TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 110
- మల్లిక్
ఏకాంబరం తన క్యాబిన్ లో పిచ్చిపట్టినట్టు అటూ ఇటూ తిరుగుతున్నాడు. మధ్యమధ్యలో జుట్టు పీక్కుంటూ అసహనంగా "అబ్బా!" అంటున్నాడు.
ఈ కిల్లారి కిత్తిగాడు ఇంకా రాడేం? ఈ సస్పెన్సు నేను భరించలేకపోతున్నారా దేవుడో... అనుకున్నాడు. మోహన్ బుచ్చిబాబు గురించి ఏదో చెప్తానన్నాడు. ఏంటది?"
కేవలం బుచ్చిబాబుకి సంబంధించి ఏదో చెప్తానంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు. కానీ మోహన్ బుచ్చిబాబు ప్లస్ సీతకి సంబంధించిన విషయం ఏదో చెప్తానన్నాడు! ఏంటదీ?
ఏంటి?
జుట్టు పీక్కున్నాడు ఏకాంబరం.
"ఏం సార్! బాగా తలనొప్పిగా వుందా?"
ఆ గొంతువిని ఉలిక్కిపడి గుమ్మంవైపు చూసాడు ఏకాంబరం. మోహన్ క్యాబిన్ గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు.
"వచ్చేసావా? ఏంటయ్యా ఇంతాలస్యం చేశావ్? రా రా...." గబగబా అంటూ కుర్చీలో కూర్చున్నాడు.
మోహన్ ఆయన టేబుల్ దగ్గరికి నడుచుకుని వస్తూ అన్నాడు "ఆలస్యం ఎక్కడ సార్? ఇంకా పది కాలేదుగా?"
"అయినా నువ్వు చాలా టెన్షన్ పెట్టేశావోయ్"
"ఏం సార్? ఏదయినా అర్జంట్ ఫైల్స్ ఉన్నాయా?"
"ముందు నువ్వు కూర్చో చెప్తా!"
"వద్దు సార్! మీ ముందు కూర్చుంటే కిల్లారికిత్తిగా అంటూ మళ్ళీ నన్ను లేపుతారు సార్" భయంగా అన్నాడు మోహన్.
ఏకాంబరం భళ్ళుమని నవ్వేసాడు.
"సర్లేవయ్యా! నువ్వు కిల్లారికిత్తిగాడివి కాదు. డింగాల డిప్పివే.. ఇప్పుడు కూర్చో"
మోహన్ అతనికి ఎదురుగా కుర్చీ అంచులమీద కూర్చుంటూ "చెప్పండి సార్. ఏవైనా ఫైల్స్ ఉన్నాయా సార్?" అని అడిగాడు.
"అబ్బ నువ్వు వట్టి గిపాకీ అయ్యా!" నొసలు కొట్టుకుంటూ అన్నాడు ఏకాంబరం.
"గిపాకీనా? అంటే ఏంటి సార్?" భయం భయంగా అడిగాడు మోహన్ మళ్ళీ ఎంత భయంకరమైన మాట వినాల్సి వస్తుందో అని!"
"గిపాకీ అంటే అమాయకుడివోయ్. అయినా ఫైల్స్ గురించి నేనేనాడైనా ఇంత టెన్షన్ ఫీలయ్యానా? మీ ఇంట్లో వుండే ఆ అమ్మాయి పేరేంటి?" అడిగాడు ఏకాంబరం.
"సీత సార్"
ఆ పేరు అంటున్నప్పుడు ఆమె నగ్నరూపం అతని మనసులో మెదలి నరాలు జివ్వుమన్నాయి.
"అదే... అదే. ఆమె బుచ్చిబాబుల గురించి ఏదో చెప్తానన్నావు?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం.
మోహన్ ఏకాంబరం వంక సందేహంగా చూసాడు.
"మరేం ఫర్లేదు చెప్పు. అది చెప్పకూడని రహస్యం అయితే నేనెవరికీ చెప్పనులే." మోహన్ కి భరోసా ఇస్తూ అన్నాడు ఏకాంబరం.
మోహన్ ఏకాంబరానికి మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు.
"హమ్మ బుచ్చిబాబూ! నేను నువ్వేదో డింగాల డిప్పివని అనుకున్నా గానీ గొప్ప చలాకీ గిలాకీనే"
గుండెలు బాదుకున్నాడు ఏకాంబరం.