• Prev
  • Next
  • సంపూర్ణ గోలాయణం 85

    Listen Audio File :

    ప్రొద్దున ఇంటినుంచి బయలుదేరిన క్రిష్ణ వెతుక్కుంటూ ప్రొఫెసర్ గారి ఇంటికి చేరాడు. తలుపు ధన ధన తట్టాడు. లోపలినుంచి వచ్చి చిరాగ్గా తలుపు తీశారు పృధ్విగారు. “ఎవరు మీరు? ఇది నా స్టడీ అవర్. తర్వాత రండి!” అంటుండగానే ఆయన్ని తోసుకుని లోపలికి జొరబడిపోయాడు క్రిష్ణ. జర్రున కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

    “మా చెల్లాయ్ ఏది? రోజు దీపిక మీ దగ్గరకివస్తూ వుంటుందిట ఎందుకు?” అని అడిగాడు సూటిగా!

    అప్పటిదాకా దొంగవాడేమో అని బెదిరిపోయిన ప్రొఫెసర్ గారు అతను దీపిక అన్నయ్య అని తెలుసుకుని సంతోషించారు. ఫ్రూట్ జ్యూస్ కూడా ఇచ్చారు. దీపికని అరగంట సేపు పొగిడారు. దాంతో క్రిష్ణ కోపం చల్లారింది "దీప మీకు రీసెర్చ్ లో సాయం చేస్తోందా? దాని మొహం దానికేం తెలుసనీక్ అంతకీ మీరు చేసే రిసెర్చి ఏమిటి?” అని అడిగాడు.

    ఆ విషయం మాత్రం తనని అడగొద్దన్నారు అదో పెద్ద రహస్యం అన్నారు. లోక కళ్యాణం కోసం శ్రమపడుతున్నాన్నారు. కాని కృష్ణ వినలేదు. ఏమిటా రహస్యం చెప్పమన్నాడు. నిజంగా లోక కళ్యాణం కోసమే రీసెర్చ్ చేస్తుంటే అంత రహస్యంగా దాచవలసిన పనేమిటని నిలదీశాడు. మర్యాదగా చెప్పకపోతే ఈ ఇంట్లో ఏదో గూడుపుఠాణీ వుందని పోలీసులకి కంప్లయింట్ యిస్తాను అని బెదిరించాడు.

    పృధ్విగారు బెదిరిపోయారు. “సరే చెప్తానయితే, కానీ ఇంకెవరితో అనకు" అని హెచ్చరించి నిజం చెప్పేశాడు. అప్పుడే గడియారం పదకొండున్నర కొట్టింది. నోరు తెరుచుకుని ఆయన చెప్పింది విన్న క్రిష్ణకి ముందర మతిపోయింది. ఆ తరువాత చిర్రెత్తుకొచ్చింది. గదిలో పచార్లు చేస్తూ నిర్నమేష నేత్రాలతో తన పరిశోధనల గురించి చెపుతున్న ప్రొఫెసర్ గారిని అమాంతం లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. మరో కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చున్నాడు.

    “ఏమిటండీ ఇది? పెద్దవారు అనకూడదుగానీ మీకేమైనా పిచ్చా? చాదస్తామా?” అంటూ మొదలుపెట్టి దులిపేశాడు. ముందు ప్రొఫెసర్ గారు కూడా గట్టిగా వాదించారు గానీ క్రిష్ణ ముందు నిలవలేక నీరసపడిపోయారు. అప్పటికే రెండయింది టైం. ఆయన కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి.

    “నా లంచ్ టైమైపోతోంది టీ టైం కూడా అయిపొయింది. నను భోంచేసి రానీవయ్యా అప్పుడు మాట్లాడుకుందాం" అని మొత్తుకున్నాడు. కానీ క్రిష్ణ వినలేదు

    "భోజన విషయం తరువాత ఆలోచిద్దాం. ముందు ఈ విషయం తెలనివ్వండి" అని కూర్చోబెట్టేశాడు.

    భోజనం మాట దేవుడెరుగు మంచి నీళ్ల చుక్క కూడా తాగనివ్వలేదు. అప్పటికీ ఓపిక తెచ్చుకుని వెళ్ళి తను గీసుకున్న మేప్లూ అవీ చూపించాడు. అవన్నీ లాక్కుని చింపి పారేశాడు క్రిష్ణ లబోదిబోమన్నాడు ఆయన. “ఇదేం జబర్దస్తీ మహానుభావా? నేనేం నీ దారికి అడ్డం వచ్చానా? నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా నా మానాన నేను ఏదో ఎక్స్ పరిమేంట్ చేసుకుంటూ వుంటే వచ్చి ఇలా దౌర్జన్యం చెయ్యడం ఏమైనా బాగుండా?” వాపోయాడు.

    అయినా కరగలేదు క్రిష్ణ "చూడండి. మీరు మేధావులు డబ్బున్న వారు ఏమైనా మంచి చెయ్యాలనే సదుద్దేశ్యం వున్నవారు అటువంటి మీరు ఇలా తలా తోకా లేని పనులు చెయ్యడం ఏమిటి చెప్పండి. మీ తెలివితేటలు, డబ్బు వెచ్చించి ఏదైనా మంచి పని చెయ్యగలిగితే చెయ్యండి, లేదా మాట్లాడకుండా కూర్చోండి" అన్నాడు.

    కోన ఊపిరితో మళ్ళీ వాదించారు ప్రొఫెసర్ గారు. కానీ క్రిష్ణ తగ్గలేదు. సామ దాన దండోపాయాలు వినియోగించి ఆయన్ని దార్లోకి తీసుకొచ్చాడు. స్నానం చేయించి బట్టలు మార్పించి భోజనం చేశాక యింటికి తీసుకొచ్చాడు. దార్లో దీపిక మోహన్ ల విషయం కూడా చెప్పాడు పృధ్వి. తల పంకించి ఊరుకున్నాడు క్రిష్ణ.

  • Prev
  • Next