• Prev
  • Next
  • సిల్లీ ఫెలో - 84

    Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

     

    సిల్లీఫెలో - 84

    - మల్లిక్

     

    మినిస్టర్ మిన్నారావ్ ఎల్లయ్య దగ్గర శలవు తీసుకుని వెళ్ళడానికి హడావుడిగా సిద్దపడే సమయంలో అతని చుట్టూ ఆటోగ్రాఫ్స్ తీస్కోవడానికి జనం మూగారు.

    "నినిట్టా ఆటోగ్రాఫ్ లు ఇస్తా కూకుంటే పెబుత్వం ఆగిపోద్ది. అయినా మీ అభిమానాన్ని కూడా కాదన్లేనుకదా!" ఇకిలిస్తూ అని అందరికీ ఆటోగ్రాఫ్ లు కార్యక్రమం అయిపోయింది. చివరగా ఓ వ్యక్తి అతని దగ్గరకి వచ్చాడు.

    "ఊ... త్వరగా ఓ కాయితం ముక్కు ఇటిచ్చేయ్. సంతకం యెట్టేస్తా. అవతల పెబుత్వం ఆగిపోద్ది!" అన్నాడు మినిస్టర్ మిన్నారావ్ ఆ వ్యక్తితో.

    "నేను ఆటోగ్రాఫ్ కోసం రాలేదండీ" అన్నాడు ఆ వ్యక్తి.

    "మరి?"

    అతను చేతిలోని బ్యాగ్ లోంచి ఓ న్యూస్ పేపరుతీసి మినిస్టర్ మిన్నారావ్ కి చూపిస్తూ "ఇది చూడండి" అన్నాడు.

    "ఏటీ? ఇప్పుడే ఓపెనింగ్స్ సేస్తే అప్పుడే పేపర్లో వచ్చేసిందా... హహహ..." తన జోక్ కి తనే గొల్లున నవ్వేశాడు మినిస్టర్ మిన్నారావ్.

    "ఇది పాత న్యూస్ పేపర్ సార్"

    మినిస్టర్ మిన్నారావ్ మొహంలో నవ్వు మాయమైంది. అతను ఆ వ్యక్తి వంక అనుమానంగా చూస్తూ ఆ న్యూస్ పేపరుని అందుకుని దాన్ని చూస్తూనే అదిరిపడ్డాడు. అది రాజేంద్ర హత్యకేసుకు సంబంధించిన వార్త పడిన న్యూస్ పేపర్.

    "మనం తచ్చనం ఇంటికాడ మాట్లాడుకుందాం పద!" కంగారుగా అన్నాడు మినిస్టర్ మిన్నారావ్ ఆ వ్యక్తితో.

    "ఇప్పుడా! ఇప్పుడయితే మీ ప్రభుత్వం ఆగిపోతుందేమో కద్సార్? రేపు తీరుబడిగా మీ ఇంటికొస్తాసార్!" అన్నాడా వ్యక్తి వినయంగా.

    "మరీ అంత వినయం వద్దు. నా మెదడులో నరాలు సిట్లిపోతాయ్! పెబుత్వం ఆగిపోనీ, కూలిపోనీ... మనం ఇప్పుడే మాట్లాడాల!" అన్నాడు మిన్నారావ్ పాలిపోయిన మొహంతో.


    *         *           *

    "కూకో... కూకో" గదిలోని సోఫాలో భుజాలు పట్టి నొక్కి ఆ వ్యక్తిని కూర్చోపెట్టి గబగబ వెళ్ళి గది తలుపులు లోపలి నుండి గడియపెట్టొచ్చి ఆ వ్యక్తి కాళ్ళ దగ్గర నేలమీద కూర్చున్నాడు మినిస్టర్ మిన్నారావ్. ఆ వ్యక్తి కంగారు పడిపోయాడు.

    "అరెరె ... అదేంటి సార్... మీరు నేలమీద కూర్చోవడం ఏంటి? పైన కూర్చోండి సార్."

    "వద్దు... మెదడు నరాలు చిత్లిపోతాయ్. ఇంతకీ నీకేటి కావల?"

    ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు. అర్రె... ఆ న్యూస్ పేపరు చూపించగానే వేరు ముక్క వాసన చూసిన పాములా ఎలా లొంగిపోయాడు? ఆ పేపర్లో రహస్యం ఏంటో?

    ఆలోచనలో పడిపోయాడు అ వ్యక్తి.

    "సెప్పు బాబూ.. త్వరగా సెప్పు. నరాలు సిట్లిపోతున్నాయి."

    "ప్రమోషన్! నేను పనిచేసే ఆఫీసులోనే పై పోస్టుకి ప్రమోషన్ కోసం అందరితోపాటు నన్నూ ఇంటర్వ్యూకి పిలిచారు. నేను సెలెక్ట్ అయ్యేలా చూడాలి!"

    "అట్టాగే... నువ్వే ఆఫీసులో పని చేస్తున్నావో, ఆ ప్రమోషన్ వివరాలేంటో చెప్పు!"

    అతని వివరాలు రాసి ఉంచిన స్లిప్ జేబులోంచి తీసి మినిస్టరు మిన్నారావుకి ఇచ్చాడు.

    ఆ స్లిప్పుని చదివి "నీకు ప్రమోషన్ వచ్చినట్టే ఫో" అన్నాడు.

    "థాంక్యూ సార్" అంటూ ఆ వ్యక్తి సోఫాలోంచి లేచి గది తలుపుల దాకా వెళ్ళి గడియ తీసాడు.

    "ఇంతకీ నిన్ను ఇక్కడికి ఆ న్యూస్ పేపరుతో పంపించింది ఎవరు?" అక్కడే నేలమీద కూర్చునే అడిగాడు మిన్నారావు.

    "ఏకాంబరం! మీరు విజయవాడకి ట్రాన్సుఫర్ చేయించారే.. ఆయన! మాకు దూరపు బంధువవుతాడు... వస్తాను సార్"

    ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.

    వీడిని పంపిన వాడు ఏకాంబరం!

    వాడిని పంపిన వాడు బుచ్చిబాబు!

    "ఒరేయ్ బుచ్చిబాబూ! ఎంత పని చేశావ్ రా"

    బాధగా జుట్టు పీకున్నాడు మినిస్టరు మిన్నారావు.


    *          *           *

  • Prev
  • Next