బ్రతుకు సంబరం బతుకమ్మ

 

బతుకమ్మ వచ్చింది ఉయ్యాలో….
సందడి తెచ్చింది ఉయ్యాలో….

తెలంగాణ ప్రాంతపు సంప్రదాయ పండుగ, కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే ఎంతో గర్వంగా జరుగపుకునే పండుగ మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధం బలపడేందుకు దోహాధం చేసే పండుగ. ఆశ్వయుజ మాసం మహాలయ అమావాస్య నుండి తొమ్మిదిరోజుల పాటు తుళ్ళిపడే పండుగ బతుకమ్మ పండుగ. పండుగ తొమ్మిది రోజులు ప్రతి వీధి, ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఎంతో సందడిగా మారిపోతుంది. ఎంతో బిజీ లైఫ్ లలో మునిగి ఉండే ఆడపిల్లలు బతుకమ్మ కోసం తయారైపోతారు.

ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగగా మారి తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ నవ్వులతో కలసి నవ్వుతూ, అడుగుతో అడుగు కలుపుతూ, పాటతో పరవశిస్తూ తొమ్మిదిరోజులు సందడి చేస్తుంది.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ - ఈ బతుకమ్మ. ఈ బతుకమ్మకు నువ్వులు, బియ్యం పిండి, నూకలు అన్ని కలిపి నైవేద్యంగా పెడతారు.

రెండవ రోజు అటుకుల బతుకమ్మ - చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా పెడతారు. 

ముద్దపప్పు బతుకమ్మ - మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లం లను నైవేద్యంగా పెడతారు.

నానే బియ్యం బతుకమ్మ - నాలుగవరోజున జరిగే ఈ వేడుకలో బతుకమ్మకు నానా బెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం పెడతారు.

అట్ల బతుకమ్మ - అయిదవ రోజున అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. అట్లు లేదా దోశలు నైవేద్యంగా పెడతారని అందరూ అంటారు కానీ. అట్టుకు దోశ కు ఎంతో తేడా ఉంటుంది కాబట్టి. అట్లనే నైవేద్యంగా పెట్టాలి.

అలిగిన బతుకమ్మ - ఆరవరోజు వచ్చేది అలిగిన బతుకమ్మ. ఆరోజు బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం పెట్టరు, ఏవిధమైన కోలాహలం ఉండదు. 

వేపకాయల బతుకమ్మ -  ఏడవ రోజు పండుగ వేపకాయల బతుకమ్మ పండుగ. బియ్యం పిండిని బాగా వేయించి పచ్చిదనం పోయాక ఆ బియ్యం పిండిని వేపకాయలంత గోళిలుగా, వేపకాయల ఆకారంలో తయారుచేస్తారు. వీటినే బతుకమ్మకు నైవేద్యం పెడతారు.

వెన్నముద్దల బతుకమ్మ - ఎనిమిదవ రోజు పండుగ ఇది. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం అన్ని కలిపి చలిమిడి లాంటి పదార్థాన్ని తయారుచేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదం రుచి ఎంతో మధురంగా ఉంటుంది.

సద్దుల బతుకమ్మ - చివరి రోజు పండుగ ఇది. మొదటి ఎనిమిది రోజుల పండుగ చేయకపోయినా ఈ చివరి రోజు మాత్రం తప్పకుండా జరుపుకుని తీరతారు. ఈరోజే దుర్గాష్టమి కూడా జరుపుకుంటారు.  పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ఇలా అయిదు రకాలు నైవేద్యంగా పెడతారు. 

ఇలా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ, ప్రతి పిల్లవాడు, ప్రతి ఇంటి మనిషి అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. మనం కూడా బతుకమ్మ వచ్చింది ఉయ్యాలో..... అని సంబరంగా పాడుకుందాం.

◆ వెంకటేష్ పువ్వాడ


More Bathukamma