కార్తీక మాసంలో భస్మం(విభూతి) ధరిస్తే కలిగే ప్రయోజనాలు!!

 

భస్మ- 1, స్వల్పభస్మ, 2 మహాభస్మ అవి రెండు రకాలుగా ఉంటుంది. ఈ రెండు రకాలవల్లనే శ్రోత స్మార్త- లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నమయ్యాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మంత్రపూర్వకంగానూ, యితరులు శివ స్మరణంతోను విభూతి ధరించాలి. త్రిపుండ్రాలుగా (మూడు అడ్డు వరుసలు) ధరించబడే విభూతికి కాల్చబడిన ఆవు పేడ ద్రవ్యం. 

బ్రాహ్మణులు, క్షత్రియులూ మానస్తోకే మంత్రంతోను, వైశ్యులు త్రయంబక మంత్రంతోనూ, శూద్రులు గాని, వితంతు స్త్రీలుగాని అయినట్లయితే పంచాక్షరీ మంత్రంతోమా భస్మ ధారణ చేయాలి.  బ్రహ్మచారి త్య్రంబక మంత్రంతోనూ, గృహస్థులు పంచబ్రహ్మ మంత్రంతోనూ, వానప్రస్థుడు అఘోర మంత్రంతోనూ, సన్యాసి ప్రణవస్మరణ తోనూ విభూతి ధరించాలి. అత్యాశ్రమి- సత్యశాంభవ దీక్షితుడైనవాడు- ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మాన్ని ధరించాలి. ప్రతిరోజు శివాగ్ని కార్యం చేసి, త్రియాయుషం అనే మంత్రంతో భస్మం ధరించేవాడు సర్వపాప విముక్తుడౌతాడు. భస్మస్నానం చేయకుండా షడక్షరీ మంత్రాన్ని జపించకూడదు.

భస్మధారణ గావించకుండా చేసే జపాలు మరియు తపస్సు నిష్పలాలుగా చెప్పబడుతున్నాయి. శిరస్సు, నోసలు, చెవులు, కన్నులు, ముక్కు, నోరు, మెడ, రెండు చేతులు, మోచేతులు, మణికట్టులు, హృదయం, రెండు ప్రక్కలు, బొడ్డు, నడుము, తొడలు, చీలమండలు, మోకాళ్ళు, పిక్కలు, పాదములు అనే ముప్పయి రెండు స్థానాలలోనూ భస్మమును ధరించాలి. అంత అవకాశం లేనివారు శిరస్సు, లలాటం, చెంపలు, కంఠము, భుజములు, మోచేతులు, మణికట్టు, హృదయము, నాభిపార్శ్వద్వయము, వెన్ను- అనే పదహారుచోట్లనైనా భస్మధారణ చేయాలి. అది కూడా  వీలుపడనివారు తల, బాహుద్వయం, హృదయం, నాభి - అనే అయిదు చోట్ల అయినా భస్మమును ధరించాలి. దేశకాలమాన పరిస్థితులను బట్టి భస్మమును ధరించవచ్చు. ఉర్దూళవం కుదరనప్పుడు త్రిపుంధ్రాలనైనా ధరించాలి. భస్మధారణ విధి విధానాలు యేమాత్రమూ తెలియనివారు "ఓం నమః శవాయ" అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి.

స్త్రీహత్యా, గోహత్య, వీరహత్య, అశ్వహత్య,  పరస్త్రీలతో సంబంధాలు, ఇతరులను అకారణంగా నిందించడం,  అకారణహింస పంటలను దొంగిలించడం, తోటలు పాడుచేయడం, కొంపలు తగలబెట్టడం, గోమహిషతిలా శాంబర (దుప్పటి, వస్త్ర, అన్న, ధాన్య, ఇల(భూమి, నేల), సువర్ణ(బంగారం)లను నీచుల నుంచి దానం తీసుకోవడం, చేతులు పట్టే స్త్రీనిగాని లేదా వాళ్ళకి సంబంధించిన స్త్రీనిగాని, వేశ్యలనుగాని, చండాల స్త్రీనిగాని, శూద్రస్త్రీనిగా లేదా నాట్యకత్తెలనగాని, బహిష్టయివున్న భామలనుగాని అవివాహితలనుగాని విధవలనుగాని, సంగమించడం. మాంసం- తోలు, ఉప్పు, రసద్రవ్యాలు, అనే వాటిని అమ్మడం, చాడీలు చెప్పడం కపటంగా ప్రసంగించడం, కూటసాక్ష్యం, అసత్యం అనే అన్ని రకాల పాపాలూ కూడా అవి పూర్వజన్మనైనా యీ జన్మలోనైనాసరే, తెలిసి చేసినా తెలియక చేసినాసరే కేవలం నిరంతరం భస్మ త్రిపుండ్రధారణ మాత్రాన నశించిపోతాయి. అంటే తప్పులు చేసినా అవన్నీ తొలగిపోతాయని అర్థం కాదు, ఆ పరమేశ్వరుడు మనిషిలో మార్పును చేకూర్చే మార్గాన్ని చూపిస్తాడని అర్థం. 

నియమంగామా, భక్తియుక్తులతోనూ భస్మధారణ చేసేవాళ్లను దేవతలంతా గౌరవిస్తారు.  శివోపాసన కూడా చేసినట్లయితే ఆ ఫలితం చెప్పనలవికాదు. తానొక్కడేకాదు, అతను తిరిగే ప్రాంతాలు, అతని ఆవరణం అంతా ఎంతో పవిత్రమైనదిగా మారుతుంది. ఎవరైతే, బిల్వ, భస్మ, రుద్రాక్షయుతంగా శివుడిని ఆరాధిస్తారో వారి పుణ్యం అంతా ఇంతా అని చెప్పటానికి అలవికాదు.

కనీసం భస్మరుద్రాక్షలన్నా ధరించి శివారాధన చేయాలి. అవి లేకుండా చేసే శివార్చన మొత్తం నిష్ఫలమైపోతుందని చెప్పబడుతోంది. కాని శివారాధన చేసినా చేయకపోయినా భస్మరుద్రాక్ష ధారణ మాత్రం సర్వశ్రేయస్కరం అని చెప్పబడింది. ఆరాధన చేయలేనివారు విభూతి, రుద్రాక్షలూ ధరించి శివ నామాన్ని స్మరించినా చాలు "నమః శివాయ" అనే పంచాక్షరిని గాని "ఓం నమః శివాయ" అనే షడక్షరిని గాని జపించాలి. కనీసం "శివశివ" అనైనా అనుకుంటూ వుండాలి. అయితే "శివశివ" అనుకోవడంకన్న "శ్రీశివాయనమః" అనుకోవడం శ్రేయస్కరమని పెద్దలహితవు,

◆ వెంకటేష్ పువ్వాడ


More Karthikamasa Vaibhavam