TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 114
- మల్లిక్
అప్పుడు రాత్రి ఎనిమిది గంటలయింది. అంతకు ఓ పావుగంట ముందుదాకా ఏకాంబరం నానా చెత్త మాట్లాడి వెళ్ళాడు.
తను ఎక్కడెక్కడ పనిచేసాడూ, తను పనిచేసిన చోట ఆఫీసుల్ని ఎలా డెవలప్ చేసాడూ సీతకు బాగా కోతలు కోస్తూ చెప్పాడు. ఏకాంబరం వెళ్ళిన అయిదు నిముషాలకి రామలక్ష్మి గుళ్ళో హరికథా కాలక్షేపం వుందని, గంటలో వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.
మోహన్ హాల్లో కూర్చుని టీవీ వంక అసహనంగా చూస్తున్నాడు.
సీత లోపల ఏం చేస్తోంది?
సోఫాలోంచి లేచి మెల్లగా బెడ్ రూం దగ్గరకెళ్ళి లోపలికి తొంగి చూసాడు.
సీత మంచంమీద వెల్లకిలా పడుకుని వారపత్రికేదో చదువుతోంది.
తను ఇంకా త్వరపడాలి! లేకపోతే రామలక్ష్మి హరికథ నుండి వచ్చేస్తుంది.
మోహన్ పిల్లిలా అడుగులు శబ్దంకాకుండా వేస్కుంటూ గదిలోకి ప్రవేశించాడు. సీత మోహన్ గదిలోకి రావడం గమనించలేదు. ఆమె పత్రిక చదవడంలో పూర్తిగా లీనమైవుంది. మోహన్ ఆమెను సమీపించి చేతిలోని వారపత్రిక లాగి పక్కకి పడేశాడు.
సీత ఉలిక్కిపడింది. మోహాన్ని చూసి ఆమె గబుక్కున లేచి కూర్చుంది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కానీ అతని మొహంలోని ఎక్స్ ప్రెషన్ చూసాక్ ఆమెకి అర్థం అయిపోయింది.
"ఏంటిది?" అడిగింది సీత కఠినంగా.
"ఏంటో నోటితో చెప్పడం ఎందుకూ? చేసి చూపిస్తా" అంటూ మోహన్ ఆమె మీదకి దూకి గట్టిగా పట్టుకున్నాడు.
"ఛీ... వదులు... వదులు" సీత గింజుకుంది.
"వదిలేస్తా!... కానీ నా కోరిక తీరాక వదిలేస్తా"
"మోహన్ ... దిసీజ్ టూ మచ్. నా గురించి నువ్వేమనుకుంటున్నావు?" కోపంగా అరిచింది సీత.
"నీ గురించి చాలా అనుకుంటున్నా, అందుకేగా ఇలా పట్టుకున్నా. మోహన్ తన పట్టుని మరింత గట్టిగా బిగించాడు.
"ఛీ..... నేనలాంటిదాన్ని కాదురా.... వదులు"
"పెళ్ళి కాకుండా కాపురం చేసేదానిని నువ్వెలాంటిదానివో నాకు విడిగా చెప్పనక్కరలేదు."
మోహన్ మొహం సీత మొహానికి దగ్గరగా వచ్చేసింది. మరో క్షణంలో అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడనగా సీత బలంగా అతని ముక్కుమీద ఒక గుద్దు గుద్దింది.
"అబ్బా..." బాధగా అరుస్తూ కుడిచేత్తో ముక్కు పట్టుకున్నాడు మోహన్.
అదే అదునుగా సీత అతని గుండెలమీద రెండు చేతులూ పెట్టి తన బలమంతా ఉపయోగించి ఒక్కతోపు తోసింది. మోహన్ మంచంమీద నుండి దబ్బున నేలమీద పడ్డాడు.
సీత మంచంమీద నుండి క్రిందికి దూకి ఇంటి బయటకు పరుగుతీసింది.
ఆమె మనసును భయం పూర్తిగా ఆవహించింది.
అవును మరి... కొద్దిలో ఆమె మోహన్ పశువాంఛకు బలి అయిపోయి వుండేది! ఆ చీకట్లో భయంతో పరుగుతీస్తున్న సీత ప్రక్కన ఓ స్కూటర్ ఆగింది.