Rating:             Avg Rating:       974 Ratings (Avg 2.94)

Aahanagar Colony 22

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

22 వ భాగం

ఆహానగర్ కాలని బస్టాప్ ముందు బస్ ఆగింది. బస్ దిగి తలక్రిందులుగా వేలాడుతున్న కాలనీ బోర్డు చూసి, రిక్షా స్టాండ్ దగ్గరికి వెళ్ళాడు రాంబో. 'వస్తావా?' అడిగాడు.

'రాను. ఎక్కడికి 'అన్నాడు తన డొక్కు రిక్షాని ముందుకు లాగి.

'అన్నట్టు మన పేరేమిటి?" తన చేతిలో ఉన్న రివాల్వర్ ని అటు, ఇటు ఊపుతూ అన్నాడు రాంబో. 'అంటే నాపేరా? తమరి పేరా?' అడిగాడు అతడు.

"నాపేరు?" కోపంగా అన్నాడు.

"మీ పేరు నాకేటి తెలుస్తాది....అప్పారావో. సుబ్బారావో" అన్నాడు.

"ఏయ్....నా చేతిలో ఏముందో చూశావా?" కోపంగా తన రివాల్వర్ ని అతని కళ్ళముందు ఆడిస్తూ అన్నాడు.

"ఏయ్...ఇది రివాల్వర్...నా పేరేంటో తెలుసా?" కోపంగా అన్నాడు.

"అయ్యా బాబోయ్. రివాల్వరే...నేను సూడ్లేదు. అది లోపలెట్టేయండి. ఇంతకీ దాంతో ఏం చేస్తారు.?"

"దురద వేసినప్పుడు గోక్కుంటాను " కోపంగా చెప్పాడు రివాల్వర్ రాంబో. అట్టాగా...మా ఇంటావిడ రాత్రి అస్తమానం వీపు దురదెడుతోంది.

గోకవయ్యా....గోకవయ్యా అని సంపుకు తింటాది. ఓసారి మీ రివాల్వర్ ఇచ్చేస్తే ...మా ఇంటిదానికి ఇస్తాను. "ఆ రివాల్వర్ తో తన తలమీద బాదుకున్నాడు రివాల్వర్ రాంబో.

"ఏంటో బాబుగారు, తల మీద దురదెడుతుందా?" "ఒరేయ్ బక్కపీనుగ వెధవ...రిక్షా తొక్కరా" ఏడుపు గొంతుతో అన్నాడు. అతి కష్టమ్మీద రిక్షా తొక్కుతున్నాడు పాతాళభైరవి.

* * *

సినిమాల్లో హీరోయిన్లు హీరో గురించి ఎలా ఊహించుకుంటారో సాకేత్ ను చూసిన దగ్గర్నుంచి అలా తనూ ఊహించుకోసాగింది నమ్రత. సాకేత్ ని వివిధ కాస్టూమ్స్ లో ఎలా ఉంటాడో ఊహించుకుంటోంది.

ఇక్కడ నమ్రత సాకేత్ గురించి ఊహించుకుంటున్న సమయంలో మేడమీద సాకేత్ గడ్డం గీసుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇందాక మేడమీద సంఘటన గుర్తొస్తోంది. తనని బుద్ధావతారం, పప్పుసుద్దా అనడమే కాకుండా వెళ్ళేటప్పుడు కిసుక్కున నవ్విన సీను గుర్తొస్తోంది.

ఆ కోపంలో చెయ్యి రఫ్ గా ముందుకు వెళ్ళడంతో గడ్డంతో పాటు స్కిన్ కట్ అయ్యింది. "అయ్యయ్యో....గడ్డం తెగిందా?" అన్న మాటలు వినిపించేసరికి ఉలిక్కిపడి అద్దంలో చూసాడు.

తన వెనగ్గా ఓ ఆకారం. ఆ ఆకారం హౌసోనర్ కూతురిది. "నువ్వా" కోపంగా అన్నాడు.

"నాపేరు నువ్వా కాదు. నమ్రత. మా అమ్మ నమ్మీ అని పిలుస్తోంది. బేబీ అని మా డాడీ పిలుస్తారు. నమ్మీ డాళింగ్...నమ్రతా డీయర్ అని మీరు పిలవచ్చు" అంది నాన్ స్టాప్ గా మాట్లాడేస్తూ.

"డియర్ అని, డాళింగ్ అని పిలవాల్సిన అవసరం నాకేం లేదు. అయినా పిలవని పేరంటంలా వచ్చావేంటి? కోపంగా అన్నాడు సాకేత్.

