TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆహా నగర్ కాలనీ
సూరేపల్లి విజయ
12 వ భాగం
"ఒసే...నమ్రతా" ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న రాజకుమారిడి వైపు చూసింది.
రాజకుమారుడు కనిపించలేదు. కానీ, ఎదురుగా గుర్రుగా చూస్తోన్న తండ్రి కనిపించాడు నమ్రతకు.
"నానా...నువ్వా.... నువ్వెప్పుడొచ్చావు? నా రాజకుమారుడు ఎక్కడ?" అడిగింది.
ఇంకా గుర్రుగానే చూస్తున్నాడు నమ్రత తండ్రి సియస్సార్. అతని అసలు పేరు తో ఆ కాలనీవాసులకు హింసించడం అతని నిత్యకృత్యాల్లో ఓ భాగం. సి, సూర్యారావు అంటే బాగుండదని సియస్సార్ అని షార్ట్ కట్ లో నేమ్ ప్లోట్ మీద తగిలించుకున్నాడు. తనకు తానే సైంటిస్ట్ అని అభివర్ణించుకున్నాడు.
అతని ఏకైక కూతురు నమ్రత. ఆవిడదో వింతయిన క్యారెక్టర్. రకరకాల కలలు కంటూ తనక్కాబోయే భర్తతో ఊహల్లో విహరిస్తుంటుంది. "ఏంటి నాన్నా...మీరు చేసిన ప్రయోగం ఏదైనా ఫెయిల్ అయ్యిందా?"
"అలా చూస్తున్నారేంటి?" అని అడిగింది.
"నువ్వు డిష్యుం... డిష్యుం...అంటూ పరిశోధన చేసుకుంటున్న నామీద ఎటాక్ట్ మొదలెట్టావు. అయినా నీకీ కలలుకనే దిక్కుమాలిన జబ్బేమిటే" నెత్తి నోరు కొట్టుకున్నాడు సియస్సార్.
"అబ్బో...తమరికేదో ఏ జబ్బూ లేనట్టు. నా పట్టుచీరలన్నీ తగలబెట్టి బంగారం తయారు చేస్తానన్లేదూ ....పోపుడబ్బాలతో కొత్తరకం టెలిఫోన్లు చేస్తానని చెప్పలేదూ...సిగ్గులేకపోతే సరి" రాగాలు మొదలెట్టింది సియస్సార్ భార్య చారుమతి. అలా చాలా సేపు గావుకేక పెట్టింది నమ్రత. ఇద్దరికీ క్షణం పడదు. వాళ్ళిద్దరి గోల ఆపాలంటే టాపులోచిపోయేలా అరవక తప్పదు నమ్రతకు.
* * *
ఆ రోజు సాయంత్రం సరదాగా కాలనీ మొత్తం తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు సాకేత్. సాయంత్రం అయిదు దాటుతుండగా హోటల్ బయటకు వచ్చాడు ప్రశాంతంగా అనిపించింది ఆ కాలని. నడుస్తున్న వాడల్లా ఓ బ్యాంకు దగ్గర ఆగాడు. లావారిస్ బ్యాంక్ అని ఉంది. అతన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం అది కాదు. లావారిస్ లో "వారి" బ్రాకెట్ లో ఉంది. లాస్ అని కూడా చదువుకోవచ్చు. ఫన్నీ కాలనీ అనుకున్నాడు.
టులెట్ బోర్డులు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని చూస్తున్నాడు. అతని దృష్టి ఓ ఇంటిమీద పడింది. ఆ ఇంటిముందు ఓ బోర్డు వేలాడుతోంది. ఇచ్చట ఈ ఇంట్లో మేడపై ఉన్న పోర్షన్ అద్దెకు ఇవ్వబడదు. ఎవరైనా ఇల్లు అద్దెకివ్వబడును అని రాసుకుంటారు. ఇవ్వబడదు అని రాసుకోవడమేమిటో...అనుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. కాలింగ్ బెల్ లాంటిది ఏదైనా ఉందేమోనని చూసాడు. అలాంటిదేమీ కనిపించలేదు గానీ ఓ తాడు కనిపించింది.
రాజుల కాలంలో ధర్మగంట ఉండేదట. అలాంటిదే కాబోలు అనుకొని తాడులాగాడు. లోపల గంట మోగి చారుమతి బయటకు వచ్చింది. "పై పోర్షన్ అద్దెకు కావాలి" అడిగాడు వినయంగా సాకేత్.
"అద్దెకు ఇవ్వమని రాసాంగా...మళ్ళీ అద్దెకు కావాలని అడుగుతావేంటి?" మొహమంతా చిటచిటలాడిస్తూ అంది.
"అదే...నాకా పోర్షన్ అద్దెకు ఇస్తారేమోనని...." ఏ మూడ్ లో ఉందో కాని... "సరే.... మీరా తాడు పట్టుకొని పైకి రండి" అంది.
బిత్తరపోయి చూశాడు సాకేత్. ఓ తాడు పై పోర్షన్ నుంచి వేలాడుతోంది.
"ఈ తాడు పట్టుకొని పైకి రావాలా?" అదేంటి మెట్లు లేవా?"
"మెట్లు లోపల్నుంచి ఉన్నాయి. ఇంట్లో పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి ఉంది. అందుకే పై పోర్షన్ లో అద్దెకు ఉండే బ్రహ్మచారులకు ఈ ఏర్పాటు.
"ఇంతకు నువ్వు బ్రహ్మచారివేనా?"
"బ్రహ్మచారినే" అన్నాడు గొంతు పెగల్చుకొని సాకేత్.
"ముందు తాడు పట్టుకొని పైకొచ్చి పోర్షన్ చూసుకో. అద్దె ముప్పయి రూపాయలు."
"ఎంత? మరోసారి డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడిగాడు.
"థర్టీ రూపీస్ పర్ మంత్. "సాకేత్ కు తాడు పట్టుకొని ఎక్కడం దిగడం కష్టమనిపించినా రోజూ ఎక్సర్ సైజు చేసినట్టుగా ఉంటుందని, ఇల్లు నచ్చిందని అడ్వాన్స్ ఇచ్చేసాడు.
|