• Prev
  • Next
  • సంపూర్ణ గోలాయణం 83

    Listen Audio File :

    సత్యం గారికి కూడా మెలకువ వచ్చింది. కళ్ళు విప్పగానే యెదురుగా కనిపించింది దీపిక. ఆవేశం ముందుకొచ్చింది. అంతలోనే దుఖం వచ్చింది. చివాలున లేచి కూర్చున్నాడు. అది చూసి సూర్యంగారుకూడా లేచి కూర్చున్నారు. ఇద్దరూ ఒకరివంక ఒకరు చూసుకున్నారు. ఆ చూపులో కోపంలేదు ఎగతాళికూడా లేదు. జాలి, సానుభూతి ఉన్నాయి. విశ్వనాథం గారు, సూర్యం భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఆవేదనగా స్నేహితుడి వంక చూశారు సూర్యం అది గమనించారు విశ్వనాథం గారు.

    “సూర్యం జరిగినదానికి నాకు చాలా బాధగా వుందిరా! కానీ ఏం చేస్తాం చెప్పు" అన్నారు.

    వెంటనే లేచి సత్యంగారి దగ్గరకు వెళ్ళాను "అయ్యా సత్యనారాయణమూర్తి గారు! నా కొడుకు చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ అమ్మాయిని నేను మనస్పూర్తిగా మా కోడలిగా అంగీకరిస్తున్నా. మా బిడ్డలాగా చూసుకుంటాం మీరు నిశ్చితంగా ఉండండి" అన్నారు.

    “నా కూతురు నాకు చెప్పకుండా పెళ్ళి చేసుకుందన్న బాధకన్నా సూర్యం నా గురించి ఏమనుకుంటాడో అనే బాధ ఎక్కువగా ఉంది" అన్నాడు సత్యం.

    “బావుంది నాకు బాధ ఎందుకు? నాకు భారతి, దీపిక ఇద్దరూ సమానమే" అనేశాడు సూర్యం.

    సత్యం కళ్ళు నిలబడిపోయాయి "నాకు తెలుసు వాడి మనసు అమృతం. నేనే తల తిక్క వెధవని, నేనే ఎప్పుడూ తొందరపడి వాడిని బాధపట్టేవాడిని" అన్నాడు.

    “ఏమీ కాదు, నేనే ఒళ్ళు పొగరు వెధవని, అనవసరంగా పోట్లాడి వాడిని చిరాకు పెట్టేవాడిని" అన్నాడు సూర్యం,

    ఆ తరువాత ఆ ఇద్దరూ కలిసి కాలేదు నాకేం కోపం ఎక్కువ. అంటే కాదు నాకే చిరాకు ఎక్కువ నేనే మొండి వాడిని అంతేకాదు నేనే కోపిస్టిని" అని దెబ్బలాడుకోడం మొదలుపెట్టారు. చలపతిరావుగారికి భలే కోపం వచ్చేసింది "అయ్యా! ఇద్దరూ మొండివాళ్ళే ఇద్దరికీ కోపాలు ఎక్కువే. నా మీద దయవుంచి మళ్ళీ దెబ్బలాడుకోకండి. మీకేం అరుచుకుని అరుచుకుని దభీమని విరుచుకుపడిపోతారు. ఆ తరువాత నేను తంటాలు పడాలి. అసలే పొద్దుటినించి మీ యిద్దరి మధ్యా పరిగెట్టి నీరసం వస్తోంది" అని విసుక్కున్నారు.

    “మేము పోట్లాడుకోడం లేదండీ, మాట్లాడుకుంటున్నాం" అన్నాడు సూర్యం లేచివెళ్ళి సత్యం పక్కని కూర్చుని, వెంటనే స్నేహితుడిని గాఢంగా కౌగిలించుకున్నారు సత్యం. ఇదంతా చూస్తున్న మోహన్ గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు.

  • Prev
  • Next