TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 112
- మల్లిక్
రామలక్ష్మి తలుపు తీసింది. ఆ వెనుకే సీత కూడా వచ్చి ఆత్రంగా చూసింది.
మోహన్ ఒక్కడే ఇంట్లోకి వచ్చాడు.
"ఆయనేరీ?" అడిగింది సీత మోహన్ ని.
"రాలేదు." అన్నాడు మోహన్ లోపలికొచ్చి కూర్చుంటూ.
"ఆఫీసుకు రాలేదా?" మళ్ళీ అడిగింది సీత.
"ఆఫీసుకు వచ్చాడు. ఆఫీసయిన తరువాత మేమిద్దరం ఇంటికి రావాలని బయటకి వచ్చాం. అప్పుడే వాళ్ళమ్మా నాన్నా అక్కడికి వచ్చారు."
"ఎందుకూ?"
"ఇంట్లో వుంటే ఏమీ తోచక సిటీ చూద్దామని బయటకి వచ్చారంట. ఓ గంటసేపు తిరిగాక బుచ్చిబాబు వాళ్ళ అమ్మకి నాగదేవత మహిమలు' సినిమా పోస్టర్ కనిపించింది. దాంతో ఆవిడ ఆ సినిమా చూడాలని పట్టుపట్టింది. బుచ్చిబాబు ఆఫీసు టైమైపోయిందికదా, అందుకని అక్కడి కొచ్చి అతన్ని కూడా ఆ సినిమాకి లాక్కెళ్ళారు!" లోలోపల ఎంతో సంతోషిస్తూ చెప్పాడు మోహన్.
"ఆ? నాగదేవత మహిమలు సినిమా రిలీజయిందా? ఏవండీ మనం కూడా ఆ సినిమా చూసి తీరాలండి. నేనిదివరకు "నాగరాజు నంగనాచీ" సినిమా చూసా! హబ్బ! ఆ సినిమా ఎంతో బాగుందో. నాగరాజు కోపానికి గురయి నాగరాజుతో శపించబడి అందులో హీరో తల్లిగానూ, హీరోయిన్ బొద్దింకగారూ మారిపోయి ఎన్ని కష్టాలు పడతారో! నాగదేవత మహిమలు ఆ సినిమా తీసినవాళ్ళే తీసారనుకుంటా. హేవండేవండీ.. మనం కూడా ఆ సినిమాకు వెళ్దామండి" నేలమీద కాళ్ళు తపతపా కొడుతూ అంది రామలక్ష్మి.
"సరే... సరే.... సరే... వెళ్దాం ఆ చిందులెయ్యడం ఆపు" విసుకున్నాడు మోహన్.
సీతముందు తన భార్య అలా చేయడం అతనికి అవమానకరంగా అనిపించింది.
మోహన్ చెప్పిన విషయం విని సీతకు ఒళ్ళు మండింది.
నిజమేమరి, క్రితంరోజు సాయంత్రం నుండి బుచ్చిబాబుని మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తుంది ఆమె. పొద్దున్న వస్తానన్నాడు రాలేదు. సాయంత్రమూ ఎగ్గొట్టాడు.
ఏం? నాకు కాస్త అర్జంట్ పని వుంది. మీరిద్దరూ సినిమా చూసి రండి అని చెప్పలేడా? ఇంత చిన్న విషయం దగ్గరే తల్లిదండ్రులకు భయపడేవాడు పెళ్ళి కాకుండా కాపురం ఎలా చేస్తాడు?
భయమూ లేకపోతే నిర్లక్ష్యమా?
అప్పుడే అంది నిర్లక్ష్యమా? చూస్తా... చూస్తా....!
పళ్ళు నూరింది సీత.
"మీరు మొహం కడుక్కోండి. నేను కాఫీ కాచి పట్టుకొస్తా" అంది రామలక్ష్మి భర్తతో.
మోహన్ ఒక్క నిముషంలో మొహం కడుక్కొని సీత ముందొచ్చి కూర్చున్నాడు. బాత్రూంలో సీత స్నానం చేయడం చూసిన దగ్గరనుండి అతను మరీ ఇదైపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా. సీత ఎప్పుడు స్నానం చేస్తుందా అని చాలా కోరికతో వున్నాడు.
పాపం! సీతకి తనను మోహన్ అలా చూసాడన్న విషయం తెలియదు.
తెలిస్తే ఇప్పుడతని ముందు కూర్చోగలిగేదా?
"ఏంటండీ సీతగారూ విశేషాలు! మధ్యాహ్నం ఏం చేసారు?" అడిగాడు మోహన్.
"మధ్యాహ్నం దాకా పత్రికలు చదివి పడుకున్నానండీ. బుచ్చిబాబు రాత్రికిగానీ వస్తానన్నాడా?" అడిగింది సీత.
మోహన్ మొహాన్ని అప్రసన్నంగా పెట్టాడు. సీత బుచ్చిబాబు పేరును ఉచ్చరించడమే అతనికి నచ్చడం లేదు.
"ఏమో.. నాకేం చెప్పలేదు" అన్నాడు.
"కాఫీ..." అంటూ ట్రేతో అక్కడికి వచ్చింది రామలక్ష్మి. మోహన్ చటుక్కున ట్రేలో ఒక కప్పు అందుకుని సీత చేతివేళ్లు తాకుతూ ఆమెకి అందించాడు.
"హారి దేవుడా? ఇక్కడి నుండి నేనెప్పుడు వెళతానో కదా!" అని మనసులో అనుకుంది.
ముగ్గురూ కాఫీలు తాగారు.