిమ రోజు ప్రత్యేకంగా స్మరించుకునే వ్యాస భగవానుడు. శుకమహాముని, గౌడపాదులవారు, గోవింద భగవత్పాదులవారు, శంకరాచార్యులు, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయ స్వామి మొదలైనవారిని పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు.. ఈరోజున ప్రతి ఒక్కరూ తమకు వర్తమానకాలంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న, తమకు దారిచూపుతున్న గురువులను భక్తిశ్రద్దలతో పూజించాలి. అజ్ఞానాన్ని పారద్రోలేవాడు గురువు కాబట్టి ఆ జ్ఞాన ప్రధాతకు శిష్యుడు ఎంత తిరిగి ఇచ్చినా అది తీరని ఋణమే అవుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

                                                                *నిశ్శబ్ద.


More Guru Purnima