Aanagar Colony 11

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

11 వ భాగం

టైం చూసుకున్నాడు సాకేత్. మధ్యాహ్నం పన్నెండు నలభై అయింది. అప్పుడు గుర్తొచ్చింది. తనని ఒంటిగంటకు రిసెప్షనిస్టు మాధురీ కులకర్ణి రమ్మన్న విషయం. వెంటనే వెనుతిరిగి, హోటల్ కసకస వైపు అడుగువేశాడు. సమయం ఒంటిగంట. చెప్పిన టైంకే వచ్చింది మాధురీ కులకర్ణి.

"ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు నాకు లంచ్ టైం. ఇప్పుడు నీకేం కావాలో అడుగు " అంది రిసెప్షనిస్టు.

"మరేం లేదు. ఈ వయసులో కూడా ఉత్సాహంగా ఎలా పనిచేయగలుగుతున్నావు అవ్వా" అడిగాడు సాకేత్.

"అదిగో...ముందు పదే పదే అవ్వా అనడం మాను" వార్నింగిచ్చింది రిసెప్షనిస్టు.

"సరే....." అని ఆమె వంక చూసాడు.

ఈ వయసులో జీన్స్ వేసుకున్న ఆమె గమ్మత్తుగా అనిపించింది. అదే విషయం ఆమెను అడిగాడు. "దుస్తులకు, వయసుకు సంబంధం ఏముంది? నేను వయసులో ఉన్నప్పుడు జీన్స్ సంస్కృతి లేదు. జీన్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో నాకూ తెలియాలి కదా...అందుకే ఈ కోరికను ఇప్పుడు తీర్చుకుంటున్నాను."

"సరే...ఒరిజినల్ పేరు అప్పలమ్మ...ఆ పేరు మార్చుకోమని మొగుడు చచ్చేదాకా పోరు పెట్టాడు. అప్పుడు మార్చుకోలేదు. తర్వాత అనిపించింది అప్పలమ్మ పేరు మార్చుకోవాలని, మాధురీ దీక్షిత్ అందం, మమతా కులకర్ణి డేరింగ్ నాకు నచ్చింది. ఇద్దరి పేర్లు కలిపి పెట్టుకున్నాను.

"ఈ వయసులో కూడా ఎందుకు పనిచేస్తున్నట్లు?"

"ఈ ప్రశ్న ఈ వయసులో కూడా నాకు విశ్రాంతిని ఇవ్వకుండా నన్ను నిర్లక్ష్యం చేసి నీ బతుకు నువ్వు బతుకు అన్న నా కొడుకుని అడగాలి."

"నీ కొడుకేం చేస్తాడు?"

"సంఘ సేవకుడులే."

"నీ కొడుకు మీద నీకు కోపంగా ఉందా?"

"లేదు...అసహ్యంగా ఉంది. అయినా ఆ విషయం మరిచిపోయాను. జనారణ్యంలో నుంచి ఈ ఆహానగర్ కాలనీలోకి వచ్చాను. ఇక్కడ వయసును బట్టి కాక ప్రతిభను బట్టి పని ఇస్తారు. నా స్వేచ్చకు అడ్డులేదు. మెటికలు విరవడం, నోళ్ళు నొక్కుకోవడం ఉండదిక్కడ. ఎవరిపని వాళ్ళు చేసుకుంటారు. ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరు అడగరు."

"ఆమె చెబుతున్న విషయాలు గబగబా డైరీ లో నోట్ చేసుకున్నాడు. అలా అలా మాట్లాడుతుంటే ఆమె మీద గౌరవం పెరిగింది సాకేత్ కు. "ఇంటర్వ్యూ అయిపోయిందా? నేను సాయంత్రం డిస్కోకి వెళ్ళాలి. వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ నా కన్నా పెద్ద వాళ్ళు కూడా డిస్కోతెక్ కు వస్తారు" చెప్పి లేచింది మాధురీ కులకర్ణి. ఆమె చెప్పిన ఫీజు చెల్లించి సాకేత్ కూడా లేచాడు.

* * *

మంచు కురుస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులో నుంచి ఓ తెల్లని పంచ కళ్ళాణి గుర్రం. పచ్చిక బయళ్ళ మధ్య నుంచి వేగంగా వస్తుంది. దానిమీద ఓ రాకుమారుడు. ఓ పెద్ద రాజభవనం ముందు ఆగింది ఆ గుర్రం. ఓ చెట్టు కొమ్మని అందుకొని రివ్వున దాని సాయంతో గాలిలోకి ఎగిరి సరాసరి రాజకుమారి శయనాగారంలోకి దూసుకువెళ్ళాడు రాజకుమారుడు.

ఎవరో అగంతకుడు యువరాణి శయనాగారంలోకి చొచ్చుకువచ్చాడు. భటులు అరుస్తున్నారు. రాజకుమారుడు కత్తి తీసాడు. తన ఖడ్గ విద్య ప్రావీణ్యంతో భటులను చెల్లాచెదురు చేస్తున్నాడు క్షణాల్లో ఆ యుద్ధం ముగిసింది. భటులు పారిపోయారు. యువరాణి ఆ రాజకుమారుడి వంక ఆరాధనగా చూస్తోంది. యువరాజు మరింత ఆరాధనగా, నమ్రతా అన్నాడు.

"కాదు....రాజకుమారిని".

"నమ్రతా"

"కాదు....రాజకుమారిని" ఆమె పలవరిస్తోంది.