• Prev
  • Next
  • సంపూర్ణ గోలాయణం 84

    పెద్ద ప్రళయం వస్తుందేమో అని భయపడుతుంటే గాలి వచ్చి మబ్బు కొట్టుకుపోయినట్లు అనిపించింది అతనికి. మిగిలినవాళ్ళంతా కూడా సంతోషించారు. ఇక మేము వెళ్ళొస్తాం అని లేచాడు చిట్టిబాబు

    "అదేమిటి ఇంత దాకా ఉన్నారు ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? ఏకంగా భోజనం చేశాక వెళ్దురుగాని" అంది వర్ధనమ్మ.

    “అవును, ఎంత అరగంటలో వంట చేసేస్తాం" అని కొంగు బిగించుకుని తయారైంది రాధ.

    గంటలో వంట అయిపొయింది. హఠాత్తుగా కొడుకు విషయం గుర్తొచ్చింది వర్ధనమ్మకి.

    “ఏమో అత్తయ్యా! పొద్దున్నెప్పుడో వెళ్ళాడు ఇంకా రాలేదు" అంది రాధ.

    విశ్వనాథంగారు, శారదమ్మ స్నానాలు చేశారు మధ్యగది సర్దేసి వడ్డన మొదలు పెట్టారు. “భోజనానికి రండి!” అని పిలిచింది రాధ. అందరూ లేదారు. అంతలోనే గేటు చప్పుడయింది. ముందు కృష్ణ, ఆయన వెనక ప్రొఫెసర్ గారు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మోహన్. రోజులా సూటూ బూటు వేసుకోలేదు. తెల్లటి ధోవతి కట్టుకుని దానిమీద తెల్లటి లాల్చీ వేసుకున్నారు. తలకి నూనె రాసుకుని దువ్వుకున్నారు. చక్కగా కడిగిన ముత్యంలా వున్నారు. ఆయన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు మోహన్.

    అతని చెయ్యి అందుకుని "విష్ యూ హేపీ మారీడ్ లైఫ్" అన్నారాయన.

    థాంక్స్ చెప్పాడు మోహన్.

    “దీప ఏదీ?” అడిగారు.

    లోపలినుంచి వచ్చింది దీప. ఆయన్ని చూడగానే ముఖం అంత చేసుకుని దగ్గరికి వచ్చింది దీపికని కూడా విష్ చేశారు. “ఏమ్మా? నీ పెళ్ళి విషయం తెలిసి మీ నాన్నగారు ఏమన్నారు? మోహన్ వాళ్ళ మామయ్యగారు ఏమన్నారు? అసలే ఇద్దరిదీ ఉప్పూ నిప్పూ వ్యవహారం అడిగేశాడు.

    సమాధానం గుమ్మంలోంచి వచ్చింది "ఏం లేదులెండి. ముందు కాస్త ఖంగు తిన్నా తర్వాత సర్దుకున్నాం. పిల్లలని క్షమించేసి ఆశీర్వదించేశాం అన్నాడు సూర్యం.

    “తమరూ?” ప్రశ్నార్ధకంగా చూపాడు పృధ్వి.

    “వీడా? నా స్నేహితుడు సూర్యం!” అంటూ వచ్చి స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు సత్యం.

    వాళ్ళిద్దర్నీ అలా చూసి ముందు ఆశ్చర్యపోయి ఆ వెంటనే ఆనందించారు ప్రొఫెసర్ గారు. “వెరీగుడ్ అయితే భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు మీరిద్దరూ మళ్ళీ కలుసుకున్నారన్నమాట!” అన్నారు.

    స్టన్ అయిపోయాడు మోహన్ "సార్ ఏమిటన్నారు మీరు? నేను సరిగ్గా విన్నానా?” అన్నాడు అమిత ఆశ్చర్యంతో.

    చిన్నగా నవ్వారు ఆయన "మోహన్! మనం పొరబాటు పడ్డామయ్యా! భూమి గుండ్రంగానే వుంది. లేదేమో అనుకుని అనవసరంగా పరిశోధన చేశాం!” అన్నారు.

    మరింత ఆశ్చర్యపోయాడు మోహన్! “అసలు ఈ సత్యం మీకెవరు చెప్పారు సార్? మీకెలా తెలిసింది?”

    “కృష్ణ చెప్పాడు" నవ్వుతూ సమాధానం చెప్పాడు ప్రొఫెసర్.

  • Prev
  • Next