శ్రీశైల భ్రమరాంబిక నవరాత్రులు 2వ రోజు 

   ఈ లోకాలన్నీ ఏలే భగవంతుడు చిత్రాతి చిత్రమైనవాడు.  మొట్టమొదట ఆవిర్భవించింది ఆయనేగనుక ఈ లోకాలన్నింటిమీదా అన్ని హక్కులూ ఆయనవే.  అందుకే ఆయన తన చిత్ర విచిత్రమైన లీలా వినోదాలలో తననుంచి అనేక రూపాలను ఆవర్భవింప చెయ్యటమేగాక, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కార్యక్రమంలో భాగంగా, ప్రాణులను ధర్మ మార్గాన నడిపించటానికి భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాలలో అర్చామూర్తిగా స్వయంగా ఆవిర్భవించాడు.  అంతేకాదు, భక్తులకు తన ఉనికిని తెలిపిన అనేక ప్రదేశాలలో, భక్తుల కోరికమీద వెలిసి  పూజలందుకుంటున్నాడు.  పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించిన శక్తి కూడా తన లీలా వినోదాలతో జగాలను ధర్మ మార్గాన నడపటానికి తాపత్రయపడింది.

అలాంటి లీలా వినోదాలలో ఒకటే దక్షయజ్ఞం.  దక్షుడు తను తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవక పోవటం, పుట్టింటి మీద ఆశతో కన్నవారింటికి వెళ్ళిన సతీదేవి తన భర్తకి జరిగిన అవమానాన్ని తన అవమానంగా భావించి యోగాగ్నిలో తపించటం, అది తెలిసిన శివుడు సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞ నాశనం కొరకు వీరభద్రుణ్ణి సృష్టించి, సతీదేవి శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిభ్రమించటం, లోక రక్షణకోసం శివుణ్ణి యధాస్ధితికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించటం, ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడటం అందరికీ తెలిసిన కధే.  ఇది పురాణ కధే అయినా, ఈ కధలోనుంచి మానవులు నేర్చుకోవలసినది ఎంతో వున్నది.  పుట్టింటి బంధాలు, సతీ పతుల ప్రేమ, గౌరవం, ఆ ప్రేమ కోసం, ఆ గౌరవాన్ని కాపాడటానికి వారు ఎంత దూరం వెళ్తారు, పరస్పర సహకారంతో  ఒకరినొకరు కాపాడుకోవటం, అవతారం చాలించినా ప్రజలను ధర్మ మార్గాన నడిపించటానికి దైవాలు అవతరిస్తే, వారు పాటించిన, చూపించిన ధర్మ మార్గాన నడవటం ఈ కధలు చదివి మనం తెలుసుకోవలసిన విషయాలు.

సరే, మళ్ళీ విషయానికొస్తే సతీదేవి శరీరభాగాలు పడిన 101 ప్రదేశాలను శక్తి పీఠాలుగా గుర్తించి, భక్తులు అమ్మవారి ఆరాధనలో తరిస్తున్నారు.  అందులో 51 ముఖ్యమైనవిగా కొందరంటే, మళ్ళీ అందులోంచి 18 ప్రదేశాలను అతి ముఖ్యమైనవాటిగా భావించి, అష్టాదశ శక్తి పీఠాలుగా, పరమ పవిత్రమైన ప్రదేశాలుగా సేవిస్తున్నారు.  ఇందులో రెండు శక్తి పీఠాలు మాత్రం మన దేశంలో లేవు.  ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీరులో, రెండవది శ్రీలంకలో వున్నాయి.