"మీ గురించి ఊహించుకుంటూ అలా నిద్రలో నడిచే టైపులో నడుచుకుంటూ వచ్చేస్తాను. అన్నట్టు మీ పేరేమిటి? గ్రీకు వీరుడా?" అడిగింది నమ్రత సాకేత్ వైపు ఆరాధనగా చూస్తూ.

"ముద్దపప్పు, పప్పుముద్ద....బుద్ధావతారం" అన్నాడు అక్కసుగా సాకేత్.

"మీకు ఇన్ని పేర్లా" అంది ఆశ్చర్యాన్ని నటిస్తూ నమ్రతా.

"ఇంకా బోల్డు ఉన్నాయి. సరేనా...తమరు దయచేస్తే నా గడ్డం నేను గీసుకుంటాను."

'అబ్బ...అట్టా అనమాకయ్యా...' అంది అదోమాదిరిగా వయ్యారాలు పోతూ.

'ముందు మీరు దయచేయండి. లేదంటే మీ అమ్మ వస్తుంది. అప్పుడు నేను పిచ్చోడి గెటప్ లో ఉండలేక చావాలి.'

'మా అమ్మంటే ఎందుకంత భయం.?"

'ఎందుకా...ఇల్లు ఎక్కడ ఖాళీ చేయిస్తుందేమోనని ...అయినా మీ వంశంలో ఇలాంటి జబ్బేమిటి? నువ్వేమైనా క్లియోపాత్ర కిజిన్ వా? మీ అమ్మేమైనా శ్రీదేవి సిస్టరా? పెద్ద వయ్యారాలు పోతూ నీల్గుతారు?" చారుమతి కంఠం వినిపించడంతో ఉలిక్కిపడి, వెంటనే ఏం చేయాలో తోచక, షేవింగ్ క్రీమ్ మొహమంతా దట్టించి, బ్రష్ తో మొత్తం నురగ వచ్చేలా చేసుకున్నాడు. సాకేత్ గదిలోకి వచ్చి, అతని వాలకం చూసి భయంతో కెవ్వున కేకవేసింది చారుమతి.

రోగం కుదిరింది. మనసులో సంతోషంగా అనుకున్నాడు సాకేత్.

"అమ్మా అలా అరవకే...నిన్ను అతడేమైన చేస్తున్నాడేమోనని డాడి కంగారు పడతాడు" అంది తల్లీ కేకలు వేయడం చూసి.

"హ్హి హ్హి హ్హి ....నేనండి సాకేత్ ని టెనెంట్ ని అన్నాడు అప్పుడు పళ్ళు ఇకిలించి సాకేత్.

"నువ్వటయ్యా....ఇలా భయపెడతావా? గుండె ఆగి చచ్చేదాన్ని....అయినా నీకు మా అమ్మాయితో పనేమిటి?" అంది అనుమానంగా కూతురివైపు చూసి.

"ఆ విషయం మీ కూతుర్ని అడగండి" అన్నాడు వళ్ళు మండి సాకేత్.

"ఏంటే....నిన్నడగమంటున్నాడు. ఆ అబ్బాయి గదిలోకి ఎందుకొచ్చావు?" అడిగింది మరింత అనుమానంగా.

"చూడగానే ముద్దొచ్చాడు మమ్మీ...ఓ ముద్దు పెడతాడేమో అడిగిపోదామని" తాపీగా చెప్పింది నమ్రత.

"హవ్వ....హవ్వ....చూశారా చూశారా.....మీ అమ్మాయి ఎలా బరితెగించిందో...హమ్మో....ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను" అన్నాడు సాకేత్.

"అదేంటయ్యా....ఆడపిల్ల గలదాన్ని నేను భయపడాలి గాని, నువ్వు భయపడతావేంటి?" అంది చారుమతి.

"లేకపోతే....ఈ ఇంట్లో నా శీలానికి రక్షణ లేదు. ఈ క్షణమే నేను ఇల్లు ఖాళీ చేసి పోతాను." అన్నాడు సాకేత్.

"అదేంటి హీరో...నా లుక్కు పడ్డాక, నువ్వెక్కడికి పోతావు. మనిద్దరం గమ్ పేస్ట్ లా అతుక్కుపోవాలి. నువ్వు తుమ్మెదవి నేను పువ్వుని. నువ్వు తేనెవి, నేను పాలని, అంది వయ్యారాలు పోతూ నమ్రత.

"నమ్మీ ఏమిటే ఆ మాటలూ....అంటూ కూతుర్ని బలవంతంగా అక్కడ్నుంచి లాక్కెళ్ళింది చారుమతి. 'తప్పించుకున్నానని మిడిసిపడకు జేమ్స్ బాండ్....నిన్ను వదిలిపెట్టను" అంది వెళ్తూవెళ్తూ నమ్రత.