మిగతా 16 శక్తి పీఠాలలో నాలుగు మన తెలుగునాట వుండటం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం.  ఇంకొక విశేషం.  ఈ శక్తి పీఠాలులాగానే పరమశివుడు స్వయంగా వెలిసిన జ్యోతిర్లింగ క్షేత్రాలు 12.  వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలంటారు.  జ్యోతిర్లింగమూ,  అష్టాదశ శక్తి పీఠాలలోని  శక్తి పీఠము ఒకే ప్రదేశంలో వుంటే ఆ క్షేత్రం ఎంత శక్తివంతమయివుంటుందో ఆలోచించండి.  అలాంటి క్షేత్రాలు రెండే వున్నాయి.  ఒకటి కాశీలోని విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఆలయాలు.   అయితే ఈ ఆలయాలు ఒకే ఊరిలో వున్నా, వేరు వేరు ప్రదేశాలలో వున్నాయి.  కానీ, మన తెలుగువారు చేసుకున్న పుణ్యమెంతటిదోగానీ, జ్యోతిర్లింగ స్వరూపుడయిన మల్లికార్జునుడు, శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబిక ఒకే ప్రాకారంలో ముందు వెనుకగా వున్న ఆలయాలలో భక్తుల మొరలాలకిస్తున్న ప్రదేశం శ్రీ శైలం ఇక్కడ వెలిసింది.

తెలుగునాట నాలుగు శక్తి పీఠాలున్నాయని చెప్పానుకదా.  ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఈ నాలుగు శక్తి పీఠాలగురించి తెలుసుకుందాము.  ముందుగా జ్యోతిర్లింగము, శక్తి పీఠము ఒకేచోట  వెలసిన శ్రీశైలం గురించి…
శ్రీ భ్రమరాంబికా దేవి, శ్రీశైలం
శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే.. అంటారు.
దక్షిణాపధంలో ప్రసిధ్ధికెక్కిన ప్రాచీన శైవ క్షేత్రాలలో  ప్రముఖమైన శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో వున్నది .  అత్యంత పురాతనము, సుప్రసిధ్ధము అయిన శ్రీశైల క్షేత్రానికున్న మరో విశిష్టత ద్వాదశ జ్యోతర్లింగాలలో రెండవది అయిన శ్రీ మల్లికార్జునుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది అయిన శ్రీ భ్రమరాంబిక ఇక్కడ ఒకే ప్రాకారంలో వేర్వేరు ఆలయాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  ఇలా ఇక్కడ ఒక్క చోట మాత్రమే వున్నది.

పద్మ పురాణం, మత్స్యపురాణం, స్కాంద పురాణం, దేవీ భాగవతం వగైరా అనేక పురాణాలలో ప్రస్తుతించబడిన ఈ క్షేత్రం భూమండలానికి నాభిస్ధానం అని స్ధల పురాణం చెబుతోంది.  ప్రతి పూజ, వ్రతం ముందు మనం చెప్పుకునే సంకల్పంలో మనమున్న స్ధలం శ్రీశైలానికి ఏ దిశగా వున్నదో చెప్పుకోవటం ఈ క్షేత్రం యొక్క ప్రాచీనత్వానికి నిదర్శనం. ఇక్కడి శక్తి పీఠాల గురించి చెప్పుకుంటున్నాంగనుక శ్రీ భ్రమరాంబికాదేవి గురించి తెలుసుకుందాము.  సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశం ఇది.  పురాణ కధనం ..  పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు దేవతలనందరినీ జయించి తన అదుపులో వుంచుకోవాలనే కోరికతో చాలా కాలం పాటు గాయత్రీ మంత్రం జపిస్తూ తపస్సు చేశాడు.  ఆ తపశ్శక్తివల్ల అతని శరీరంనుంచి అగ్ని జ్వాలలు లేచి లోకాలన్నిట్లో వ్యాపించసాగాయి.  దేవతలందరి ప్రార్ధనపై బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయి  ద్విపాదులు,  చతుష్పాదులచే మరణం లేకుండా వరం ఇస్తాడు. వరం ప్రభావంతో విజృంభించిన అరుణాసురుడి ఆగడాలకు భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు.

అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానితో అరుణాసురుడి శక్తి క్షీణించసాగింది.   ఆ సమయంలో ఆదిశక్తి సృష్టించిన అసంఖ్యాక భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరించాయి.  తర్వాత దేవతల కోరికపై భ్రమరాంబికగా శ్రీశైల క్షేత్రంలో వెలసింది.  సంతోషంతో దేవతలందరూ ఆమెను భ్రామరీ అంటూ స్తుతించారు.

ఈ దేవి ఆవిర్భావం గురించి ఒక జానపద గాధకూడా ప్రచారంలో వున్నది.  పూర్వం మహీశురుడు అనే కన్నడ దేశ రాజుకి ఒక కూతురు వున్నది.  ఆవిడ శివ భక్తురాలేకాక శివుణ్ణి భర్తగా ఆరాధించేది.  ఒకసారి శివుడు ఆ రాజకుమార్తె కలలో కనబడి భ్రమరం ఎక్కడ మల్లెపొదమీద వాలుతుంతో అక్కడికి తానొస్తానని చెబుతాడు.  మర్నాడు రాజకుమారి భ్రమరం వాలిన మల్లె పొదను కనుగొని అక్కడ శివుడికోసం తపస్సుచేయనారంభించింది.   ఆమె తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను పరీక్షించదలచి వృధ్ధ జంగమదొర వేషంలో వచ్చి తనే శివుణ్ణని చెప్తాడు.  రాకుమార్తె తపస్సు చేసుకునే సమయంలో ఆవిడని కాపాడిన అక్కడి చెంచులు వృధ్ధుణ్ణి వివాహం చేసుకోవద్దని వారిస్తారు.  అయినా శివుడు ఏ రూపంలో వున్నా ఆయనని వివాహం చేసుకోవటానికి సిధ్ధపడుతుంది రాకుమారి.  మల్లెపొదపై భ్రమరం వాలినచోట శివుడికోసం తపస్సుచేసి, శివుణ్ణి భర్తగా పొందిన  రాకుమార్తె శ్రీ భ్రమరాంబా దేవిగా అక్కడ వెలిసిందంటారు.  తపస్సు చేసిన ప్రదేశం శ్రీశైలంగా చెప్పబడింది.  తపస్సు చేస్తున్న సమయంలో సేవలు చేసిన చెంచువారు శ్రీ భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు.  అంతేకాదు, స్వామిని తమ అల్లుడిగా భావించి మర్యాదలు చెయ్యటమేగాక ఆయనని చెంచు మల్లయ్య అని పిలుస్తారు.

శ్రీశైలంలో స్వామి ఆలయం వెనుక వున్న  శ్రీ భ్రమరాంబాదేవి ఆలయ మండపంలో అద్భుత శిల్ప కళతో అలరారే స్తంభాలున్నాయి.  పూర్వం ఈ ఆలయంలో వామాచార పధ్ధతి వుండేది.  విశేషంగా  జంతుబలి  జరిగేది.  ఆది శంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ ఆచారాన్ని మాన్పించి సాత్విక పూజా విధానాన్ని ప్రవేశ పెట్టారని, అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు తగిన ప్రక్రియ చేసి, అమ్మవారి ఎదురుగా శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని ప్రతీతి.  భక్తులు ఈ శ్రీ చక్రానికి కుంకుమ పూజ చేసుకోవచ్చు.  చక్కగా చేయిస్తారు.

శరన్నవరాత్రులని ముందు అమ్మ గురించి చెప్పుకున్నా, గుడిలోకి ప్రవేశించగానే, ముందుగా అయ్యేది అయ్య, మల్లికార్జునస్వామి దర్శనమే.  ఉపాలయాలలో శ్రీరాముడు ప్రతిష్టించిన సహస్ర లింగేశ్వరస్వామి, వృధ్ధ మల్లికార్జునస్వామి, రాజేశ్వరి, రాజేశ్వరుడు, సీతాదేవి ప్రతిష్టించిన సహస్రలింగేశ్వరస్వామి, ఇంకా పాండవులు ప్రతిష్టించిన శివ లింగాలు, వగైరా అనేక దేవతా మూర్తుల దర్శనం చేసుకోవచ్చు.

అంతేకాదు, ఈ చుట్టు పక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం వున్నాయి.  సాక్షి గణపతి, శిఖరం, పాల ధార, పంచధార, హటకేశ్వరం, శ్రీ పూర్ణానందస్వామి ఆశ్రమం, అందులో కామేశ్వరీ ఆలయం, ఇష్ట కామేశ్వరి వగైరాలు. ఈ సుప్రసిధ్ధ శైవ క్షేత్రానికి అన్ని చోట్ల నుంచి బస్సు సౌకర్యం వున్నది.  వసతి, భోజనం, వగైరా అన్ని సదుపాయాలు వున్నాయి.

 

 

 

---- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu